యువరానర్..!

యువరానర్..!


‘పోలీసోడే కాదు... పోలీసోడి యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది’ అని ‘విక్రమార్కుడు’ చిత్రంలో పోలీస్ పాత్రలో రవితేజ చెప్పిన డైలాగ్‌కి విజిల్స్ పడ్డాయి. మరి... ఓ చిన్న సైజ్ న్యాయవాదిగా ‘యువర్ ఆనర్...’ అంటూ తన దైన స్పీడ్ డైలాగ్స్‌తో అదరగొడితే... విజిల్స్‌తో థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. రవితేజ లాయర్ పాత్ర చేయనున్నారని ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. గత ఏడాది విడుదలైన ‘బెంగాల్ టైగర్’ తర్వాత రవితేజ సినిమా ఇంకా సెట్స్‌కి వెళ్లలేదు.



దాంతో తదుపరి చిత్రం ఏంటి? అనే చర్చ సాగుతోంది. నూతన దర్శకుడు చక్రితో సినిమా చేయడానికి రవితేజ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌కి వెళుతుందనేది తెలియాల్సి ఉంది. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం ఫిలిం నగర్‌లో రవితేజ ‘మణిదన్’ అనే తమిళ చిత్రం రీమేక్‌లో నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. హిందీలో బొమన్ ఇరానీ, అర్షద్ వార్షీ ప్రధాన తారలుగా మూడేళ్ల క్రితం వచ్చిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ చిత్రమే ‘మణిదన్’గా తెరకెక్కింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం అక్కడి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంది.



ఓ సీనియర్ లాయర్‌తో పోరాడే ఓ జూనియర్ న్యాయవాది చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఇప్పటివరకూ రవితేజ న్యాయవాది పాత్ర చేయలేదు. ఒకవేళ ఈ చిత్రం రీమేక్‌లో ఆయన నటిస్తే, అప్పుడు ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త లుక్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. అలాగే, ఈ మధ్యకాలంలో రవితేజ చేసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top