ఆస్కార్‌కూ ‘ట్రంప్‌’ మంటలు!

ఉత్తమ నటీనటులు(ఇన్‌సెట్‌: అవార్డును తిరస్కరించిన అస్ఘర్‌ ఫర్హాదీ)


- ముస్లిం దేశాలపై నిషేధానికి నిరసనగా వేడుకలకు రాని ఇరాన్‌ డైరెక్టర్‌ అస్ఘర్‌ ఫర్హాదీ

- ట్రంప్‌ విధానాలపై మండిపాటు

- ఆరు ఆస్కార్‌లు గెల్చుకున్న ‘లా లా ల్యాండ్‌’

- ఉత్తమ చిత్రంగా మూన్‌లైట్‌




‘ట్రంప్‌’మంటలు ఆస్కార్‌ అవార్డులకూ పాకాయి! ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని నిరసిస్తూ ఇరాన్‌కు చెందిన చిత్ర దర్శకుడు అస్ఘర్‌ ఫర్హాదీ... అవార్డు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఉత్తమ విదేశీ విభాగంలో ‘ది సేల్స్‌మేన్‌’ ఆస్కార్‌ను గెల్చుకోగా.. అవార్డును అందుకునేందుకు ఆయన రావాల్సి ఉంది. అయితే ట్రంప్‌ విధానాలపై మండిపడుతూ ఈ కార్యక్రమానికి ఫర్హాదీ దూరంగా ఉండిపోయారు. ఇదిలా ఉండగా ఈసారి ఉత్తమ చిత్రంగా ‘మూన్‌లైట్‌’ఎంపికైంది. ఈ చిత్రం మొత్తం మూడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 14 కేటగిరీల్లో నామినేట్‌ అయిన ‘లా లా ల్యాండ్‌’చిత్రానికి ఆరు అవార్డులు దక్కాయి.



ఒక్క అడుగు... భగవంతుణ్ణి అదొక్కటీ అడుగు... లైఫ్‌లో ఒక్కసారైనా ఆస్కార్‌తో అడుగేయాలని అడుగు... చిత్రసీమలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఆస్కార్‌ గెలిచి, అవార్డు వేదికపై ఓ అడుగేయాలనుకుంటారు. కొందరికి ఛాన్స్‌ త్వరగా వస్తుంది. మరికొందరికి లేటుగా వస్తుంది. అవకాశం ఎప్పుడొచ్చినా ఆస్కార్‌ అందుకున్న తర్వాత వేసే మొదటి అడుగు లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఉత్తమ నటి, నటుడు, దర్శకుడు, సహాయ నటి, సహాయ నటుడు, సంగీత దర్శకుడు... 89వ ఆస్కార్స్‌లో ముఖ్యమైన కేటగిరీల్లో తొలి అవార్డు (ఫస్ట్‌ స్టెప్‌) గెల్చుకున్నోళ్లు ఎక్కువమందే ఉన్నారు. ఈ ఫస్ట్‌ స్టెప్‌ మరిన్ని సక్సెస్‌ స్టెప్స్‌ వేసే జోష్, ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటూ... కంగ్రాచ్యులేషన్స్‌ టు ఆస్కార్‌ విన్నర్స్‌.



2017 ఆస్కార్‌ విజేతలు వీరే

ఉత్తమ చిత్రం: మూన్‌లైట్‌; ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్‌ (మాంచెస్టర్‌ బై ద సీ); ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్‌ (లా లా ల్యాండ్‌) ; ఉత్తమ దర్శకుడు: డామీన్‌ చాజెల్లె (లా లా ల్యాండ్‌) ; ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ (మూన్ లైట్‌) ; ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్‌ (ఫెన్సెస్‌) ; ఉత్తమ మేకప్‌ మరియు హెయిర్‌ స్టైల్‌: సూసైడ్‌ స్క్వాడ్‌ చిత్రం ; ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్  చిత్రం: ఫెంటాస్టిక్‌ బీస్టస్‌ ; ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్‌ ఇన్  అమెరికా ; ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: అరైవల్‌ ; ఉత్తమ సౌండ్‌ ; మిక్సింగ్‌ చిత్రం: హాక్సారిడ్జ్‌ ; ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: జాన్‌ గిల్‌బర్ట్‌ ; ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్‌మ్యాన్  (ఇరాన్ ) ; బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌: జూటోపియా ; బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌: పైపర్‌ ; ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్  చిత్రం: లా లా ల్యాండ్‌ ; బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్టస్‌: ద జంగిల్‌ బుక్‌ ; బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌: ద వైట్‌ హెల్మెట్స్‌ ; బెస్ట్‌ లైవ్‌ యాక్షన్  షార్ట్‌: సింగ్‌ ; బెస్ట్‌ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్‌ ; బెస్ట్‌ ఒరి జినల్‌ ; స్కోర్‌: లా లా లాండ్‌ ; బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌: సిటీ ఆఫ్‌ స్టార్స్‌ (లా లా ల్యాండ్‌) ; బెస్ట్‌ ఒరిజినల్‌ స్కీన్ర్‌ప్లే: మాంచెస్టర్‌ బై ద సీ ; బెస్ట్‌ అడాప్టెడ్‌ స్కీన్ర్‌ప్లే: మూన్‌లైట్‌



ఆ గీత చెరగాలి – అస్ఘర్‌ ఫర్హాదీ

ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఇరానియన్‌ మూవీ ‘ది సేల్స్‌మేన్‌’కు అవార్డు దక్కింది. ఆ చిత్రదర్శకుడు అస్ఘర్‌ ఫర్హాదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పట్ల తన ఆగ్రహావేదనను వ్యక్తం చేశారు. ‘‘ముస్లిమ్‌ దేశాలపై ట్రంప్‌ విధించిన ‘ట్రావెల్‌ బ్యాన్‌’కు నిరసనగా ఈ అవార్డు వేడుకకు హాజరు కాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. తన మనోభావాలను లిఖితపూర్వకంగా ఆస్కార్‌ అవార్డు కమిటీకి పంపించారు.


‘‘పలు ముస్లిమ్‌ దేశాల పౌరులపై ట్రంప్‌ ఆంక్షలు విధించారు. ఆ దేశాలను, అక్కడి ప్రజలను గౌరవిస్తున్నాను. అందుకే అవార్డు తీసుకోవడానికి రాలేదు. ప్రపంచాన్ని మనము, మన శత్రువులు అని విభజించడం భయంగా ఉంది. యుద్ధానికి దారి తీసే ఘోరమైన నిర్ణయాలివి. ఇది సరికాదు. ఫిలిం మేకర్స్‌ తమ కెమేరాలను ఎక్కుపెట్టి కుల, మతాలనే అడ్డుగోడను చెరిపేయగలరు. ‘మేము, ఇతరులు.. అనే ఆ ఇద్దరి మధ్య సమానత్వాన్ని పెంపొందించగలరు. ఈరోజు ఆ సమానత్వం చాలా అవసరం’’ అంటూ అస్ఘర్‌ మనోభావాలను హోస్ట్‌ చదివారు. విన్న వీక్షకులు ఉద్వేగానికి గురయ్యారు. కొందరు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.



నా హార్ట్‌ ముక్కలైందన్నాడు!   – ఉత్తమ నటుడు క్యాసే ఎఫ్లెక్‌

ఉత్తమ నటుడిగా క్యాసే ఎఫ్లెక్‌ పేరు ప్రకటించగానే, అతడు సీట్‌లో నుంచి వెంటనే లేచి తన అన్నయ్య బెన్‌ ఎఫ్లెక్‌ వద్దకు వెళ్లి కౌగిలించుకున్నారు. ఆల్రెడీ ఉత్తమ చిత్రం (నిర్మాతగా), బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే (మాట్‌ డామన్‌తో కలసి).. రెండు సార్లు్ల బెన్‌ ఎఫ్లెక్‌ ఆస్కార్స్‌ అందుకున్నారు. ఇప్పుడు క్యాసే ఎఫ్లెక్‌కి అవార్డు రావడంతో ఆస్కార్స్‌ అందుకున్న సిబ్లింగ్స్‌ (తోబుట్టువులు) లిస్టులో ఈ అన్నదమ్ములిద్దరూ 16వ స్థానం సంపాదించారు.


ఇక, అవార్డు స్వీకరించిన తర్వాత క్యాసే ఎఫ్లెక్‌ మాట్లాడుతూ – ‘‘నాకు ఎలా నటించాలో నేర్పిన మొదటి వ్యక్తుల్లో దర్శక–నటుడు డెంజెల్‌ వాషింగ్టన్‌ ఒకరు. జస్ట్‌.. ఇప్పుడే ఆయన్ను కలిశాను. థాంక్యూ! ఈ అవార్డు నాకెంతో విలువైనది. ఆస్కార్‌ కమ్యూనిటీలో భాగం కావడం నా అదృష్టం. ఇంతకు మించి మాటలు రావడం లేదు. ‘మాంచెస్టర్‌ బై ద సీ’ యూనిట్‌ సభ్యులకు థ్యాంక్స్‌. బెన్‌... ఐ లవ్‌ యూ’’ అన్నారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ స్పీచ్‌లో అన్నయ్య బెన్‌ ఎఫ్లెక్‌ పేరును క్యాసే ప్రస్తావించలేదు కానీ, మాజీ భార్య గురించి పేర్కొన్నారు. ఈ ఆస్కార్స్‌ స్పీచ్‌లో పిల్లలతో పాటు మాజీ భార్య పేరు మర్చిపోయారు. ‘‘ఆస్కార్‌ వేదిక దిగిన మూడు సెకన్లకు నా ఫోన్‌ మోగింది. ‘మా గురించి చెప్పడం మర్చిపోయావ్‌. నా హార్ట్‌ ముక్కలైంది’ అని మా అబ్బాయి అన్నాడు’’ అని బ్యాక్‌ స్టేజిలో క్యాసే ఎఫ్లెక్‌ పేర్కొన్నారు.



ఆస్కార్‌ అందుకున్న తొలి ముస్లిం

ఇలాంటి పాత్రలకు బానిసను  – ఉత్తమ సహాయ నటుడు మహేర్షలా అలీ

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డును అందుకున్న తొలి ముస్లిమ్‌ వ్యక్తిగా మహేర్షలా అలీ (43) చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది ఆస్కార్‌ ఉత్తమ చిత్రం ‘మూన్‌ లైట్‌’లో ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా  మహేర్షలా అలీకు ఆస్కార్‌ అవార్డు దక్కింది. ఈ చిత్రంలో అలీ డ్రగ్‌ డీలర్‌ జువాన్‌ పాత్రలో ఒదిగిపోయారు. జెఫ్‌ బ్రిడ్జెస్, హెడ్జెస్, దేవ్‌ పటేల్, షానూన్‌ వంటి అగ్రనటులతో పోటీపడి అలీ ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.


‘లయన్‌’ చిత్రంతో సహాయ నటుడి విభాగంలో నిలిచిన భారత సంతతి నటుడు దేవ్‌ పటేల్‌కు నిరాశే ఎదురైంది. అవార్డు తీసుకున్న తర్వాత  మహేర్షలా అలీ ఉద్వేగభరితమైన స్పీచ్‌ ఇచ్చారు. ‘‘మూన్‌ లైట్‌’ వంటి సినిమాల్లోని పాత్రలకు నేను  బానిసను. ఈ చిత్రదర్శకుడు బెర్రిజెన్‌ కిన్స్‌కు థ్యాంక్స్‌. నటన నేర్చుకోవడంలో నాకు సహకరించిన టీచర్స్, ప్రొఫెసర్స్‌ అందరికీ ధన్యవాదాలు. ‘ఏ అవార్డు అయినా మనకు ఇచ్చినది కాదు.  చిత్రంలోని పాత్రకు ఇచ్చినది’ అని వాళ్లు అనేవాళ్లు. నా ఫీలింగ్‌ కూడా అదే. నా భార్య సామి కరీమ్‌కు రుణపడి ఉంటాను’’ అన్నారు.


2013లో సామి కరీమ్‌తో మహేర్షల వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితమే కరీమ్‌ ఓ పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు భర్త ఆస్కార్‌ అందుకున్నారు. దీంతో  మహేర్షల దంపతులు డబుల్‌ హ్యాపీ. ఆ సంగతలా ఉంచితే, వాస్తవానికి అలీ క్రిస్టియన్‌ అనీ, అయితే ఓ సందర్భంలో మసీదుకు వెళ్లి వచ్చిన తరువాత ముస్లిమ్‌గా మారారని సమాచారం. అతను అహ్మదీయుడు అనేది కొందరి వాదన. వాదించుకునేవాళ్లు వాదించుకుంటూనే ఉంటారు. ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేని  మహేర్షలనిండు మనసుతో శుభాకాంక్షలు చెబుతున్నవాళ్లకు ధన్యవాదాలు తెలియజేయడంలోనూ, ఇప్పుడే తన జీవితంలోకి వచ్చిన పసి పాపను అపురూపంగా చూసుకోవడంలోనూ బిజీ అయ్యారు.



లా లా.. లవ్‌లో పడ్డా – ఉత్తమ దర్శకుడు డామీన్‌ ఛాజెల్లె

ఇప్పటివరకూ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్స్‌ అందుకున్న వ్యక్తుల్లో డామీన్‌ ఛాజెల్లె (‘లా లా ల్యాండ్‌’ దర్శకుడు) చిన్నోడిగా చరిత్ర సృష్టించారు. అతడి వయసు 32 ఏళ్లు. ఫస్ట్‌ టైమ్‌ ఆస్కార్‌ అందుకున్న డామీన్‌ మాట్లాడుతూ – ‘‘ప్రేమ గురించి చెప్పిన సినిమా ‘లా లా ల్యాండ్‌’. ఈ సినిమా తీస్తున్న టైమ్‌లోనే నేను ప్రేమలో పడడం నా అదృష్టం. దీనర్థం... నాతో పాటు నువ్వూ (డామీన్‌ ప్రేయసి ఒలీవియా హామిల్టన్‌) ఈ అవార్డును పంచుకున్నట్లే’’ అన్నారు.



ఆ శరీరాలను తవ్వి బయటకు తీయాలి! – ఉత్తమ సహాయ నటి వయోలా డేవిస్‌

‘‘మీకో విషయం తెలుసా? అత్యంత ప్రతిభావంతులందరూ కలిసుండే చోటు ఒకటుంది. అదే శ్మశానం’’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ వయోలా డేవిస్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రచయిత ఆగస్ట్‌ విల్సన్‌ రాసిన ‘ఫెన్సెస్‌’ అనే కథ ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. 2005లో ఆగస్ట్‌ విల్సన్‌ చనిపోయారు. ఆయన రాసిన కథలోని పాత్ర  తనకు అవార్డు తెచ్చిపెట్టినందుకుగాను ఆస్కార్‌ వేదికపై వయోలా ఆయన్ను గుర్తు చేసుకున్నారు.


ఇంకా వయోలా మాట్లాడుతూ – ‘‘నువ్వు ఎలాంటి కథలు చెప్పాలనుకుంటావ్‌? అని కొంతమంది నన్ను అడుగుతుంటారు. ‘తవ్వి, పాతిపెట్టిన ఆ శరీరాలను బయటకు తీయాలి. ఆ మనుషుల కథలను తెలుసుకోవాలి. పెద్ద పెద్ద కలలు కని, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడి, ఫలాలు అందుకోని ఆ వ్యక్తుల కథలు చెప్పాలనిపిస్తుంది’ అంటుంటాను’ అన్నారు. ఆగస్ట్‌ విల్సన్‌ వంటి ప్రతిభావంతుల మరణాన్ని ఉద్దేశించే ఆమె ఇంత ఉద్వేగంగా మాట్లాడారు.


‘‘నేను ఆర్టిస్టును అయ్యాను. అందుకు దేవుడికి రుణపడి ఉంటాను. సెలబ్రిటీల హోదాలో బ్రతికేందుకు ఇదొక మంచి ప్రొఫెషన్‌. ఎలా జీవించాలో, ఎలా ప్రేమించాలో ప్రతి రోజూ.. నాకు నేర్పే నా భర్త , నా కూతురికి రుణపడి ఉంటాను. డైరెక్టర్‌ డెంజెల్‌ వాషింగ్టన్‌కు ధ్యాంక్స్‌’’ అని వయోలా డేవిస్‌  అన్నారు. మూడు సార్లు ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయిన, తొలి ఆస్కార్‌ అవార్డు అందుకున్న అమెరికన్‌– అఫ్రికన్‌ వుమెన్‌గా వయోలా రికార్డ్‌ సాధించారు.



తప్పు తప్పే.. శుద్ధ తప్పే!

ఏం జరిగింది? ఓ చిత్రం పేరుకు బదులు మరో చిత్రం పేరును చదివారు. చెప్పుకోవడానికి చిన్న తప్పే! కానీ, ఏదో పొరపాటు జరిగిందని సర్దిచెప్పుకోవడానికి వీలు లేని తప్పు జరిగింది. ఈ తప్పే కాదు.. ఇంకో శుద్ధ తప్పు కూడా జరిగింది. ఈ ఏడాది జరిగిన 89వ ఆస్కార్స్‌లో ‘మూన్‌లైట్‌’ ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. కానీ, ‘మూన్‌లైట్‌’ పేరు ప్రకటించిన తీరు మాత్రం సూపర్‌హిట్‌ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. అసలు ఏం జరిగిందంటే...



జోక్‌ కాదు.. నిజమే!

క్లాసిక్‌ ఫిల్మ్‌ ‘బోనీ అండ్‌ క్లయిడే’ విడుదలై 50 ఏళ్లైంది. ఈ సందర్భంగా అందులోని స్టార్స్‌ వారెన్‌ బీట్టీ, ఫాయే డన్‌ అవేలను 89వ ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రం పేరును ప్రకటించమని వేదికపైకి పంపారు. వాళ్లు ‘లా లా ల్యాండ్‌’ పేరును ప్రకటించారు. ఒక్కసారిగా హర్షాతిరేకాలు.. కరతాళ ధ్వనులు.. ‘లా లా ల్యాండ్‌’ చిత్ర బృందం అవార్డును స్వీకరించడానికి వేదికపైకి చేరుకుంది. యాక్సెప్టెన్స్‌ స్పీచ్‌లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.


ఇంతలో, ‘లా లా ల్యాండ్‌’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జోర్డాన్‌ హోరోవిట్జ్‌ మైక్‌ అందుకుని... ‘‘ఉత్తమ చిత్రం కేటగిరీ విజేత ‘మూన్‌లైట్‌’. దిస్‌ ఈజ్‌ నాట్‌ ఎ జోక్‌’’ అంటూ అవార్డు కార్డును అందరికీ చూపించారు. ఒక్కసారిగా వేదికపై ఉన్న మిగతా చిత్ర బృందంలో ఆనందం ఆవిరైంది. ఆ వెంటనే వారంతా వేదికను ఖాళీ చేశారు. తర్వాత ‘మూన్‌లైట్‌’ చిత్ర బృందం అవార్డును అందుకుంది. ‘లా లా ల్యాండ్‌’ సినిమా క్లైమాక్స్‌లో ఒక్క క్షణం హీరో హీరోయిన్‌ కలుసుకున్నట్టు చూపిస్తారు. కట్‌ చేస్తే... హీరోయిన్‌ మరొకర్ని పెళ్లి చేసుకుంటుంది. థియేటర్‌లో ప్రేక్షకులు అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అనుకుంటారు. ఆస్కార్స్‌ వేదికపై జరిగిన ఘటన చూశాక.. మళ్లీ సేమ్‌ ఫీలింగ్‌ కలగక మానదు.



(ఆస్కార్‌-2017: ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)



తప్పే.. క్షమించండి!

ఆస్కార్స్‌ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనపై ప్రైజ్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) క్షమాపణలు కోరింది. 83 ఏళ్లుగా ఆస్కార్స్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. ‘‘ఉత్తమ చిత్రం పేరును ప్రకటించే సమయంలో జరిగిన తప్పుకి అందరికీ క్షమాపణ చెబుతున్నాం’’ అని పీడబ్ల్యూసీ సంస్థ పేర్కొంది. ప్రెజెంటర్స్‌కు రాంగ్‌ కవర్‌ ఇవ్వడంతో ఈ తప్పు జరిగిందట!



ఇంకొకరి బాధలో ఆనందం ఎక్కడుంది?

ఆస్కార్స్‌ వేదికపై జరిగిన ఘటన పట్ల మహేర్షలా అలీ స్పందిస్తూ – ‘‘ఉత్తమ చిత్రంగా ‘లా లా ల్యాండ్‌’ పేరు ప్రకటించగానే నేనేమీ సర్‌ప్రైజ్‌ కాలేదు. ఆ సినిమా బాగుంది, బాగా ఆడింది. వాళ్లు వేదికపై ఉన్నప్పుడు సెక్యూరిటీ, ఇతరులు వచ్చి డిస్ట్రబ్‌ చేస్తుంటే వర్రీ అయ్యాను. అప్పుడు ‘మూన్‌లైట్‌’ పేరు ప్రకటించగానే వేదికపైకి వెళ్లాలనుకోలేదు. అలాంటి సందర్భంలో ఆనందపడడం చాలా కష్టం. కానీ, అదృష్టవశాత్తూ మేము ఉత్తమ చిత్రం పురస్కారంతో బయటకు నడిచాం’’ అన్నారు.



ఎమ్మా స్టోన్‌ (ఉత్తమ నటి, ‘లా లా ల్యాండ్‌’) మాట్లాడుతూ –‘‘ఓ గాడ్, ఐ లవ్‌ ‘మూన్‌లైట్‌’ సోమచ్‌. అఫ్‌కోర్స్, ‘లా లా ల్యాండ్‌’ పేరు ఉత్తమ చిత్రంగా వినడం అద్భుతంగా ఉంది. ‘మూన్‌లైట్‌’ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు.



బతికి ఉన్న మనిషిని చంపేశారు!

బతికి ఉన్న మనుషులకు నివాళులు అర్పిస్తారా? అలా చేస్తే బతికున్నవాళ్ల ఫీలింగ్‌ ఏంటి? ఆ ఫీలింగ్‌ ఎలా ఉంటుందో ‘జాన్‌ చాప్‌మాన్‌’ని అడిగితే చెబుతారు. ఎవరీ జాన్‌ చాప్‌మాన్‌ అంటే? ఈవిడ ఆస్ట్రేలియన్‌ ఫిలిం ప్రొడ్యూసర్‌. ‘ది పియానో’, ‘లవ్‌ సెరనేడ్‌’, ‘హోలీ స్మోక్‌’ వంటి పలు చిత్రాలు నిర్మించారు. వయసు 66. మంచి ఆరోగ్యంతో హాయిగా ఉన్నారు. కానీ, గతేడాది తిరిగి రాని లోకాలకు వెళ్లిన ప్రముఖులకు నివాళులర్పించే కార్యక్రమంలో ఆస్కార్‌ అవార్డు కమిటీ జాన్‌ చాప్‌మాన్‌ ఫొటోను చూపించింది.


గతేడాది చనిపోయిన కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ‘జానెట్‌ ప్యాటర్‌సన్‌’కి నివాళులర్పిస్తూ, ఆమె ఫొటోకు బదులుగా చాప్‌మాన్‌ ఫొటోను చూపించారు. దాంతో ‘నేను బతికే ఉన్నాను. బాగున్నాను కూడా. నిర్మాతగా యాక్టివ్‌గా ఉన్నాను’ అని చాప్‌మాన్‌ చెప్పుకోవాల్సి వచ్చింది. జానెట్‌ ప్యాటర్‌సన్‌తో కలసి తాను సినిమాలు చేశానని, ఆమె మంచి స్నేహితురాలని కూడా చాప్‌మాన్‌ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అనిపించుకున్న ఆస్కార్‌ అవార్డు లాంటి భారీ వేడుకలో ఇలాంటి తప్పులు జరగడం నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టింది.



అదృష్టం.. అవకాశం కలిసొస్తేనే... – ఉత్తమ నటి ఎమ్మా స్టోన్‌

ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఎమ్మా స్టోన్‌.. ఆస్కార్స్‌కి నామినేట్‌ అయిన సహచర నటీమణులపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఫ్యామిలీకి థ్యాంక్స్‌ చెబుతూ స్పీచ్‌ ప్రారంభించారు.


‘‘అదృష్టం, అవకాశం బాగా కలిసొచ్చినప్పుడే ఇలాంటి సందర్భం వస్తుందని నాకు అర్థమైంది. జీవితంలో ఒక్కసారే ‘లా లా ల్యాండ్‌’ వంటి సినిమాలో నటించే ఛాన్స్‌ వస్తుంది. నాపై నమ్మకంతో ఈ ఛాన్స్‌ ఇచ్చిన దర్శకుడు డామీన్‌ ఛాజెల్లెకు థ్యాంక్స్‌. ప్రతిసారీ, ప్రతి సన్నివేశంలో నేను బాగా నటించేలా సహకరించిన ర్యాన్‌ గోస్లింగ్‌కి థ్యాంక్స్‌. నేనింకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది’’ అన్నారు.





ఓంపురికి ఆస్కార్‌ నివాళి

ప్రతి ఆస్కార్‌ వేడుకలోనూ గడచిన 12 నెలల్లో స్వర్గస్తులైన సినీ ప్రముఖులకు నివాళులు అర్పించడం అనవాయితీ. అందులో భాగంగా భారతీయ నటుడు ఓంపురికి నివాళులర్పించారు. ‘సిటీ ఆఫ్‌ జాయ్‌’, ‘వోల్ఫ్‌’, ‘ద ఘోస్ట్‌ అండ్‌ ద డార్క్‌నెస్‌’, ‘సచ్‌ ఎ లాంగ్‌ జర్నీ’, ‘ఈస్ట్‌ ఈజ్‌ ఈస్ట్‌’లతో పాటు మరికొన్ని ఇంగ్లీష్‌ చిత్రాల్లో ఓంపురి నటించారు. ఆయన నటించిన చివరి ఇంగ్లీష్‌ చిత్రం ‘వైశ్రాయస్‌ హౌస్‌’ ఈ నెల 12న బెర్లిన్‌లో విడుదలైంది.


మార్చి 3న యూకేలో విడుదల కానుంది. ‘‘25 ఏళ్ల నుంచి వరుసగా హాలీవుడ్, బ్రిటీష్‌ సినిమాల్లో నటిస్తున్న ఏకైక నటుడు ఓంపురి. ఈరోజు ఆస్కార్స్‌ ఆయనకు నివాళులు అర్పించింది. ఆస్కార్స్‌ నివాళులు అందుకున్న తొలి భారతీయ నటుడు ఓంపురీనే. థ్యాంక్యూ అకాడెమీ అవార్డ్స్‌. థ్యాంక్యూ ఎవ్రీవన్‌. వుయ్‌ మిస్‌ ఓం’’ అని ఓంపురి ఫ్యామిలీ ఓ ప్రకటనలో పేర్కొంది.



దేశీ గాళ్స్‌ హంగామా

విదేశీ తారలకు ధీటుగా ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుకలో పాల్గొని, రెడ్‌ కార్పెట్‌పై నడవడం అంత వీజీ కాదు.. దానికి చాలా ఖలేజా ఉండాలి. మన దేశీ భామ ప్రియాంకా చోప్రా తన దమ్మేంటో గతేడాది ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో పాల్గొన్నప్పుడు నిరూపించుకున్నారు. వైట్‌ గౌన్, లైట్‌ మేకప్, డైమండ్‌ జ్యుయెలరీలో ఆమె మెరిసిపోయారు.


ఈసారి కూడా విదేశీయుల దగ్గర మార్కులు కొట్టేశారు. మరో భామ దీపికా పదుకొనే కూడా సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యారు. ‘ఆఫ్టర్‌ పార్టీ’ (అవార్డు వేడుక ముగిసిన తర్వాత జరిగే పార్టీ)లో దీపికా పదుకొనే పాల్గొన్నారు. నలుపు రంగు గౌనులో ‘వెరీ నైస్‌’ అనిపించుకున్నారు. మన దేశీ భామలా... మజాకానా!



వయ్యారి భామ.. నీ హంస నడక...

16,500 చదరపు అడుగుల ఎర్ర తివాచీ అది. పదహారణాల తెలుగమ్మాయిలు నడిస్తేనేమి... పరాయి దేశపు భామలు నడిస్తేనేమి... చూడ్డానికి రెండు కళ్లూ  చాలవు. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినా.. ఇంకా ఏదో ‘మిస్‌’ అయ్యామని మగ మనసులు బాధపడిపోతాయ్‌.


వచ్చినవాళ్లు వచ్చినట్లు వయ్యారంగా వాక్‌ చేసుకుంటూ వెళుతుంటే చూసేకొద్దీ చూడబుద్ధేస్తోందంటూ ఆ మనసులు గారాలు పోయాయి. భారీ రెడ్‌ కార్పెట్‌ పై భామలు అడుగులో అడుగేస్తూ, ఆకట్టుకున్నారు. ప్రతి ఏడాదీ రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌ సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచినట్లే ఈ ఏడాది కూడా నిలిచింది.



చీరకట్టు @ రెడ్‌ కార్పెట్టు

భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీరకట్టు. ఆ చీరకట్టు 89వ ఆస్కార్‌ వేడుకల్లో వీక్షకులతో పాటు సినీ ప్రముఖుల కళ్లను కట్టిపడేసింది. ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో నామినేట్‌ అయిన దేవ్‌ పటేల్‌.. తన తల్లి అనితా పటేల్‌తో కలసి ఆస్కార్‌ వేడుకలకు హాజరయ్యారు.


చీరకట్టులో భారతీయ హుందాతనం చూపించిన అనితా పటేల్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ‘‘దేవ్‌ పటేల్‌కి ఆస్కార్‌ రాకున్నా.. 26 ఏళ్లకు నామినేషన్‌ దక్కడం అద్భుతమైన విషయం. ఆ లెక్కన దేవ్‌ విన్నరే. ఇంత త్వరగా దేవ్‌కి ఆస్కార్‌ నామినేషన్‌ వస్తుందని ఊహించలేదు’’ అని అనితా పటేల్‌ పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top