వందల కోట్లుండి.. లక్షలు బిచ్చమేస్తారా?

వందల కోట్లుండి.. లక్షలు బిచ్చమేస్తారా?


చెన్నై వర్షాల మీద రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఎప్పటిలాగే దేవుడి మీద, సినిమా నటుల మీద తీవ్రస్థాయిలో సెటైర్లు వేశాడు. వందల కోట్లు ఉన్న సూపర్‌స్టార్లు కేవలం లక్షల్లో మాత్రమే విరాళాలు ప్రకటించడం, బాగా పెద్దనటులు కొంతమంది అసలు స్పందించకపోవడం, ఇంకొందరు కేవలం ప్రార్థనలతో సరిపెట్టేయడం.. అన్నింటినీ విమర్శించాడు. వర్మ ఏమన్నాడో ఆయన మాటల్లోనే...



''వర్షాలు కురిసేది దేవుడివల్లే కాబట్టి.. ప్రతిఒక్కరూ ప్రార్థించడానికి బదులు దేవుడిని విమర్శించాలి. లేకపోతే చెన్నైవాసులందరూ పాపులని, అందుకే దేవుడు శిక్షించాడని చెప్పాలి. చెన్నై వాసులను చూసి చాలా బాధపడుతున్నాను, సోకాల్డ్ దేవుడి మీద, ఆయన సాగించిన ఉగ్రవాద విధ్వంసం మీద పిచ్చ కోపంగా ఉన్నాను. సెలబ్రిటీలందరూ ప్రార్థించడానికి బదులు దేవుడి చర్యను ఖండించాలి.



ఇకనైనా ప్రజలు వెన్నుపోటుదారుడైన దేవుడిని నమ్మి సమయం వృథా చేసుకోడానికి బదులు తమ మీద తాము నమ్మకం పెట్టుకోవాలి. చెన్నైలో దేవుడు సృష్టించిన విధ్వంసం ముందు ప్రపంచంలో ఏ ఉగ్రవాద చర్య అయినా బలాదూరే. చెన్నై వాసుల కష్టాలు చూసి నా గుండె చెదిరిపోతోంది. అందుకే నేను రాయడానికి వీల్లేనంత దారుణమైన భాషలో దేవుడిని తిడుతున్నాను. చెన్నై కష్టాల నేపథ్యంలో దేవుడిని ప్రార్థించిన సెలబ్రిటీలందరినీ కూడా నేను ఖండిస్తున్నాను. ఇది ఉగ్రవాదిని ప్రార్థించడం లాంటిదే అవుతుంది. చెన్నైవాసులు ఇప్పటికైనా తమ దేవుడిని మార్చుకోవాలి.



వందల వందల కోట్లున్న సూపర్ స్టార్లు.. వేలవేల కోట్లు నస్టపోయిన చెన్నై వాసులకు ఐదు, పది లక్షలు బిచ్చమేయడం ఏంటి? అయ్యబాబోయ్.. సూపర్ స్టార్లు 10 లక్షలు, 5 లక్షలు ఇస్తే అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక చెన్నై ప్రజలు మూర్ఛపోతారు. దానికంటే ఇవ్వకపోవడం బెటర్. నా విషయానికొస్తే, నేనెప్పుడూ ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. నేను చాలా స్వార్థపరుడిని. సెలబ్రిటీలలా క్వింటాళ్ల కొద్దీ ప్రార్థనలు, టన్నులకొద్దీ ప్రేమ కురిపించలేను. ఆ సెలబ్రిటీలు కూడా ఇవన్నీ ఇస్తారు గానీ, రూపాయల దగ్గరకొచ్చేసరికి మాత్రం చాలా తక్కువ ఇస్తారు. ఎందుకంటే ప్రార్థనలు, ప్రేమ అంటే చవగ్గా వస్తాయి గానీ డబ్బులు కాదుకదా!''



కొసమెరుపు: అవును, అసలు ఈ వర్షాలను ఆపడానికి రజనీకాంత్ ఎందుకు ఏమీ చేయలేదోనని నేను ఆశ్చర్యపోతున్నాను.


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top