మా సినిమా మహేశ్‌బాబు చూడాలి : అర్జున్ కపూర్

మా సినిమా మహేశ్‌బాబు చూడాలి : అర్జున్ కపూర్


‘‘తెలుగు, తమిళ పరిశ్రమల్లో చాలామంది అద్భుతమైన హీరోలున్నారు. అందుకని, నన్నిక్కడికి తీసుకురావాలని ఏ నిర్మాతా అనుకోరు. ఒకవేళ అడిగితే.. కచ్చితంగా దక్షిణాది సినిమాలు చేస్తా’’ అని చెప్పారు హిందీ హీరో అర్జున్ కపూర్. ‘ఇషక్ జాదే’ చిత్రంతో హీరోగారంగప్రవేశం చేసి, వరుసగా సినిమాలు చేస్తున్నారు అర్జున్. వాస్తవానికి దర్శకుడు కావాలనేది ఆయన కోరిక. మరోవైపు తన తండ్రి బోనీకపూర్‌లా నిర్మాత కూడా కావాలన్నది ఆయన ఆశయం. ప్రస్తుతం అర్జున్ కపూర్, సోనాక్షీ సిన్హా జంటగా నటించిన చిత్రం ‘తేవర్’ (‘ఒక్కడు’కి రీమేక్). వచ్చే నెల 9న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అర్జున్ కపూర్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...

 

 ‘ఒక్కడు’ రీమేక్ ఒప్పుకున్న తర్వాత ఆ సినిమా చూశారా? లేక ఆ సినిమా చూసి, రీమేక్ చేయాలనిపించిందా?


 వాస్తవానికి నేను మహేశ్‌బాబు సినిమాలేవీ చూడలేదు. నాన్న (బోనీకపూర్) ఈ సినిమా చూసి, హిందీలో చేస్తే బాగుంటుందనుకున్నారు. నాలుగేళ్ళ క్రితమే ఇది జరిగింది. అప్పుడు నాకీ సినిమా చూపించారు. ఒక అమ్మాయిని కాపాడటం కోసం ఓ అబ్బాయి ఏం చేశాడు? అనేది కథ. ఆ అమ్మాయితో అతనికే బంధుత్వమూ ఉండదు. అనుకోకుండా తారసపడుతుంది. తననుంచి ఏమీ ఆశించకుండా ఆ అమ్మాయికి సహాయం చేసే ఆ అబ్బాయి నాకు చాలా నచ్చాడు. ఆ అబ్బాయిగా చేయాలనుకున్నా. అందుకే ఈ రీమేక్‌లో నటించాను.

 

 మహేశ్‌తో పరిచయం ఉందా? ఈ సినిమా సంగతి చెప్పారా?

 మహేశ్‌బాబుని వ్యక్తిగతంగా నేనెప్పుడూ కలవలేదు. ఈ సినిమా చేయాలనుకున్న తర్వాత నేను ఫోన్ చేసి, మాట్లాడాను. అప్పుడాయన ‘ఇది చాలా మంచి సినిమా’ అని నాకు శుభాకాంక్షలు చెప్పారు. మహేశ్ చాలా బాగా మాట్లాడారు. ఈ సినిమా ప్రారంభమయ్యాక, ఆయనకు పోస్టర్స్ కూడా పంపించాను. ఈ చిత్రాన్ని మహేశ్ చూడాలని నా కోరిక.

 

 ‘ఒక్కడు’లో హీరో, హీరోయిన్‌కి చార్మినార్ పెద్ద అండ. మరి ‘తేవర్’లో?

 మేం తాజ్‌మహల్ నేపథ్యంలో తీశాం. ఆగ్రా వెళ్లి, అక్కడే ఎక్కువ రోజులు షూటింగ్ చేశాం. నేను అంతకుముందెప్పుడూ తాజ్‌మహల్ చూడలేదు. మొదటిసారి చూడగానే వింత అనుభూతికి గురయ్యాను. చాలా నచ్చింది. లొకేషన్ నచ్చడం, సీన్స్ అన్నీ ఆసక్తికరంగా ఉండటంతో అసలు షూటింగ్ చేసినట్లుగానే అనిపించలేదు. ఓ పిక్నిక్‌లా అనిపించింది.

 

 ‘ఒక్కడు’ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చార్మినార్ సెట్ వేశారు.. మరి, తాజ్‌మహల్ సెట్ వేయాలని మీ నిర్మాతకు అనిపించలేదా?

 మహేశ్ చాలా పెద్ద స్టార్. ఆయన చార్మినార్‌కి దగ్గరికెళ్లి షూటింగ్ చేస్తే జరుగుతుందా చెప్పండి? అందుకని సెట్ వేసి ఉంటారు. ఆయనతో నన్ను పోల్చుకోలేను. అఫ్‌కోర్స్ నాకూ పాపులర్టీ ఉంది. తగిన సెక్యూరిటీ లేకుండా తాజ్‌మహల్ దగ్గరికెళితే, జనాలు గుమిగూడిపోతారు. అందుకే, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నాం. జనాల సహకారంతో షూటింగ్ సాగింది.

 

 మీ చిత్రాల్లో నిర్మాణవ ్యయ పరంగా ఇది పెద్ద సినిమాయేమో?

 అవును. ఓ కొడుకు కోసం ఒక తండ్రి ఎంత ఖర్చుపెట్టడానికైనా రెడీ అవుతారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా నాన్నగారు ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమాకి నాన్న ఎంత డబ్బు ఖర్చుపెట్టారనే సంగతి పక్కన పెడితే, ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఎక్కువ సమయం నాన్నతో గడిపే అవకాశం దక్కింది. కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం.. ఇవన్నీ తీపిగుర్తులు.

 

 బహుశా తన రెండో భార్య శ్రీదేవి, కుమార్తెలు జాన్వీ, ఖుషీతో కలిసి ఉంటారు కాబట్టి, మీ నాన్నగారితో ఎక్కువ సమయం గడిపే వీలు లేదేమో?

 అవును మేం విడి విడిగా ఉంటాం. ఫోన్లో మాట్లాడుకుంటాం. నా షూటింగ్స్‌తో నేను బిజీ. నాన్న సినిమాలు నిర్మిస్తుంటారు కాబట్టి, ఆయన కూడ బిజీగా ఉంటారు. తీరిక చిక్కినప్పుడు కలుస్తుంటాం.

 

 ‘తేవర్’ చిత్రం రషెస్‌ని శ్రీదేవిగారు చూశారా?

 ఆమె చెన్నయ్‌లో ఉన్నారనుకుంటున్నా. తమిళ సినిమాలో నటిస్తున్నారు కదా. ‘తేవర్’ని ఆమె చూశారో లేదో నాకు తెలియదు. మా నాన్నగారు రషెస్ చూశారు. ఆయన హ్యపీగా ఉన్నారు. దర్శకుడు అమిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు.

 

 శ్రీదేవితో మీ అనుబంధం గురించి చెబుతారా?

 కొంచెం తెలిసినవాళ్లతో ఎలాంటి అనుబంధం ఉంటుందో ఆమెతో కూడా అంతే. అంతకన్నా ఎక్కువ లేదు. శ్రీదేవిగారంటే గౌరవం ఉంది. శ్రీదేవిగారితో నేను మాట్లాడేది చాలా తక్కువ. ఎవరి జీవితం వాళ్లది.

 

 ఒకప్పుడు 140 కిలోల బరువు ఉండేవారట.

 తగ్గడానికి నాకు నాలుగేళ్లు పట్టింది. దీనికి సల్మాన్‌ఖాన్ ఆదర్శం. ఆయన ప్రోత్సాహం వల్లే ఈరోజు ఇలా ఉన్నాను. ప్రయత్నిస్తే.. బరువు తగ్గవచ్చనీ, హీరోగా చేయొచ్చనీ సల్మాన్‌ఖాన్ అన్నారు. ఆ మాటలు నా మీద బాగా పని చేశాయి. అలాగే, నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరవలేనిది.

 

 పాత్ర డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా రెడీయా?

 రెడీ. ‘గుండే’లో చొక్కా విప్పాను. అప్పుడు కొంచెం వర్కవుట్ చేశాను. ‘2 స్టేట్స్’లో అలియా భట్ యంగ్‌గా కనిపిస్తుంది కాబట్టి, తనకు తగ్గట్టుగా కనిపించడానికి నేను సన్నబడ్డాను. ఇప్పుడు ‘తేవర్’లో మేన్లీగా కనిపించాలి కాబట్టి, కొంచెం కండలు పెంచాను. ఇలా సినిమా సినిమాకీ ఏదో ఒకటి చేస్తుంటాను.

 

 తెలుగు హీరోల్లో మీకెవరితో అయినా పరిచయం ఉందా?


 రానా బాగా తెలుసు. మొన్న శనివారం కలిశాను. రామ్‌చరణ్‌ని ఒకట్రెండుసార్లు కలిశాను. ‘వాంటెడ్’ షూటింగ్ అప్పుడు.. ఆ లొకేషన్‌కి సమీపంలో ఎన్టీఆర్ షూటింగ్ కూడా జరిగింది. ఆ సినిమా పేరు గుర్తు రావడంలేదు. కానీ, ఆ లోకేషన్‌కి వెళ్లి, ఎన్టీఆర్‌ని కలిశాను. చాలా స్వీట్ పర్సన్. బాగా మాట్లాడారు.

 

 తెలుగు చిత్రాలు చూస్తుంటారా?

 చూస్తుంటా. ఇక్కడి సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఏదైనా తెలుగు సినిమా బాగుందని తెలిస్తే చూస్తుంటాను. అలాగే, ఏ హీరో ఏ సినిమాలు చేస్తున్నారో తెలుసుకుంటుంటాను.

 

 మరి.. మీ లవ్ లైఫ్ గురించి మేం తెలుసుకోవాలనుకుంటున్నాం... సోనాక్షీ సిన్హా.. మీరూ?

 మేమ్దిద్దరం మంచి స్నేహితులం. చిన్నప్పట్నుంచీ తెలుసు కాబట్టి క్లోజ్‌గా ఉంటాం. అంతకన్నా ఏమీ లేదు.

 

 శ్రుతీ డాన్స్ సూపర్!

 ఈ సినిమా కోసం ముందు శ్రుతీహాసన్ ‘జోగనియాన్..’ పాటను అద్భుతంగా పాడింది. అందుకని, ‘మేడమియా..’ పాటను కూడా తనతోనే పాడించాలనుకున్నాం. శ్రుతి నాకెప్పట్నుంచో తెలుసు. తెలుగు, తమిళ సినిమాల్లో తన డాన్సులు చూశాను. చాలా బ్రహ్మాండంగా చేస్తుంది. అందుకే, ‘మేడమియా...’ పాటను పాడటమే కాదు.. తనే డాన్స్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అడగ్గానే ఒప్పుకుంది. హిందీలో ఇప్పటివరకు ఆమె ఇలాంటి పాట చేయలేదు. ఈ పాట ‘తేవర్’కి ప్రత్యేక ఆకర్షణ.

 

 - డి.జి. భవాని


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top