ఇది రీమేక్స్ ఇయర్!

ఇది రీమేక్స్ ఇయర్! - Sakshi


 బాలీవుడ్

 గెలిచే గుర్రంపై పందెం కడితే గెలుపు మనదే. ఇది చిత్రసీమకూ వర్తిస్తుంది. కొత్త కథతో సినిమా తీయడంలో ఉన్న రిస్క్, ఆల్‌రెడీ బంపర్ హిట్ అయిన చిత్రాలు తీయడంలో ఉండదు. అందుకే ఇతర భాషల్లో విజయం సాధించిన చిత్రాలపై దర్శక, నిర్మాతలు దృష్టి పెడుతుంటారు. అలాగే తమ భాషలో రూపొందిన పాత చిత్రాలను కూడా రీమేక్ చేస్తుంటారు. రీమేక్ అనేది ఒక విధంగా ‘సేఫ్ గేమ్’ అనొచ్చు. అలా హిందీ రంగంలో... ప్రస్తుతం ఏడెనిమిది సేఫ్ గేమ్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...

 

 గబ్బర్ గెలుస్తాడా?

విజయ్‌కాంత్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘రమణ’ తెలుగులో చిరంజీవితో ‘ఠాగూర్’గా పునర్నిర్మితమైంది. రెండు భాషల్లోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ‘రమణ’ ఆధారంగా హిందీలో రూపొందిన చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’. అక్షయ్‌కుమార్, శ్రుతీహాసన్ జంటగా తెలుగు దర్శకుడు ‘క్రిష్’ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మే 1న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. మరి.. దక్షిణాదిన రెండు భాషల్లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఉత్తరాదిన ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి?

 

 నార్త్‌లోనూ... అంత దృశ్యం ఉంటుందా?

 కొన్ని కథలు ఏ భాషలవారికైనా నచ్చుతాయి. మలయాళ ‘దృశ్యం’ కథ అలాంటిదే. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యి, ఘనవిజయం సొంతం చేసుకుంది. హిందీలో ‘దృశ్యం’ పేరుతో రీమేక్ అవుతోంది. అజయ్ దేవగణ్, శ్రీయ జంటగా నిశికాంత్ కామత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పోలీసాఫీసర్ పాత్రను టబు చేస్తున్నారు. ఇప్పటికి మూడు భాషల్లో విజయం సాధించిన ఈ ‘దృశ్యం’ ఉత్తరాదివారిని హత్తుకుంటుందో, లేదో నాలుగైదు నెలల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే, ఈ చిత్రాన్ని అప్పుడు విడుదల చేయాలనుకుంటున్నారు.

 

 నాటి హీరోను  తలపిస్తుందా?

 దాదాపు 30 ఏళ్ల క్రితం జాకీ ష్రాఫ్, మీనాక్షీ శేషాద్రి జంటగా స్వీయదర్శకత్వంలో సుభాష్ ఘయ్ రూపొందించిన చిత్రం ‘హీరో’. ఈ సినిమాతో జాకీ, మీనాక్షీ స్టార్స్ అయిపోయారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు హీరో సల్మాన్ ఖాన్ పునర్నిర్మిస్తున్నారు. నటుడు ఆదిత్యా పంచోలీ తనయుడు సూరజ్ పంచోలీ, నటుడు సునీల్‌శెట్టి కుమార్తె అథియా శెట్టి ఈ చిత్రం ద్వారా నాయకా నాయికలుగా పరిచయమవుతున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరి.. నాటి ‘హీరో’లా నేటి ‘హీరో’ ఘనవిజయం సాధిస్తుందా?

 

 సౌత్‌లో హీరో కథ...నార్త్‌లో హీరోయిన్ కథ...

 తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మౌన గురు’ హిందీలో పునర్నిర్మితమవుతోంది. తమిళంలో కథానాయకుడు ప్రాధాన్యంగా సాగే ఈ చిత్రకథను హిందీలో కథానాయిక ప్రాధాన్యంగా సాగేట్లు మలిచి, దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. సోనాక్షీ సిన్హా కథానాయికగా ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి ‘అకిరా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం సోనాక్షీ సిన్హా పోరాటాలు నేర్చుకున్నారు. ఇందులో ప్రముఖ నటుడు, సోనాక్షీ సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది.

 

 అక్కడి ‘వారియర్’...ఇక్కడ బ్రదర్స్

 2011లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘వారియర్’ చిత్రం రీమేక్ హక్కులను కరణ్ జోహార్ పొందారు. ఈ చిత్రాన్ని ‘బ్రదర్స్’ పేరుతో కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో ఆయన పునర్నిర్మిస్తున్నారు. అక్షయ్‌కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ అతిథి పాత్ర చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం సిద్ధార్థ్ మల్హోత్రా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అక్షయ్ కుమార్‌కు ఆల్రెడీ ఈ కళ తెలుసు. హాలీవుడ్‌లో ‘వారియర్’కు భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. మరి.. హిందీలో ‘బ్రదర్స్’గా రీమేక్ అవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో?

 

 ఇవి కాకుండా తెలుగులో ఘనవిజయం సాధించిన ‘మగధీర’ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో తాను పోషించనున్న రెండు పాత్రల కోసం భారీ ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. అలాగే, తమిళంలో ఘనవిజయం సాధించిన ‘సూదు కవ్వుమ్’ చిత్రం కూడా హిందీలో పునర్నిర్మితం కానుంది. ఇంకా ఈ జాబితాలో చాలా చిత్రాలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ రీమేక్ చిత్రాలు రూపొందుతున్నాయి కాబట్టి, హిందీ రంగ పరంగా ఈ ఏడాది ‘రీమేక్స్ ఇయర్’ అని చెప్పొచ్చు.

          - డి.జి. భవాని

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top