నా కష్టాల గురించి ఏం చెప్పమంటారు!

నా కష్టాల గురించి ఏం చెప్పమంటారు!

ప్రియాంకా చోప్రా గాయాలపాలైంది. బాక్సింగ్ పంచింగ్ బ్యాగ్ బలంగా తగలడంతో వెల్లకిలా పడిపోయింది. కంటి కింద గీరుకు పోయింది. అసలీ ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయానికొస్తే- ప్రఖ్యాత బాక్సర్ మేరీకామ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘మేరీకామ్’ చిత్రంలో ప్రియాంక టైటిల్‌రోల్ పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రియాంకచోప్రా, ఓ విదేశీ నటుడు కాంబినేషన్‌లో చిత్ర దర్శకుడు ఒమాంగ్ కుమార్ బాక్సింగ్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశంలో భాగంగా ఆ విదేశీనటుడు పంచింగ్ బ్యాగ్‌ని బలంగా మోదాడు. 

 

 అది నేరుగా వచ్చి ప్రియాంకా చోప్రా కంటికి గుద్దుకుంది. దాంతో ఆమె వెల్లికిలా పడిపోయారు. కంటి కింద గీరుకుపోయింది. ఈ హఠాత్పరిణామం వల్ల దాదాపు గంటకు పైగా షూటింగ్ ఆగిపోయింది. గాయం కనబడకుండా మేకప్ చేసి షూటింగ్ మొదలుపెట్టారు. అయితే... మీడియాలో మాత్రం ప్రోస్తటిక్ మేకప్ వేసి గాయాన్ని కనబడకుండా చేశారనే వార్తలొచ్చాయి. దాన్ని ఒమాంగ్ కుమార్ ఖండించారు. ‘‘ఈ సినిమాలోని తన పాత్ర గురించి ప్రియాంక స్పందిస్తూ -‘‘ఈ సినిమాలో నా కష్టాల గురించి ఏం చెప్పమంటారు! ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నింటిలో అతి క్లిష్టమైన సినిమా ఇది. 

 

 మాటల్లో చెప్పలేనంత కష్టం. ఇందులోని ప్రతి సన్నివేశం నన్ను ఇన్‌స్పైర్ చేసింది. అందుకే కష్టాలు మరిచిపోయి ఈ సినిమా చేస్తున్నాను. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే ప్రతి మహిళకూ ఈ ‘మేరీకామ్’ అదర్శం’’ అన్నారు ప్రియాంకచోప్రా. ప్రియాంకాచోప్రా గొప్ప అందగత్తె మాత్రమే కాదు. మంచి నటి కూడా. ఇప్పటికే మూడు ఫిలింఫేర్ అవార్డులు, ఓ నేషనల్ అవార్డు ఆమె ఖాతాలో ఉన్నాయి. పాత్ర కోసం ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారామె. ఈ సినిమాకు కూడా నేషనల్ అవార్డు ఖాయం అనుకుంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top