'రన్' మూవీ రివ్యూ

'రన్' మూవీ రివ్యూ - Sakshi


టైటిల్:  రన్

జానర్ : కామెడీ థ్రిల్లర్

తారాగణం : సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్, బాబీ సింహా, బ్రహ్మాజీ

సంగీతం : సాయి కార్తీక్

దర్శకత్వం : అనీ కన్నెగంటి

నిర్మాత : అనిల్ సుంకర



వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తరువాత హిట్ సినిమాను అందించటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న సందీప్ కిషన్, ఈసారి ఓ రీమేక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మళయాలం, తమిళ భాషలలో ఘనవిజయం సాధించిన నేరం సినిమాను రన్ పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. కేవలం ఒక్క రోజులో జరిగే కథను ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు రన్ టీం. మరి రన్ అయినా సందీప్ కిషన్ కెరీర్ను పరుగు పెట్టిస్తుందా..?



కథ :

సందీప్ కిషన్, ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పరిచయం అవుతాడు. తాను పనిచేసే కంపెనీలో సంక్షోంభం కారణంగా ఉద్యోగం కోల్పోతాడు. దీంతో అవసరాల కోసం వడ్డీ వ్యాపారం చేసే బాబీసింహా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంటాడు. అనుకున్న సమయానికి వడ్డీ డబ్బులు తిరిగి ఇవ్వలేకపోవడంతో బాబీ సింహా.. సందీప్ వెంట పడతాడు. అదే సమయంలో, ఉద్యోగం లేదని సందీప్ ప్రేమించిన అనీషా ఆంబ్రోస్ తండ్రి, వాళ్లిద్దరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఆ ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోతారు. అలా పారిపోయిన సందీప్.., బాబీ సింహా, అనీషా తండ్రి నుంచి ఎలా తప్పించుకున్నాడు. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడు అన్నదే మిగతా కథ.



విశ్లేషణ :

తన ప్రతీ సినిమాకు నటుడిగా మంచి పరిణతి కనబరుస్తున్న సందీప్ కిషన్, ఈ సినిమాలో కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్గా అనీషా తన పరిధి మేరకు ఆకట్టుకుంది. కీలక పాత్రలో కనిపించిన బ్రహ్మాజీ ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ పాత్ర, ఆ పాత్రను ఆయన పోషించిన తీరు సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. పోసాని కృష్ణ మురళి మరోసారి తన మార్క్ క్యారెక్టర్లో కనిపించాడు. ఒరిజినల్ వర్షన్లో నటించిన అదే పాత్రలో కనిపించిన బాబీ సింహా తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకున్నాడు.



అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య లాంటి ఫ్లాప్ సినిమాలు చేసిన దర్శకుడు అనీ కన్నెగంటి. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళయాల సినిమా నేరం రీమేక్గా తెరకెక్కిన రన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మళయాలం తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సినిమా కావటంతో దర్శకుడు తెలుగులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ముఖ్యంగా ఒక్కరోజులో జరిగే థ్రిల్లర్ సినిమా కావటంతో నేటివిటీ సమస్య కూడా పెద్దగా కనిపించలేదు. ఒక్క రోజులో జరిగే సంఘటనలను రేసీ స్క్రీన్ ప్లే తో రాసుకున్న దర్శకుడు ఆడియన్స్ కట్టిపడేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. ముఖ్యంగా సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.





ప్లస్ పాయింట్స్ :

కథ

బ్రహ్మాజీ క్యారెక్టర్

సినిమా నిడివి



మైనస్ పాయింట్స్ :

హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ



ఓవరాల్గా రన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top