తెలుగు తీరంలో మలబార్ అందాలు!

తెలుగు తీరంలో మలబార్ అందాలు!


 ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అని పెద్దలు ఊరకే అనలేదు. మన ఇంట్లో ఉన్న కూర అంటే చిన్న చూపు... పొరుగింటి కూర అంటే వల్లమాలిన వలపు. సినిమా పరిశ్రమలో కథానాయికలకు ఇది బ్రహ్మాండంగా వర్తిస్తుంది. ముఖ్యంగా తెలుగులో తెలుగమ్మాయిల కన్నా పరభాషల తారల హవానే ఎక్కువ. పది, పదిహేనేళ్ల క్రితం ఉత్తరాది భామల సందడి ఎక్కువగా ఉంటే, ఇటీవలి కాలంలో మునుపెన్నడూ లేనంతగా మలయాళ తారల తాకిడి ఎక్కువైందనే చెప్పాలి. ఈ ఏడాది విడుదల కానున్న ముఖ్యమైన తెలుగు చిత్రాల్లో మొదటి నాయికగానో, రెండో నాయికగానో... ఏవరో ఒక మలయాళ తార ఉండడం విశేషం. ఆ కేరళ కుట్టీల గురించి తెలుసుకుందాం..

 

 ఫామ్‌లో నయనతార, నిత్యామీనన్

 ఇప్పటి వరకూ తెలుగు తెరపై తమ సత్తా చాటుకున్న మలయాళ భామలు చాలామందే ఉన్నారు. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’తో అసిన్, ‘అమ్మాయి బాగుంది’తో మీరా జాస్మిన్, ‘శేషు’తో కల్యాణి, ‘నా ఆటోగ్రాఫ్... స్వీట్ మెమొరీస్’తో గోపిక...  ఇలా పన్నెండేళ్ల క్రితం కథానాయికలుగా పరిచయమైన మలయాళ సుందరీమణులు ఇక్కడ బాగానే రాణించారు. వీళ్ల తర్వాత ‘యమదొంగ’తో మమతా మోహన్‌దాస్, ‘చంద్రముఖి’తో నయనతార తెలుగు తెరపైకి దూసుకొచ్చారు. ఓ ఆరేడేళ్లు మమత ఇక్కడ బిజీగానే సినిమాలు చేశారు. టాప్ స్టార్స్‌తోనూ, యువ హీరోలతోనూ నటిస్తూ, నయనతార ఇంకా మంచి ఫామ్‌లోనే ఉన్నారు.

 

 ఆ ఇద్దరి తర్వాత తెలుగు తెరను కనువిందు చేసిన మరో బ్యూటీ నిత్యామీనన్. ‘అలా మొదలైంది’తో కథానాయికగా తెలుగు కెరీర్ మొదలుపెట్టి, పాటలు పాడడం, తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా ‘మల్టీ టాలెంటెడ్’ అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ సరసన నయనతార ఓ చిత్రంలో (‘బాబు... బంగారం’) నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న ‘జనతా గ్యారేజ్’లో నిత్యామీనన్ ఓ నాయికగా నటిస్తున్నారు. ఇక, గడచిన ఏడాది కాలంలో మలయాళం నుంచి మన తెలుగు తీరానికి వచ్చిన యువతారల గురించి చెప్పాలంటే...




 

 మాంచి జోరు మీద మాళవిక

ఆల్చిప్పల్లాంటి కళ్లు, ఆకట్టుకునే హావభావాలతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకోగలుగుతారు మాళవికా నాయర్. మొదటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’తోనే అభినయ పరంగా కూడా భేష్ అనిపించుకున్నారు. టాలెంట్ ఉన్న తారలను పరిశ్రమ వదిలిపెట్టదన్నట్లుగా నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్, దర్శకురాలు నందినీరెడ్డి దృష్టి మాళవికపై పడింది. అంతే.. ‘కళ్యాణ వైభోగమే’లో కథానాయికగా తీసుకున్నారు. ఈ నెలాఖరులో ఈ చిత్రం విడుదల కానుంది. మలి సినిమాలో కూడా మాళవిక భేష్ అనిపించుకుంటే ఇక కొన్నాళ్లు ఆమె ఇక్కడే బిజీ అయిపోయే  అవకాశం ఉంది.




  

తొలి చిత్రంతోనే బోల్డంత కీర్తి

 తెలుగు తెరపై రాణిస్తున్న తారల్లో పాతికేళ్లు, ఆ పైన వయసున్నవారి సంఖ్య ఎక్కువే. ‘ఫ్రెష్ ఫేస్’లకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది కాబట్టి, పాతికేళ్ల లోపు తారలకు క్రేజ్ ఎక్కువే. అందంతో పాటు మంచి అభినయం కూడా కనబరచగలిగితే ఇక తిరుగుండదు. ఏడాది మొదటి రోజున విడుదలైన ‘నేను... శైలజ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తీ సురేశ్ ఈ కోవకే వస్తారు. మన పక్కింటి అమ్మాయిలా ఉండే కీర్తికి తొలి చిత్రంతోనే బోల్డంత కీర్తి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ బ్యూటీకి బాగానే అవకాశాలు వస్తున్నాయని టాక్. ఓ యువ స్టార్ హీరోతో జతకట్టనున్నారని భోగట్టా. అది కన్‌ఫర్మ్ అయితే తెలుగు పరిశ్రమ కీర్తికి రెడ్ కార్పెట్ పరిచినట్లే! అన్నట్లు... కీర్తి ఎవరో కాదు... సీనియర్ నటి మేనక కూతురు.




 

 అనుపమ... అదరహో!

 గత ఏడాది మలయాళంలో విడుదలైన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమమ్’ది ఓ ప్రత్యేకమైన స్థానం. ఆ చిత్రంలో కీలకమైన పాత్ర చేసిన అనుపమా పరమేశ్వరన్‌కు బోల్డంత పేరొచ్చింది. చక్కటి నటన కనబరిచిన ఈ అమ్మాయి దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న ‘అ.. ఆ..’లో నితిన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. అలాగే, మలయాళ ‘ప్రేమమ్’లో చేసిన పాత్రనే తెలుగు రీమేక్ (‘మజ్ను’)లో అనుపమ చేస్తున్నారు. నాగచైతన్య హీరోగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే రెండో సినిమాలోనూ నటించడం, ఆల్రెడీ మలయాళ ప్రేక్షకులతో భేష్ అనిపించుకున్న నటి కావడంతో అనుపమపై అంచనాలు చాలానే ఉన్నాయి.

 

 మంజిమా మోహన్ మాయ


 బాలనటిగా పలు మలయాళ చిత్రాల్లో నటించి, ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే పాపులర్ మలయాళ చిత్రం ద్వారా కథానాయికగా మారారు మంజిమా మోహన్. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు ఫీల్ గుడ్ మూవీ చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అవకాశం కొట్టేశారు మంజిమ. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’లో మంజిమా మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే.. ఇదే చిత్రాన్ని తమిళంలో ‘అచ్చమ్ ఎన్బదు మడమయడా’ పేరుతో శింబు హీరోగా తమిళంలో తీస్తున్న చిత్రంలోనూ మంజిమనే కథానాయికగా తీసుకున్నారు గౌతమ్.


ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఏ మాయ చేశావె’ ద్వారా సమంత మాయ చేసినట్లుగానే ఇప్పుడు మంజిమా మోహన్ కూడా మాయ చేస్తారేమో చూడాలి.  ఒక్క కథానాయికలు మాత్రమే కాదు.. క్యారెక్టర్ నటీనటులుగా కూడా మలయాళ నటీనటులు ఇక్కడ బాగానే రాణిస్తున్నారు. స్టైలిస్ట్ అమ్మ, అత్త అంటే నదియా బాగుంటారని ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు నిరూపించాయి. ప్రస్తుతం ‘అ...ఆ’లో నదియా నటిస్తున్నారు. ఇక, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ‘జనతా గ్యారేజ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఏకంగా తెలుగు నేర్చేసుకుంటున్నారు.

 

  సీనియర్ నటుడు దేవన్ కూడా అప్పుడప్పుడూ తెలుగు చిత్రాల్లో తళుక్కుమంటూ ఉంటారు. మొత్తం మీద కళకు భాషతో సంబంధం లేదనట్లుగా.. మన తెలుగు పరిశ్రమ టాలెంట్‌ని బాగానే వాడుకుంటోందని చెప్పొచ్చు. అఫ్‌కోర్స్.. తెలుగమ్మాయిలు నాయికలుగా ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. బిందు మాధవి, శ్రీదివ్య వంటి తెలుగమ్మాయిలు తమిళంలో మంచి జోరు మీద ఉన్నారు. వాళ్లకు పొరుగిల్లే బాగుంది. అందుకే ‘పొరుగింటి పిల్లే ముద్దు’ అనాలేమో!

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top