కన్‌ఫ్యూజన్‌తో కామెడీ!

కన్‌ఫ్యూజన్‌తో కామెడీ! - Sakshi


కొత్త సినిమా గురూ!

చిత్రం:  ‘ఈడో రకం-ఆడో రకం’

తారాగణం: మంచు విష్ణు, రాజ్‌తరుణ్, సోనారిక, హెబ్బాపటేల్

మాటలు: డైమండ్ రత్నబాబు

సంగీతం: సాయికార్తీక్

ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి



ఎడల్డ్, శ్లాప్‌స్టిక్  కామెడీ (ఓవర్ డోస్‌లో ఫన్నీ యాక్షన్స్), కన్‌ఫ్యూజన్ కామెడీ చిత్రాలు ఇప్పుడు హిందీ చిత్రసీమలో సర్వసాధారణం. ఆ కోవకు చెందిన ‘వెల్కమ్’, ‘హౌస్‌ఫుల్’, ‘గ్రాండ్ మస్తీ’ అక్కడి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ సక్సెస్‌ఫుల్ ఫార్ము లా స్ఫూర్తితో ఇప్పుడు తెలుగులో ఆ తరహా కథాంశాలను రూపొందించడానికి దర్శక-నిర్మాతలు సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన ‘ఈడోరకం-ఆడోరకం’ ఆ తర హా చిత్రమని చెప్పొచ్చు. ట్రైలర్‌లో కన్‌ఫ్యూజన్ కామెడీ అని హింట్ ఇచ్చి, దర్శక-నిర్మాతలు ఈ సినిమా గురించి ముందే క్లారిటీ ఇచ్చేశారు.



ఇద్దరు జులాయి ఫ్రెండ్స్ ఒక పెళ్ళికి వెళ్ళి, అక్కడ హీరోయిన్‌ను చూసి, ఆ అమ్మాయి కోరికకు తగ్గట్లుగా మారడం కోసం ఆడిన ఒక అబద్ధం వల్ల... ఆ తరువాత ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో కామెడీగా చెప్పే కథ ఇది. పాత్రల మధ్య ఈ కన్‌ఫ్యూజన్ కామెడీ ఎంతవరకు నవ్వులు పూయించిందంటే...

 కథలో లాయర్ నారాయణ (రాజేంద్రప్రసాద్). అతని కొడుకు అర్జున్ (మంచు విష్ణు). బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చే స్తూ, తండ్రి చేతిలో తిట్లు తినడం మనవాడి డైలీ రొటీన్. అర్జున్ ఫ్రెండ్ అశ్విన్ (రాజ్‌తరుణ్).



ఇతనూ అంతే! కామన్ ఫ్రెండ్ కిశోర్ (‘వెన్నెల’ కిశోర్) పెళ్లికి వెళ్లినప్పుడు నీలవేణి (సోనారిక)తో అర్జున్, సుప్రియ (హెబ్బా పటేల్)తో అశ్విన్ ప్రేమలో పడతారు. అనాథనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆమె ప్రేమను దక్కించుకోవడానికి తాను అనాథనని అబద్ధమాడి, మెల్లగా ప్రేమలోకి దించుతాడు మంచు విష్ణు. చివరికి రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ కలిసి వేరు కాపురం పెడదామనుకుంటారు. ఇళ్ల వేటలో తిరిగి, హీరోయిన్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటుంది. తీరా చూస్తే - అది హీరో ఇంటి పై పోర్షనే.



ఇది ఊహించని ట్విస్ట్. అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మంచు విష్ణు తన ఫ్రెండైన రెండో హీరో రాజ్‌తరుణ్‌ని రంగంలోకి దింపుతాడు. హీరోయిన్‌కి భర్తగా ఇంట్లో అమ్మానాన్నలకు పరిచయం చేస్తాడు. అప్పటి నుంచి కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో రాజ్‌తరుణ్‌కీ, రెండో హీరోయిన్‌కీ పెళ్లి. తాను డబ్బున్నవాడినని చెప్పడం కోసం మంచు విష్ణు తండ్రిని తన తండ్రిగా చెప్పుకుంటాడు రాజ్‌తరుణ్. రకరకాల అబద్ధాలతో కథను ముందుకు నడుపుతారు.



ఈ క్రమంలో రెండు జంటలూ ఒకే ఇంట్లోకి చేరతాయి. ఫలితంగా ఒక హీరో పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మరొక హీరోకు భార్యగా నటించాల్సిన పరిస్థితి. మరి తమ అసలు రంగు బయటపడకుండా ఉండడం కోసం ఏం చేశారు? వీరు మిగతా పాత్రలకు సృష్టించిన ఈ కన్‌ఫ్యూజన్ చివరకు ఎలా క్లారిఫై అవుతుంది? అనేది మిగతా కథ. మొత్తం మీద, ఎడల్ట్ కామెడీని ఇష్టపడేవారికి నవ్వులకు కొదవలేని వెండితెర కథ.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top