'ఊపిరి' మూవీ రివ్యూ

'ఊపిరి' మూవీ రివ్యూ - Sakshi


టైటిల్ :  ఊపిరి

జానర్ : ఎమోషనల్ డ్రామా

తారాగణం : నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్

సంగీతం : గోపీ సుందర్

మాటలు : అబ్బూరి రవి

దర్శకత్వం : వంశీ పైడిపల్లి

నిర్మాత : ప్రసాద్ వి పొట్లూరి



మనం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి వరుస సూపర్ హిట్స్ తరువాత కింగ్ నాగార్జున నటించిన సినిమా ఊపిరి. ఫ్రెంచ్ మూవీ 'ద ఇంటచబుల్స్' సినిమాకు అధికారిక రీమేక్గా రూపొందిన ఈ సినిమాలో నాగ్ సినిమా మొత్తం వీల్ చైర్కే పరిమితమయ్యే పాత్రలో కనిపించాడు. మన్మథుడి ఇమేజ్ ఉన్న నాగ్ వీల్ చైర్లోనే ఉండే పాత్రలో కనిపిస్తుండటం, తొలిసారిగా తమిళ హీరో కార్తీ స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తుండటంతో ఊపిరి సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. మరి సోగ్గాడిగా మాస్ ఆడియన్స్ను ఊర్రుతలూగించిన నాగ్, వీల్ చైర్లో కూర్చొని ఎంత వరకు ఎంటర్టైన్ చేశాడు..? తొలిసారిగా తెలుగు సినిమా చేసిన కార్తీ టాలీవుడ్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించాడు..? దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్రెంచ్ కథతో తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పించాడు..?



కథ :

శీను (కార్తీ) అల్లరి చిల్లరగా తిరుగుతూ డబ్బు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అలా దొంగతనం చేస్తున్న సమయంలో పోలీసులకు పట్టుపడి జైలుకెళ్తాడు. పెరోల్ మీద బయటకు వచ్చిన శీనుని తల్లి (జయసుథ) ఇంట్లో నుంచి గెంటేస్తుంది. సత్ప్రవర్తన కలిగిన వాడిగా చూపించుకొని కేసునుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తాడు శీను. అందుకోసం అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో పని చేయడానికి ప్రయత్నించినా అది కుదరదు. దీంతో మల్టీ మిలియనీర్ విక్రమాదిత్య (నాగార్జున)కు కేర్ టేకర్ కోసం జరుగుతున్న ఇంటర్వ్యూకు వెళతాడు. అక్కడ విక్రమాదిత్య.. సెక్రటరీ కీర్తి(తమన్నా)ని చూసి ఎలాగైనా అక్కడే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటాడు.



విక్రమాదిత్య.., ఎన్నో బిజినెస్లు ఉన్న ఓ భారీ వ్యాపారవేత్త. పారిస్లో పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ యాక్సిడెంట్లో మెడ కింద నుంచి శరీరమంతా పనిచేయకుండా పోతుంది. దీంతో ప్రతి పనికి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. తనకు తోడుగా ఫ్రెండ్ ప్రసాద్ (ప్రకాష్ రాజ్), సెక్రటరీ కీర్తి ఉన్నా ఇంకా ఏదో మిస్ అవుతుంటాడు విక్రమాదిత్య. అలాంటి సమయంలో తనను ప్రేమగా చూసుకునే వ్యక్తి కోసం ఇంటర్వ్యూ ఏర్పాటుచేస్తాడు. అనుకోకుండా అక్కడకు వచ్చిన శీను మాట తీరు నచ్చి అతన్నే తన కేర్ టేకర్గా తీసుకుంటాడు. ఎలాంటి బాధ్యత తెలియని శీను, విక్రమాదిత్య మనోవేదనను ఎలా పోగొట్టాడు? అదే సమయంలో కీర్తి ప్రేమను గెలుచుకోవడానికి శీను ఎలాంటి ప్రయాత్నాలు చేశాడు..? శీను జీవితంలోని సమస్యలను విక్రమాదిత్య ఎలా పరిష్కరించాడు అన్నదే మిగతా కథ..?



నటీనటులు :

తెలుగు సినీ రంగంలో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో చేయని సాహసం చేసిన నాగ్ మరోసారి బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా లాంటి మాస్ ఎంటర్టైనర్ తరువాత ఊపిరి సినిమా చేసిన నాగ్, తన నమ్మకం వమ్ముకాదని ప్రూవ్ చేసుకున్నాడు. ఎలాంటి బాడీలాంగ్వేజ్ లేకపోయినా కేవలం హావాభావాలతోనే అద్భుతమైన ఎమోషన్స్ పండిచాడు. ఇక తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన కార్తీ తెలుగబ్బాయే అనేంతగా ఆకట్టుకున్నాడు. కామెడీ, సెంటిమెంట్ రెండు వేరియషన్స్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా గ్లామర్, స్టైలిష్ లుక్తో ఆకట్టుకుంది తమన్నా. నాగార్జున ఫ్రెండ్గా ప్రకాష్ రాజ్ తనదైన నటనతో మెప్పించాడు. అలీ, జయసుథ, గ్యాబ్రియల్ తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక అతిథి పాత్రల్లో అలరించిన అనుష్క, శ్రియ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేశారు.



సాంకేతిక నిపుణులు:

ఫ్రెంచ్ సినిమా మన సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా దాన్ని మలచటంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మంచి విజయం సాధించాడు. ముఖ్యంగా నాగార్జునను విక్రమాదిత్య పాత్రకు ఒప్పించటమే వంశీ సాధించిన విజయం. ఎక్కడా ఓ రీమేక్ సినిమా చూస్తున్న భావన కలగకుండా అద్భుతమైన ఎమోషన్స్తో సినిమాను నడిపించాడు. కంటతడి పెట్టించే సెంటిమెంట్ సీన్స్ ఉన్నా.. ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఓ కామెడీ డైలాగ్తో అలరించాడు. అబ్బూరి రవి అందించిన సంభాషణలు బాగున్నాయి. కామెడీ టైమింగ్తో పాటు, సెంటిమెంట్ సీన్స్లో కూడా డైలాగ్ ఆకట్టుకున్నాయి. గోపీసుందర్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా.., నేపథ్య సంగీతం బాగుంది. పివిపి సంస్థ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా స్థాయిని మరింత పెంచాయి.



ప్లస్ పాయింట్స్ :

కథ

నాగర్జున, కార్తీ

డైలాగ్స్



మైనస్ పాయింట్స్ :

పాటలు

సెకండ్ హాఫ్ లెంగ్త్



ఓవరాల్గా ఊపిరి తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే మంచి సినిమా



- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top