ఈ సినిమాతో జైలుకెళ్లాల్సి వస్తుందేమో!

ఈ సినిమాతో జైలుకెళ్లాల్సి వస్తుందేమో! - Sakshi


కమల్‌హాసన్ నటన సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఆయన చేసే చిత్రాలు కూడా అలానే ఉంటాయి. సమాజంలో నుంచి పుట్టుకొచ్చే కథలతో రూపొందే చిత్రాలు చేయడానికే కమల్ ఇష్టపడతారు. తాజాగా అలాంటి ఓ కథతో సినిమా చేయడానికి కమల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. కుల వ్యవస్థ మీద ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి ‘ఉళ్లేన్ అయ్యా’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. ఉళ్లేన్ అయ్యా అంటే ‘ఉన్నానయ్యా’ అని అర్థం. 1968లో తమిళనాడులోని ‘కిళవెన్‌మణి’ అనే గ్రామంలో జరిగిన సంఘటన ఆదారంగా ఈ చిత్రం ఉంటుంది.



ఆ గ్రామానికి చెందిన 44 మంది దళితులను ఓ భూస్వామి పాశవికంగా హత్య చేయిస్తాడు. ఇటీవల ఓ సందర్భంలో ఆ సంఘటన గుర్తుకు వచ్చిందనీ, ఎప్పుడు గుర్తుకొచ్చినా కదిలిపోతుంటాననీ కమల్ పేర్కొన్నారు. కుల వ్యవస్థ అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఓ రోగం అనీ, అదంటే తనకసహ్యం అనీ ఈ సందర్భంగా కమల్ అన్నారు. రాజకీయ వ్యవస్థలో ఉండే కుల పోరాటాన్ని ఈ చిత్రంలో ప్రస్తావించనున్నారు. అందుకే, ఈ చిత్రం నన్ను జైలుపాలు చేసినా ఆశ్చర్యపోవడానికి లేదని కమల్ అన్నారు.



ఓ విద్యార్థి దృష్టి కోణంలో ఈ కథాంశాన్ని చెప్పనున్నారట. ఈ చిత్రకథ పూర్తయ్యింది. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభించాలనుకుంటున్నారో తెలియాల్సి ఉంది. వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసి, విడుదల విషయంలో కమల్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయినప్పటికీ, వెనుకంజ వేయకుండా మళ్లీ మళ్లీ అలాంటి కథాంశాలతో సినిమాలు తీయాలనుకోవడం ఆయన ధైర్యానికీ, సామాజిక అంశాలు తెరపై చూపించాలనే ఆయన ఆకాంక్షకీ నిదర్శనం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top