రుద్రమదేవికి సీక్వెల్... ప్రతాపరుద్రుడు?


*** మన కాకతీయుల కథకు సంపూర్ణ ఆవిష్కరణ ప్రయత్నం

 *** ‘రుద్రమదేవి’లోనే సీక్వెల్‌కు లీడ్ సీన్స్  

 *** ‘ప్రతాపరుద్రుడు’గా చేసే హీరో ఎవరు?


 

 టైటిల్... ఆల్‌రెడీ ఓ.కె

‘రుద్రమదేవి’(‘ది వారియర్ క్వీన్’అనేది ట్యాగ్‌లైన్) చిత్రాన్ని నిర్మిస్తున్న గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పైనే ‘ప్రతాపరుద్రుడు’ (‘ది లాస్ట్ ఎంపరర్’ అనేది ట్యాగ్‌లైన్) అనే టైటిల్ ఫిల్మ్‌చాంబర్‌లో ఇటీవలే రిజిస్టర్ అయింది. టైటిల్‌కు ఆమోదం రావడంతోనే చిత్రయూనిట్ ఆ టైటిల్ లోగోను డిజైన్ చేయించి, సిద్ధం చేస్తోంది. ఇవన్నీ ‘రుద్రమదేవి’ సీక్వెల్ వార్తలకు బలం చేకూరుతున్నాయి.

 

 మన తెలుగువారి ఘన చరిత్రకూ, సంస్కృతికీ తెలుగు సినిమా మళ్ళీ పెద్ద పీట వేయనుందా? ఎన్టీయార్, ఏయన్నార్‌ల హయాంలో విరివిగా సాగి, ఆ తరువాత వెనకపట్టు పట్టిన ఈ విశిష్టమైన సెల్యులాయిడ్ కృషి ఇప్పుడు మళ్ళీ తెలుగు తెరపై ఊపందుకుంటోందా? హిస్టారికల్ ఫిల్మ్స్ తీయడానికి ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలుగువారి పౌరుషాన్నీ, ప్రతాపాన్నీ తమిళ, మలయాళ, కన్నడ, మరాఠా సీమల దాకా విస్తరించి, సువిశాల తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకతీయుల ఘనచరిత్రకు ఉదాహరణగా తాజాగా ‘రుద్రమదేవి’ సినిమా తయారైంది. దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో చేసిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రయత్నం సరిగ్గా నెల రోజుల్లో సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బాహుబలి’ ఘనవిజయం తరువాత ఈ చారిత్రక కథాచిత్రం పట్ల సినీప్రియులతో పాటు వ్యాపారవర్గాల్లోనూ ఆసక్తి, అంచనా ఇంకా పెరిగాయి.

 

 స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ బిజీ!

 ఈ నేపథ్యంలో గుణశేఖర్ సైతం దాదాపు 300 ఏళ్ళు మన దక్షిణాపథంలో అధిక ప్రాంతాన్ని పరిపాలించిన మన కాకతీయుల చరిత్రను సంపూర్ణంగా ఆవిష్కరించడానికి ‘రుద్రమదేవి’కి సీక్వెల్‌తో సిద్ధమవుతున్నట్లు కృష్ణానగర్ కబురు. రుద్రమదేవి అనంతరం ఆమె మనుమడు (కూతురి కొడుకు) - తిరుగులేని చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు హయాంలో కొనసాగిన కాకతీయ సామ్రాజ్య చరిత్రను ఈ సీక్వెల్‌లో చెబుతారు. వరంగల్ కోటను స్వాధీనం చేసుకోవడానికి ఏడుసార్లు దండెత్తి వచ్చిన ఢిల్లీ సుల్తానులతో వీరోచిత పోరాటం చేసిన మహాయోధుడు ప్రతాపరుద్రుడు. తమిళసీమలోని మదురై, కేరళ దాకా జయించిన చక్రవర్తి అతను. జీవితంలో బోలెడన్ని ఎమోషన్లు, సెంటిమెంట్, యాక్షన్ పార్ట్ ఉన్న ఈ కాకతీయ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి కథ కోసం ఇప్పటికే గుణశేఖర్ టీమ్ రీసెర్చ్ చేసింది. కథాంశం, టైటిల్ పాత్ర తీరుతెన్నులు, ప్రధాన ఘట్టాలతో ఇప్పటికే బేసిక్ స్క్రిప్ట్ తయారైంది. ఇప్పుడు పూర్తి నిడివి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

 

 ఆసక్తి చూపుతున్న అగ్ర హీరోలు!

 అనుష్క టైటిల్ రోల్ చేస్తున్న ‘రుద్రమదేవి’లో కృష్ణంరాజు, ప్రకాశ్‌రాజ్ సహా దాదాపు 40 మంది దాకా పేరున్న, సుపరిచిత ఆర్టిస్టులు పాత్రలు ధరిస్తున్నారు. ఇంత భారీ తారాగణంతో, సుమారు రూ. 70 కోట్ల ఖర్చుతో, హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా ‘రుద్రమదేవి’ని గుణశేఖర్ త్రీడీలో అందిస్తున్నారు. రుద్రమదేవే స్వయంగా పట్టాభిషేకం చేసిన ఆమె మనుమడు ‘ప్రతాపరుద్రుడు’ హీరో ఓరియెంటెడ్ కథ. పైగా, యాక్షన్ పార్ట్, యుద్ధం సీన్లు కూడా ఎక్కువగా ఉండే ఎమోషనల్ స్టోరీ. తెరకెక్కించడానికి మరింత భారీ వ్యయమయ్యే ఆ స్క్రిప్ట్‌లో టైటిల్‌రోల్ ఏ హీరో చేస్తారన్నది కూడా ఆసక్తికరమైన విషయమే.

 

 ‘రుద్రమదేవి’ కథలోని కొన్ని పాత్రలు, సన్నివేశాలు ‘ప్రతాపరుద్రుడు’ కథలో కూడా కొనసాగుతాయి. కాబట్టి, అనుష్క సహా పలువురు మళ్ళీ సీక్వెల్‌లో కూడా ఉంటారని ఊహించవచ్చు. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడిగా దగ్గుబాటి రానా నటించేశారు. కాబట్టి, సీక్వెల్‌లో టైటిల్ రోల్ ఎవరిదన్నది ఇప్పుడు కృష్ణానగర్‌లో హాట్‌టాపిక్. మహేశ్‌బాబు, చిన్న ఎన్టీయార్, రామ్‌చరణ్ లాంటి యువ హీరోలలో ఒకరు ‘ప్రతాపరుద్రుడు’గా చేస్తారని ఒక టాక్. కాగా, కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిపోయే ఈ పాత్ర కోసం 150వ సినిమా మైలురాయి దగ్గరున్న చిరంజీవి, నూరో సినిమా చేయనున్న బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు మొగ్గినా ఆశ్చర్యపోనక్కర లేదని మరో వాదన. మొత్తానికి, పలువురు హీరోలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి రాబోయే రోజుల్లో మరిన్ని ఊహాగానాలు పెరగడం ఖాయం.  

 

 ఫస్ట్ పార్ట్‌లోనే... సెకండ్ పార్ట్‌కు లీడ్!

 ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యకలాపాల్లో ‘రుద్రమదేవి’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. నాలుగేళ్ళ పాటు ఢిల్లీ గద్దెనెక్కిన రజియా సుల్తానా మొదలు ఆధునిక కాలంలోని ఇందిరా గాంధీ దాకా భారతదేశంలో మరే పాలకురాలూ పాలించనంతగా దాదాపు 40 ఏళ్ళు సామ్రాజ్యాన్ని నడిపిన వీరనారి ‘రుద్రమదేవి’. తండ్రితో అనుబంధం, భర్తతో ప్రేమావేశం, కూతురితో పేగుబంధం, మనుమడితో కర్తవ్యపాశం - ఇలా రకరకాల షేడ్స్ ఉన్న పాత్ర తన కెరీర్‌లో మరపురానిదని అనుష్క చెప్పారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళాల్లో, హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది.




 ‘రుద్రమదేవి’ సినిమా చివరలో రాబోయే సీక్వెల్‌కు తగ్గట్లు పసివాడైన ప్రతాపరుద్రుడి సీన్లు కూడా ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ సీన్స్ ద్వారా సీక్వెల్ ‘ప్రతాపరుద్రుడు... ది లాస్ట్ ఎంపరర్’కు శ్రీకారం చుట్టినట్లవుతుంది. చిన్నప్పటి ప్రతాపరుద్రుడి పాత్రకు కూడా ప్రముఖ హీరోల వారసుడైన బాల నటుడొకరు కనిపించే సూచనలున్నాయి. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియడానికి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే!

 

 తెరపై చరిత్ర హిట్టే!

 మొత్తానికి, చిన్నప్పుడు చదివిన పాఠం స్ఫూర్తితో, 2002 నాటి నుంచి గుణశేఖర్ మనసులో తిరుగుతున్న ‘రుద్రమదేవి’ ఆలోచన ఇన్నాళ్ళకు ఇలా తెరపైకి ఎక్కిన క్రమం ఆసక్తికరమే. పెద్ద ఎన్టీయార్ ‘సమ్రాట్ అశోక’ (1992) తరువాత దాదాపు ఇరవై మూడేళ్ళకు తెలుగులో వస్తున్న భారీ స్టార్‌క్యాస్ట్ హిస్టారికల్ ఫిల్మ్ ఇదే. గతంలో తెలుగు తెరపై వచ్చిన ‘పల్నాటి యుద్ధం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరసు’, ‘అల్లూరి సీతారామరాజు’ లాంటి చారిత్రక కథాచిత్రాల్లో నూటికి 95 శాతం హిట్లే. ఆ కోవలోనే ‘రుద్రమదేవి’ని ఆదరిస్తే, గుణశేఖర్ బృందం మూడేళ్ళపాటు రాత్రింబగళ్ళు చేసిన సృజనాత్మక కృషికి గుర్తింపు దక్కినట్లే! మన తెలుగు జాతి చరిత్ర అయిన ‘రుద్రమదేవి’తో పాటు ‘ప్రతాపరుద్రుడు’ కథ కూడా భావితరాలకు సిల్వర్‌స్క్రీన్ పాఠ్యాంశంగా కలకాలం నిలిచే ఛాన్స్ కచ్చితంగా వచ్చినట్లే!!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top