'కబాలి' తెలుగు ఫ్యాన్స్‌కి ఇది చేదువార్త!

'కబాలి' తెలుగు ఫ్యాన్స్‌కి ఇది చేదువార్త!


దక్షిణాది సూపర్‌ స్టార్ రజనీకాంత్ సినిమాలకు తమిళంలో ఎంత క్రేజ్‌ ఉందో తెలుగులోనే అంతే ఉంది. ఈ తమిళ సూపర్‌ హీరోకి తెలుగులోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడుకు దీటుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన సినిమాలు వసూళ్లు రాబడుతాయి. కాబట్టి రజనీ సినిమా అంటే తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల కావాల్సిందే. కానీ రజనీ తాజా సినిమా 'కబాలి' విషయానికొస్తే.. ఇది జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.



భారత తొలి ఫొటో రియలిస్టిక్‌ సినిమా రూపొందిన 'కొచ్చాడయన్‌' పరాజయం ఇంకా రజనీని వెంటాడుతూనే ఉంది. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకురాలిగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో 'విక్రమసింహ'గా విడుదలైంది. రజనీ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా తెలుగు హక్కులను లక్ష్మిగణపతి ఫిలింస్‌కు చెందిన శోభన్‌ బాబు భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ సినిమా మెగా అట్టర్‌ ప్లాప్‌ కావడంతో తీవ్రంగా నష్టపోయిన డిస్టిబ్యూటర్స్ తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ఒకవేళ ప్లాప్‌ అయితే, రూ. 7 కోట్లు పరిహారంగా ఇస్తానని ఒప్పుకున్నారని, కానీ ఈ సినిమాతో తాము భారీగా మునిగినా గ్యారెంటీగా పేర్కొన్న రూ. 7 కోట్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు.



ఈ ఫిర్యాదు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో తమ గ్యారెంటీ సొమ్ము తిరిగిచ్చేవరకు తెలుగులో ఈ సినిమా విడుదలను ఆపేయాలని నష్టపోయిన డిస్టిబ్యూటర్లు భావిస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో వచ్చే జూన్‌లో తెలుగులో ఈ సినిమా విడుదల సందేహామేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక వృద్ధ మాఫియా డాన్‌గా తనదైన స్టైల్‌తో, స్టామినాతో రజనీ 'కబాలి'గా విడుదలైన టీజర్‌ యుట్యూబ్‌లో సంచనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే కోటికిపైగా వ్యూస్ దక్కించుకున్న ఈ టీజర్‌ రికార్డులను బద్దలుకొడ్తూ దూసుకుపోతున్నది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top