సినిమా రివ్యూ: 'పైసా'

సినిమా రివ్యూ: 'పైసా'

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, 'ఈగ' చిత్రం విజయం తర్వాత నాని కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'పైసా'. ఆరంభంలో 'పైసా' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే అనేక సమస్యలతో విడుదల బాగా ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకూ శుక్రవారం ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక అడ్డంకులను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పైసా' చిత్రం కథేంటో చూద్దాం!

 

డబ్బులంటే విపరీతమైన పిచ్చి ఉండే ప్రకాశ్ (నాని) హైదరాబాద్ పాతబస్తీలో ఓ మోడల్. జీవితంలో కోటి రూపాయలు సంపాదించి సెటిలైపోవాలనుకుంటాడు. పాతబస్తీలో ఉండే నూర్ (కేథెరీనా థెరిసా) అంటే ప్రకాశ్ కు ఇష్టం. అలాగే ప్రకాశ్ అంటే నూర్ కు చెప్పలేనంత ప్రేమ. పైసా అంటే పడిచచ్చే ప్రకాశ్ కు అనుకోకుండా యాభై కోట్ల రూపాయలు చేతికి చిక్కుతాయి. ప్రకాశ్ కు చిక్కిన యాభై కోట్లు ఎక్కడివి? యాభై కోట్ల రూపాయలు దక్కించుకోవడానికి ప్రకాశ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? భారీ మొత్తంలో చిక్కిన సొమ్ము చివరికి ఏమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే 'పైసా' చిత్రం. 

 

ప్రస్తుత తరం హీరోల్లో నాని ఈగ చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా తర్వాత  చాలా గ్యాప్ వచ్చిన నానికి ఈ చిత్రంలోని ప్రకాశ్ పాత్ర టైలర్ మేడ్ క్యారెక్టర్. నటుడిగా నిరూపించుకోవడానికి లభించిన ప్రకాశ్ పాత్రను నాని చక్కగా ఉపయోగించుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ పాత్రలో తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్, పాటలతో ఆలరించిన నాని కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ ను చక్కగా పలికించాడు. పైసా చిత్రంలోని ప్రకాష్ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేకూర్చాడని చెప్పవచ్చు. 

 

'ఇద్దరు అమ్మాయిలు' చిత్రం తర్వాత కేథరిన్ థెరిసాకు మంచి పాత్రే లభించింది. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని.. పర్వాలేదనిపించింది. గ్లామర్ తో పాటు, పెర్మార్మెన్స్ తో కూడా కేథరిన్ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే కూతురుగా స్వీటీ పాత్రలో కనిపించిన సిద్దికా శర్మ అందాల ఆరబోతకే పరిమితమైంది. నాని ఫ్రెండ్ గా డ్రైవర్ పాత్రలో నటించిన తాబర్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. విలన్ పాత్రలో చరణ్ రాజ్, సిద్దార్థ్ రెడ్డి, ఆర్ కే, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్ సినిమాకు సపోర్టింగ్ గా నిలిచారు. చిలక జ్యోతిష్కుడి పాత్రలో కొద్దిసేపే కనిపించిన వేణు తన హస్యంతో ఆకట్టుకున్నాడు. 

 

విశ్లేషణ:

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో నెలకొన్న పరిస్థితులను సెంటర్ పాయింట్ గా చేసుకుని, దానికి ప్రేమ కథను జోడించి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ పైసా చిత్రాన్ని రూపొందించారు. చిత్రమంతా పాతబస్తీలోని చార్మినార్ నేపథ్యంగా సాగుతుంది. పాతబస్తీలో ఉండే పరిస్థితులను కృష్ణవంశీ చక్కగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో పతంగి సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు కృష్ణవంశీ క్రియేటివిటీకి అద్దం పడుతుంది.  చార్నినార్ వద్ద నాని తో చేయించిన ఓ లెంగ్తీ ఎపిసోడ్, హోలీ సీన్ లు బ్రహ్మండంగా ఉన్నాయి. ఈ చిత్ర ఫస్టాఫ్ ను పర్వాలేదనిపించే రితీలో తెరకెక్కించిన కృష్ణవంశీ.. సెకండాఫ్ లో కొంత గందరగోళమే సృష్టించాడు. కథకు ఉండే పరిమితుల వల్ల కథనంలో గందరగోళం తప్పలేదు. చేజారిన డబ్బును దక్కించుకోవడానికి కొన్ని బ్యాచ్ లు, అనుకోకుండా చేజిక్కిన డబ్బును కాపాడుకోవడానికి నాని వేసే ఎత్తులతో సెకండాఫ్ చేజింగ్ కొంత రొటిన్ గా అనిపించింది. పెద్దగా పేరున్న ఆర్టిస్టులు విలన్ పాత్రల్లో కనిపించకపోవడం ఈ చిత్రానికి మైనస్. సెకండరీ గ్రేడ్ విలన్ పాత్రలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే సెకండాఫ్ చేజింగ్ కథనం ప్రేక్షకుడ్ని ఆకట్టుకుంటుందా అనేది సందేహమే. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ ను పలికించడంలో తనదైన మార్క్ ను కృష్ణవంశీ చూపించాడని చెప్పవచ్చు. గత కొద్దికాలంగా టాలీవుడ్ కు దూరమయ్యారనే ఫీలింగ్ కలిగించిన కృష్ణవంశీ ప్రస్తుత ట్రెండ్ ను మిస్ అవుతున్నాడా అనే ప్రశ్నను రేకెత్తించారు. 

 

ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. పైసాలో చిత్రంలో టెంపోను కొనసాగించడానికి రీరికార్డింగ్ బాగా ఉపయోగపడింది. పాటల్లో 'నీతో ఏదో' పిక్చరైజేషన్ బాగుంది. 'జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నటు నాకు క్యాష్ కావాలి', 'పైసా ఎవర్నైనా పాగల్ (పిచ్చి) వాణ్ని చేస్తుంది' లాంటి డైలాగ్స్ అక్కడక్కడ ఆకట్టుకున్నాయి. పాతబస్తీ పరిస్థితులను సంతోష్ రాయ్ చక్కగా తెరకెక్కించారు. 

 

ఎప్పటిమాదిరిగానే కృష్ణవంశీని ఎక్కువ ఆశించి సినిమా కెళ్లిన ప్రేక్షకుడికి నిరాశ కలిగినా.. నాని తన ఫెర్మార్మెన్స్ తో చక్కటి విందును ఇచ్చాడని చెప్పవచ్చు. పైసా కోసం వెంపర్లాడితే కష్టాలు తప్పవనే సందేశంతో క్రియెటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అందించిన ఈ చిత్రం నిర్మాతలకు 'పైసా' వసూలు చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top