వాళ్లు రక్తం మరిగిన రాబందులు : వర్మ

వాళ్లు రక్తం మరిగిన రాబందులు : వర్మ


సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా తనదైన స్టైల్లో స్పందించే రాంగోపాల్ వర్మ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన జల్లికట్టు అంశంపై స్పందించాడు. అయితే సినీ పరిశ్రమ అంతా ఒక్క తాటి పైకి వచ్చి జల్లికట్టుకు మద్దతు తెలుపుతుంటే వర్మ మాత్రం జల్లికట్టు కోసం నిరసన తెలుపుతున్న ఆందోళన కారులపై నిప్పులు చెరిగాడు. ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలకు దిగాడు.



'ప్రభుత్వం సినిమాల్లో కాకులను, కుక్కలను చూపించడం కూడా నేరమని, సాంప్రదాయం పేరుతో ఎద్దులను రాక్షసంగా హింసించడాన్ని సమర్థిస్తోంది. ఆ ఎద్దులు చెవులు, కొమ్ములు విరిగిపోయి, తోక ఎముకలు తొలగి, ముక్కుకు కట్టిన తాడు వల్ల విపరీతమైన బాధను అనుభవించి మరణించటం అనాగరికం. అమాయకమైన జంతువులను హింసిస్తూ దానికి సాంప్రదాయం అని పేరు పెట్టుకొని తప్పించుకోలేరు.



జల్లికట్టును సమర్ధిస్తున్న ప్రతి ఒక్కరి మీదకు 100 ఎద్దులను వదలి ఆ తరువాత వాళ్ల ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి. జల్లికట్టు కోసం పోరాడుతున్న వారు అనాగరికులు, అందుకే ఓ జంతువును హింసించే హక్కు కోసం పోరాటం చేస్తున్నారు. అమాయక జంతువులను హింసించే జల్లికట్టు సాంప్రదాయం కరెక్ట్ అయితే అమాయక ప్రజలను హింసించే అల్ఖైదా కూడా కరెక్టే.



రక్షణ లేని జంతువులను సాంప్రదాయం పేరుతో ఆనందం కోసం హింసించటం టెర్రరిజం కన్నా ఘోరం. అలా ఒక మూగజీవాన్ని వేటాడం కన్నా ఓ మనిషి ఎందుకు వేటాడరు. జల్లికట్టుకోసం పోరాడుతున్న వారికి కనీసం సాంప్రదాయానికి స్పెల్లింగ్ కూడా తెలీదు. వారంతా రక్తం మరిగిన మానవ రూపంలో ఉన్న రాబందులు. ఆ జంతువులకు ఓటు హక్కు ఉండి ఉంటే ఒక్క రాజకీయ నేత కూడా జల్లికట్టుకు సపోర్ట్ చేసేవాడు కాదు'. అంటూ విమర్శించాడు వర్మ.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top