కోలీవుడ్‌లో ఓం నమో వేంకటేశాయా

కోలీవుడ్‌లో ఓం నమో వేంకటేశాయా - Sakshi


తమిళసినిమా: ఓం నమో వెంకటేశాయ చిత్రం బ్రహ్మాండ నాయకన్‌ పేరుతో తమిళ పేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని నాగార్జున వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీరాం బాబాజీగానూ, తనను ఆండాళ్‌గా భావించుకునే పాత్రలో నటి అనుష్క, శ్రీకృష్ణుడిగా హిందీ నటుడు సౌరభ్‌జైన్‌ ప్రధాన పాత్రలు పోషించిన తెలుగులో మంచి విజయాన్ని సాధించిన భక్తిరసా కథా చిత్రం ఓం నమో వేంకటేశాయ.



 శతాధిక చిత్రాల ప్రఖ్యాత దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఇందులో నటి ప్రగ్యాజైస్వాల్, జగపతిబాబు, బ్రహ్మానందం, సాయికుమార్, సంపత్‌ నటీనటులు నటించారు. బాహుబలి వంటి పలు విజయవంతమైన చిత్రాలకు పని చేసిన కీరవాణి ( తమిళంలో మరగదమణి) సంగీతాన్ని అందించారు. ఇది భగవంతుడికి, భక్తుడికి మధ్య బంధాన్ని ఆవిష్కరించే చిత్రం. రామ అనే భక్తుడు హథీరాంగా ఎలా మారాడు. తిరుమలకు ఆ పేరు ఎలా వచ్చింది,



ఆనందనిలయం అనే పేరు రావడానికి కారణం ఏమిటి, తిరుమలలో బ్రహ్మాండ నాయకుడికి ఎవరు తొలి అర్చన చేయాలి లాంటి చాలా మందికి తెలియని దైవ విశేషాలను ఆవిష్కరించే చిత్రంగా ఓం నమో వేంకటేశాయ చిత్రం ఉంటుంది. ఇది భక్తిరస కథా చిత్రమే అయినా ఈ తరం ప్రేక్షకులను అలరించే జనరంజక అంశాలతో అత్యంత ఆధునికి సాంకేతిక పరిజ్ఞానంతో తరకెక్కించిన చిత్రం. ఇంతకు ముందు అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస కథా చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో మెప్పించిన నాగార్జున ఈ చిత్రంలో హథీరాం బాబాజీగా ఆ పాత్రకు జీవం పోశారు.



బాహుబలి సిరీస్‌ చిత్రాల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన నటి అనుష్క ఓం నమో వేంకటేశాయ చిత్రంలో వేంకటేశ్వరస్వామిని అమితంగా ఆరాధించి, ప్రేమించే ఆండాళ్‌దేవిగా తనదైన ముద్రవేసుకున్నారు. ఈ చిత్రాన్ని జోషికా ఫిలింస్‌ పతాకంపై ఎస్‌.దురైమురుగన్,బి.నాగరాజన్‌ బ్రహ్మాండనాయగన్‌ పేరుతో తమిళంలోకి అనువధిస్తున్నారు. దీనికి మాటలు, పాటలను డీఎస్‌.బాలాగన్‌ అందిస్తున్నారు. చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top