యే మేరా జహా.. రేణు దేశాయ్

యే మేరా జహా.. రేణు దేశాయ్ - Sakshi


బద్రి సినిమాలో ‘బంగాళాఖాతంలో నీరంటే నీవేలే...’ పాట గుర్తుంది కదా! ఆ పాటలో పవన్‌తో మిస్సమ్మా.. అని అనిపించుకున్న రేణు తర్వాత నిజంగానే ఆయనకు మిస్సెస్ అయ్యింది. రెండేళ్ల కిందట పవన్‌కల్యాణ్‌తో విడాకులు తీసుకుని హైదరాబాద్‌ను ‘మిస్’ అయ్యింది. పుట్టిల్లు పుణే చేరిన రేణు సినీ నిర్మాణంలో ప్రతిభను చాటుకుంటుంది. నిర్మాతగా రెండో సినిమా, దర్శకురాలిగా తొలి సినిమా ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతోంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన రేణుదేశాయ్‌ని ‘సిటీ ప్లస్’ పలకరించింది. హైదరాబాద్‌ను పుట్టింటితో పోల్చిన రేణు.. సిటీతో తన అనుబంధాన్ని పంచుకుంది.

 

 అందరి విషయం ఎలా ఉన్నా.. నేను మాత్రం మెట్టినింటినే పుట్టింటిగా చెబుతాను. అవును.. నాకు హైదరాబాదే పుట్టిల్లు. పుణే అత్తిల్లు. ఎందుకంటే నా స్వీట్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ గడ్డపై అడుగుపెట్టి పదిహేనేళ్లవుతోంది. బద్రి సినిమా కోసం ఇక్కడికి వచ్చాను. అప్పట్లో నగరంలో మారుతి 800, ఎంబాసిడర్ కార్లే ఎక్కువ కనిపించేవి. ఇప్పుడు.. ఎయిర్‌పోర్టు నుంచి సిటీకి వస్తుంటే.. ఇది మన హైదరాబాదేనా అనిపిస్తోంది. మైగాడ్.. 11 కిలోమీటర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జ్. దానిపై ప్రయాణిస్తూ చాలా హ్యాపీగా ఫీలయ్యాను. గతంలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన జ్ఞాపకాలు.. ట్రాఫిక్ జామ్‌లు గుర్తొచ్చాయి. ఆడీ, స్కోడా కార్లతో పాటు కార్లలో తిరిగే ఆడవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఇన్నాళ్లకు మళ్లీ హైదరాబాద్ వచ్చిన నాకు ఇక్కడి ప్రతి దృశ్యం చాలా అపురూపంగా తోచింది.

 

 చట్నీస్‌లోని స్టీమ్ ఇడ్లీ

 రుచుల విషయంలో హైదరాబాద్‌ను మించింది మరొకటి లేదు. ఇక్కడ ప్రతి ఫుడ్ టేస్టీగా ఉంటుంది. నాకు చట్నీస్ రెస్టారెంట్లో స్టీమ్ ఇడ్లీ చాలా ఇష్టం. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెప్పించుకునేదాన్ని. అందులో ఇచ్చే చట్నీస్ సూపర్బ్. ఇక హైదరాబాద్‌కీ షాన్ ఇరానీ చాయ్ కూడా అదుర్స్. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఓపెల్ ఆస్ట్రా కారు కొన్నాను. అప్పట్లో.. సిటీలోని అన్ని ప్రాంతాలూ తిరిగేదాన్ని. బద్రి, జానీ షూటింగ్ స్పాట్లను ఎప్పటికీ మరచిపోలేను. ముఖ్యంగా గోల్కొండ టూంబ్స్. అక్కడ కొన్ని నెలలు షూటింగ్ జరిగింది. ఇలా సినిమాల కోసం నగరంలోని చాలా ప్రాంతాలను విజిట్ చేశాను.

 

 ఎంత మార్పో...

 బద్రి సినిమాతో నటిగా పరిచయమయ్యాను. ఆ తర్వాత ‘ఖుషి’ సినిమాలోని ‘ఏ మేరా జహా..’ పాటకు ఎడిటింగ్ నే నే చేశా. ఆ సినిమా టైటిల్స్‌లో అసిస్టెంట్ డెరైక్టర్ల లిస్ట్‌లో నా పేరూ కనిపిస్తుంది. తర్వాత జానీ సినిమాలో నటించడమే కాక, అసిస్టెంట్ డెరైక్టర్‌గానూ పనిచేశాను. వరుసగా కొన్నేళ్లపాటు షూటింగ్‌లో పాల్గొనడం వల్ల నగరంలో చాలా ప్రాంతాలను దగ్గరగా చూసే చాన్స్ వచ్చింది. పదిహేనేళ్ల కిందటి హైదరాబాద్‌కు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏమైనా.. నాకు కొత్త లైఫ్ ఇచ్చిన ఈ మహానగరం నాకెప్పుడూ ప్రత్యేకమే. ఇక నగరంలో నాకు ఇష్టమైన ప్లేస్ అంటారా.. (నవ్వుతూ) మీ అందరికీ తెలిసిందే నందగిరిహిల్స్.

 - భువనేశ్వరి

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top