'రారండోయ్ వేడుక చూద్దాం' మూవీ రివ్యూ




టైటిల్ : రారండోయ్ వేడుక చూద్దాం

జానర్ : ఫ్యామిలీ డ్రామా

తారాగణం : నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్, వెన్నెల కిశోర్

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల

నిర్మాత : నాగార్జున అక్కినేని



ప్రేమమ్ సినిమాతో హిట్ ట్రాక్లోకి వచ్చిన నాగచైతన్య, మరోసారి తనకు బాగా పట్టున్న ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్ లో రారండోయ్ వేడుక చూద్దాంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగార్జున కెరీర్లో స్పెషల్ సినిమాగా నిలిచిపోయిన నిన్నే పెళ్లాడతా తరహాలో.. నాగచైతన్య కెరీర్ను ఈ సినిమా మలుపు తిప్పుతుందని నమ్ముతున్నారు. మరి అక్కినేని అభిమానుల అంచనాలను రారండోయ్ వేడుక చూద్దాం అందుకుందా..? ఈ సినిమాతో చైతూ సక్సెస్ జర్నీ కంటిన్యూ చేశాడా..?



కథ :

భ్రమరాంబ.. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన పల్లెటూరి అమ్మాయి. గారాబంగా పెరిగిన భ్రమరాంబకు తండ్రి (సంపత్ ) అంటే ఎంతో ఇష్టం. తను అనుకున్నది ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేయటం భ్రమరాంబకు అలవాటు. ఒకసారి తన కజిన్ పెళ్లిలో భ్రమరాంబను చూసిన శివ (నాగచైతన్య) తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తరువాత భ్రమరాంబ కూడా ఉన్నత చదువుల కోసం వైజాగ్ రావటంతో ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఎప్పుడైతే తనని ప్రేమిస్తావో అప్పుడు నీకు దూరంగా వెళ్లిపోతానన్న కండిషన్తో శివతో స్నేహం చేస్తుంది భ్రమరాంబ. కానీ తరువాత శివ తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతనికి దూరమవుతుంది. అలా దూరమైన శివ, భ్రమరాంబ తిరిగి ఎలా కలిశారు..? వారిద్దరి కుటుంబాల మధ్య ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.



నటీనటులు :

ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో మాస్ ఆడియన్స్కు దగ్గరైన నాగచైతన్య మరోసారి తన మార్క్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాతో మెప్పించాడు. నటుడిగానూ మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా భ్రమరాంబతో విడిపోయే సన్నివేశాల్లో నాగచైతన్య నటన ఆకట్టుకుంటుంది. భ్రమరాంబగా రకుల్ ప్రీత్ సింగ్ సూపర్బ్గా ఉంది. హీరో నాగచైతన్యే అయినా కథ అంతా రకుల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. లుక్స్ పరంగా పల్లెటూరి అమ్మాయిగా అమాయకంగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్లో కంటతడి పెట్టించింది. తండ్రి పాత్రలో జగపతి బాబు, సంపత్లు మరోసారి తమ మార్క్ చూపించారు. వెన్నెల కిశోర్ కామెడీతో అలరించాడు.



సాంకేతిక నిపుణులు :

ముందు నుంచి నిన్నేపెళ్లాడతా స్థాయి సినిమా అంటూ ప్రచారం చేసినా దర్శకుడు ఆ స్థాయిని అందుకోవటంలో పూర్తిగా విఫలమయ్యాడు. రొటీన్ కథతో తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం ఎక్కడా నిన్నే పెళ్లాడతా రేంజ్ సినిమాగా కనిపించదు. ఫస్ట్ హాప్ అంతా హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలతో నడిపించేసిన దర్శకుడు చాలా వరకు బోర్ కొట్టించాడు. సెకండాఫ్లో అసలు కథ మొదలైన తరువాత మాత్రం సినిమా ఎక్కడా పట్టు తప్పకుండా ఎమోషనల్గా సాగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాగున్నా.. విజువల్గా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.



ప్లస్ పాయింట్స్ :

రకుల్ ప్రీత్ సింగ్, నాగచైతన్యల నటన

ఎమోషనల్ సీన్స్



మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ

ఫస్ట్ హాఫ్ నేరేషన్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top