మూవీ రివ్యూ: ఫాంటమ్

మూవీ రివ్యూ: ఫాంటమ్


టైటిల్: ఫాంటమ్

జానర్: ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్

తారాగణం: సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్

రచన, దర్శకత్వం: కబీర్ ఖాన్

నిర్మాత్: సాజిద్ నదియావాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్

రచన: కబీర్ ఖాన్, కౌసర్ మునీర్

స్క్రీన్ ప్లే: కబీర్ ఖాన్, పర్వేజ్ షేక్




మూల కథ: హుస్సేన్ జైదీ రచన 'ముంబై అవెంజర్స్'

సంగీతం: ప్రీతమ్, కేకే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జూలియస్ పాకియామ్

సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా

ఎడిటింగ్: ఆరిఫ్ షేక్

విడుదల: 28 ఆగస్ట్, 2015

నిడివి: 135 నిమిషాలు

బడ్జెట్: 55 కోట్లు



చరిత్ర పొడవునా ఎన్నోన్నె దురాక్రమణలు, అంతకు రెట్టింపు దాడులను తట్టుకుని తనదైన శైలిలో సాగిపోతున్న భారతావని.. దానికి పశ్చిమాన అరేబియా సముద్రతీరంలో దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై నగరం.. ఆ నగరానికి మకుటం లాంటి తాజ్ మహల్ హోటల్..



నెరిసిన తల, పొడవాటి గడ్డంతో తాజ్ ముందు ఫుట్పాత్పై సైకిల్ మీద టీ అమ్మే ముసలాయన ముఖంలో గొప్ప వెలుగు. సంతోషంగా అందరికీ టీ ఇస్తుంటాడు. అక్కడే నిల్చున్న హీరోయిన్ కత్రినా కైఫ్కు కూడా టీ ఇస్తాడు. 'క్షమించండి, నా దగ్గర డబ్బుల్లేవ్' అన్న కత్రినాతో... నవ్వుతూ ఇలా అంటాడు.. 'ఫర్లేదమ్మా, ఈ రోజు ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోను. ఎందుకో తెలుసా.. (తాజ్ను చూపిస్తూ) ఇదిగో ఈ హోటల్లోనే నా కొడుకు వెయిటర్గా పనిచేసేవాడు. ఆ రోజు రాత్రి చనిపోయినవాళ్లలో వాడు కూడా ఉన్నాడు. నా కొడుకుతోపాటు వందల మందిని పొట్టనపెట్టుకున్న ఆ రాక్షసులు హతమయ్యారని ఈ రోజు వార్తల్లో చెప్పారు. అది విని నాకు చాలా ఆనందం కలిగింది. ఏడేళ్ల తర్వాతగానీ నా కొడుకు ఆత్మకు శాంతి దొరికిందనిపించింది. అందుకే అందరికీ ఉచితంగా టీ ఇస్తున్నా..'                                 


                                  ***         ***         ***         ***



ఫాంటమ్ సినిమాలో ఇది ఆఖరు సీన్. ఉన్మాదాన్ని మించిన ఉగ్రవాద కార్యకలాపాలతో భారత్ను ఇబ్బందులపాలుచేస్తూ, ఇక్కడి అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నపాకిస్థానీ ముష్కర ముఠాల నాయకులను ఏమీ చేయలేమా? సాక్ష్యాధారాలు లేవు. ఉన్నా వాటిని పాకిస్థాన్ కోర్టులు విశ్వసించవు. మరెలా? ఈ మారణహోమం తప్పక కొనసాగాల్సిందేనా? అనే ప్రశ్నలకు దర్శకుడు కబీర్ ఖాన్ చెప్పిన ఊహాజనిత సమాధానమే ఫాంటమ్ సినిమా. హుస్సేన్ జైదీ రాసిన 'ముంబై అవెంజర్స్' పుస్తకానికి వెండితెర రూపం.



నిజానికి ఫాంటమ్ ఓ ఊహాజనిత కామిక్ హీరో. తన గురించిన సమాచారాన్ని బయటికి తెలియనివ్వకుండా, సమాజానికి చేటుచేసే కేటుగాళ్ల భరతం పడతాడు. ఈ సినిమా ఫాంటమ్ కూడా అంతే. భారత్లో విధ్వంసాలు సృష్టిస్తూ, పాకిస్థాన్, ఇతర దేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్స్ను అంతమొందిస్తాడు.



కథలోకి వెళితే..

డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, సహచర జవాన్ ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు ఇండియన్ ఆర్మీ నుంచి తొలగింపునకు గురవుతాడు ధనియాల్ ఖాన్ (సైఫ్ అలీ ఖాన్). కొద్దికాలానికి ఆర్మీ రికార్డుల్లో అతని పేరు కూడా మాయం అవుతుంది. పాకిస్థాన్కు కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికి ఓ యువ ఆఫీసర్ చెప్పిన ఐడియాను అతి కష్టం మీద అంగీకరిస్తాడు రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) చీఫ్. ప్లాన్ సిద్ధమవుతుంది.


 


కానీ దాన్ని అమలు చేయగల ధీరోదాత్తుడు కావాలి. అంతటి సమర్థుడి కోసం దేశంలోని అన్ని భద్రతా బలగాల్లో పనిచేస్తున్న జవాన్ల జాబితాను జల్లెడపడతారు. ఆఖరికి ఫాంటమ్లా తన వివరాలను బయటికి తెలియనివ్వకుండా సుదూర ప్రాంతంలో జీవిస్తోన్న ధనియాల్ ఖాన్ పేరును ఫిక్స్ అవుతారు. తీవ్రంగా గాలించి, అతని జాడ తెలుసుకుని,  ఈ ఆపరేషన్ నువ్వు మాత్రమే చెయ్యగలవంటారు రా అధికారులు. మొదటి నిరాకరించినా, ఈ పనితో ప్రాణాలు కోల్పోయిన తన సహచరుడి ఆత్మకు శాంతి దొరుకుతుందని, సైన్యంలోకి తిరిగి సగర్వంగా చేరొచ్చనే హామీతో రంగంలోకి దిగుతాడు ధనియాల్ ఖాన్.



విదేశాల్లో ప్రతీకార హత్యలు

సాజిద్ మిర్.. ప్రస్తుతం లండన్లో ఉంటున్న అతడు, ముంబైలో మారణహోమం సృష్టించిన కసబ్ గ్యాంగ్కు శిక్షణ ఇవ్వడమేకాక, దాడి సమయంలో ఫోన్ ద్వారా ఆదేశాలు జారీచేసిన వ్యక్తి. అతడి జాడ కనిపెట్టేందుకు లండన్ వెళ్లిన ధనియాల్కు సహాయకారిగా వస్తుంది నవాజ్ మిస్త్రీ (కత్రినా కైఫ్), ఓ రహస్య కన్సల్టెన్సీలో పనిచేసే ఆమె ఇండియన్ పార్సీ. వివిధ దేశాల గూఢచార సంస్థలు ఆ కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకూంటూ ఉంటారు. సాజిద్ను చంపే క్రమంలో ధనియాల్ ప్రదర్శించిన దూకుడు నచ్చక గుడ్ బై చెప్పి వెళ్లిపోతుంది నవాజ్. కట్ చేస్తే..



చికాగోలోని జైలు. ముంబై దాడుల్లో తనదైన పాత్ర పోషించి, ఆ తరువాత అరెస్టయిన డేవిడ్ హెడ్లీ ప్రస్తుతం ఉంటోన్న జైలు. నాటకీయ రీతిలో ఆ జైలులోకి ప్రవేశించిన ధనియాల్.. హెడ్లీ స్నానం చేసే నీళ్లలో విషం కలిపి వాణ్ని చంపేస్తాడు. ఇక మిగిలిని ఇద్దరు మాస్టర్ మైండ్స్ హఫీజ్ సయ్యద్, సబాహుద్దీన్ ఉమ్వి (అసలు పేరు జకీ ఉర్ రహమాన్ లఖ్వీ)లను అంతం చేసేందుకు పాకిస్థాన్ వెళ్లాలనుకుని, అందుకు సాయం చేయమని నవాజ్ (కత్రినా)ను కోరతాడు ధనియాల్. తాజ్పై దాడి ఆమెను కూడా బాధించి ఉంటుంది కాబట్టి హీరోతో కలిసి తాను కూడా పాకిస్థాన్కు పయనమవుతుంది నవాజ్.



పాక్ వీధుల్లో ధనియాల్ సాహసాలు

సినిమా సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్థాన్లోనే. ఓ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్న హపీజ్ సయ్యద్ను అంతం చేయడానికి.. సభలో అతడు మాట్లాడబోయే మైకులో బాంబు పెడతాడు ధనియాల్. మరోవైపు జైలులో ఉన్న లఖ్వీని చంపేందుకు అతడికి ఎంతో నమ్మకస్తుడైన డాక్టర్ దగ్గర పనిచేసే నర్స్ సహాయం కోరతాడు. నాయకులు నూరిపోసే జీహాద్ మత్తులోపడి ప్రాణత్యాగాలకు సిద్ధపడుతున్న ఎందరో పాకిస్థానీ యువకులు వాళ్ల తల్లులకు గర్భశోకం మిగుల్చుతున్నారు. అలాంటి తల్లులకు ప్రతినిధే ఈ నర్స్. తన కొడుకులాంటి ఇంకొందరు ఉగ్రవాదానికి బలి కాకూడదనే ఉద్దేశంతో ఇంజక్షన్ను మార్చేస్తుంది. అలా విషపు ఇంజక్షన్తో లఖ్వీ చస్తాడు.



ఇటు లాహోర్ బహిరంగ సభకు తాను కూడా వెళ్లిన ధనియాల్.. బాంబును పేల్చేలోగా అతడి ప్లాన్, ఫోటో సహా పూర్తి వివరాలు ఐఎస్ఐకి తెలిసిపోతాయి. దీంతో హఫీజ్ బాంబు దాడి నుంచి తప్పించుకుంటాడు. అతడ్ని వెంటాడి మరీ చంపుతాడు ధనియాల్ ఖాన్. చంపేముందు ఒక్క మాట చెబుతాడు. 'హఫీజ్ సయ్యద్.. ఈ ఇండియాకు ఏం కావాలి? అని పదే పదే ప్రశ్నిస్తావు కదా. సమాధానం చెప్తా విను.. ఇండియాకు కావాల్సింది న్యాయం'



చట్టమంటూ ఒకటుంది!

బహుశా ఇలాంటి న్యాయాన్నే భారతదేశంలోని అధిక సంఖ్యాకులు కోరుతూ ఉండొచ్చు. కానీ చట్టమంటూ ఒకటుంటుంది. ఎంతటి సముచిత న్యాయమైనా చట్టం పరిధిలోనే జరగాలే తప్ప మరోలా జరగవద్దనేది లిఖిత శాసనం. అందుకే మొత్తం ఆపరేషన్ను భారత ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే (అడిగినా ఇవ్వదు కాబట్టి) నిర్వహిస్తారు రా అధికారులు. అంతెందుకు.. ఆపరేషన్ పూర్తి చేసి జల మార్గం గుండా భారత్కు తిరిగొస్తూ నడి సముద్రంలో చిక్కుకున్న ధనియార్ ఖాన్, నవాజ్లను కాపాడటానికి నేవీ అధికారులు అంగీకరించరు. పాక్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడం చట్ట విరుద్ధం కాబట్టి వారు ఆపని చేయలేరు. చివరికి రా అధికారి ఒత్తిడితో వాళ్లను కాపాడటానికి వెళతారు. కానీ అప్పటికే బుల్లెట్ దెబ్బలు తిన్న ధనియాల్ ఖాన్ చనిపోయి నీటమునుగుతాడు.



దటీజ్ పవర్ ఆఫ్ రివేంజ్

సాధారణంగానే రివేంజ్ స్టోరీస్లో ఓ కిక్ ఉంటుంది. దాన్ని ప్రేక్షకులకు సమగ్రంగా అందించడంలో సఫలీకృతుడయ్యాడు దర్శకుడు కబీర్ ఖాన్. కథలో ఏం జరగబోతుందో ముందే తెలినప్పటికీ బిగుతైన కథనం ప్రేక్షకుడికి నిమిషం పాటైనా బోర్ కొట్టించదు. ముందే చెప్పుకున్నట్లు ఇది ఫిక్షన్ సినిమా కాబట్టి విదేశాల్లో, శత్రుదేశంలో హీరో చేసే సాహసాలు, ఆర్మీ రికార్డుల్లో అతడి పేరు గల్లంతు, ఐఎస్ఐతో బేరసారాలు తదితర అంశాల్లో లాజిక్ వెతుక్కోవాల్సిన పనిలేదు. పాక్- అమెరికా సంబంధాలు, ధనియాల్ ఫొటోను సాధించడంకోసం భారత్లో ఐఎస్ఐ ఏజెంట్లు బాహాటంగా తిరగడం, సిరియాలో యుద్ధవాతావరణం తదితర సీన్లు రియలిస్టిక్గా గోచరిస్తాయి.



కబీర్ కు పాకిస్థానంటే అంత ప్రేమెందుకు?

హైదరాబాదీ అయిన కబీర్ ఖాన్.. పాకిస్థాన్పై తనకున్న అదోరకమైన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. 2006 నుంచి అతడు తీసిన ఐదు సినిమాలకు బ్యాక్ డ్రాప్ పాకిస్థానే కావడం విశేషం. ఇక ఇప్పటికే వయసు మీదపడిపోయిన హీరో సైఫ్ అలీ ఖాన్కు చాలా కాలం తర్వాత మంచి హిట్ దొరికిందని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత ధనియాల్ ఖాన్ పాత్రకు అతడే సరైన వ్యక్తి అని ప్రతిఒక్కరు ఫీలవుతారు. ఇక నవాజ్ పాత్రలో హీరోతోపాటు సాహసాలు చేస్తూ కత్రినా కైఫ్ మెప్పించింది. సొంతగా చెప్పుకున్న హిందీ డబ్బింగ్లో ఇంగ్లీష్ యాక్సెంట్ స్పష్టంగా వినబడుతున్నప్పటికీ తెరపై ఆమె అభినయం ముందు అది చాలా చిన్న విషయంగా కనబడుతుంది. సైఫ్, కత్రినా తప్ప మిగతా పాత్రధారులందరూ అంతగా గుర్తింపులేనివారే.



కొసమెరుపు

పాకిస్థాన్లో ఈ సినిమాను నిషేధించడం నూటికి నూరుపాళ్లు న్యాయమే. ఎందుకంటే ఏ దేశమైనాసరే, తాను తప్పుచేస్తున్నప్పటికీ, తనను నిందిస్తూ, తన పౌరులను అంతమొందించే కథాంశంతో రూపొందిన సినిమా (అది ఫిక్షనే అయినప్పటికీ)ను అంగీకరిస్తుందని మనం భావించాల్సిన అవసరంలేదు. ఆ విధంగా సినిమాకు ముందు 'ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఏ వ్యక్తినిగానీ లేదా సంస్థను గానీ ఉద్దేశించినవి కావు. పూర్తిగా కల్పితాలు' అని ఫాంటమ్ రూపకర్తలు చెప్పడం రొటీన్ వ్యవహారమే తప్ప నిజం కాదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top