‘రఫ్’ కోసం సిక్స్‌ప్యాక్ చేశా!

‘రఫ్’ కోసం సిక్స్‌ప్యాక్ చేశా! - Sakshi


ఆది ఆల్‌రౌండర్. క్లాస్, మాస్ సినిమాలకు న్యాయం చేయగలం. శక్తి సామర్థ్యాలు అతనిలో ఉన్నాయి. శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అభిలాష్ మాధవరం నిర్మించిన చిత్రమిది. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. సీహెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వం వహించారు. ఎమ్. సుదర్శనరావు సమర్పిస్తున్నారు. ‘‘నా ప్రయాణంలో ‘రఫ్’ సినిమా చాలా చాలా స్పెషల్. నా పెళ్లికి ముందు విడుదలవుతోంది.



 


ఈ సినిమా విజయవంతమైతే నాన్న కళ్లల్లో హ్యాపీనెస్ చూస్తాను. ఆయన ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు’’ అంటున్న హీరో ఆది ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆవిషయాలివీ...

 

భారీ బడ్జెట్!

‘‘నన్ను ఇంకో నాలుగు మెట్లు ఎక్కించే సినిమా ‘రఫ్’. నటుడిగా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డా. నూటికి నూరుశాతం నా టాలెంట్‌ని ఈ సినిమాలో పెట్టా. అందుకే ‘రఫ్’ గురించి చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వినోదం, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్స్... ఇలా అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉంటాయి. థియేటర్‌లోకి అడుగుపెట్టిన ఏ ప్రేక్షకుడూ నిరుత్సాహపడని రీతిలో ఈ కథని తీర్చిదిద్దారు దర్శకుడు సుబ్బారెడ్డి. ఆయనకి ఇదే తొలి చిత్రమైనా... ఎక్కడా అలా అనిపించలేదు. తొలిసారి చేసిన ఒక పక్కా కమర్షియల్ సినిమా కాబట్టి ఈ సినిమా రిజల్ట్ నాకు చాలా చాలా కీలకం. నా కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో తయారైంది.

 

చందు సరదాలు!

సినిమాలో నా పాత్ర పేరు చందు. ప్రేమ విషయంలో అతని ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది? నందు అనే అమ్మాయితో తనకి పరిచయం ఎలా ఏర్పడింది? అనే అంశాల్ని స్క్రీన్‌పైనే చూడాలి. చందు పంచే సరదాలు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి. రకుల్ ప్రీత్‌సింగ్ కూడా చాలా కష్టపడింది. ఆమె అందం సినిమాకు తప్పకుండా ప్లస్ అవుతుంది. ఇటీవల యూత్ రకుల్‌ని చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు. ఇందులో ఆమె మరింత అందంగా కనిపించింది. మణిశర్మ, సెంథిల్‌కుమార్ లాంటి టెక్నీషియన్లతో పనిచేయడం ఈ సినిమాతో నాకు దక్కిన మరో గొప్ప అవకాశం అని భావిస్తారు.

 

సిక్స్‌ప్యాక్ ఓ అవసరం!

‘‘అందరూ చేస్తున్నారు, నేనూ చేయాలి అని నేను సిక్స్‌ప్యాక్ బాడీ చేయలేదు. సినిమాకి అది అవసరమైంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిలో వైవిధ్యం చూపాలంటే సిక్స్‌ప్యాక్ చేయడమే కరెక్ట్ అనిపించింది. దర్శకుడు కూడా అదే చెప్పాడు. దీంతో దాదాపు ఎనిమిది నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ చేశా. దానివల్ల సినిమా కాస్త ఆలస్యమైంది. అయినా సరే ‘ఏం ఫరవాలేదు’ అంటూ నిర్మాత నన్ను ప్రోత్సహించారు. ఒక ఛాలెంజ్‌గా భావించి సిక్స్ ప్యాక్ బాడీని తయారు చేశా. ఇప్పుడు సినిమాల్లో ఆ ట్రెండ్ కూడా నడుస్తుండడం నాకు కలిసొచ్చిందని చెప్పొచ్చు.       - ఆది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top