సినిమా రివ్యూ: బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

సినిమా రివ్యూ: బ్రదర్ ఆఫ్ బొమ్మాళి


తారాగణం:


‘అల్లరి’ నరేశ్, కార్తీక, మోనాల్ గజ్జర్,

కథ: విక్రమ్రాజ్,

సంగీతం: శేఖర్ చంద్ర,

కూర్పు: గౌతంరాజు,

నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి,

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ



బలాలు: 

అలవాటైన నరేశ్ శైలి వినోదం 

కార్తీక 

తెర నిండా కనపడే కమెడియన్లు 

వ్యంగ్య ధోరణి కథనం 

ఫస్టాఫ్  పాత సినీ శైలి పాట

 

బలహీనతలు:  

కథ పెద్దగా లేకపోవడం 

ఉన్న కొద్ది పాటి కథను ఆసక్తిగా చెప్పలేకపోవడం 

నిడివి పెంచుతూ సీన్లు సీన్లుగా నడవడం 

సెకండాఫ్  ఎడిటింగ్ 

దర్శకత్వం


 


వినోదమంటే ఒకప్పటి నిర్వచనాల మాటేమో కానీ, ప్రస్తుతం తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు సందర్భ శుద్ధి, సన్నివేశ అవసరం, పాత్రోచిత ప్రవర్తన ఉన్నా, లేకున్నా కాసేపు నవ్వించడమే. గమనిస్తే, ఇటీవలి కాలపు తెలుగు చిత్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ప్రధానంగా ఇలాగే సాగుతోంది. ఆ పద్ధతిలో ప్రతి విషయాన్నీ వ్యంగ్యంగా చూపి, ప్రతి పాత్రనూ పంచ్ డైలాగులతో నింపే చిత్రాల ధోరణిలో తాజా చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ కూడా సాగింది.


కథ ఏమిటంటే...

రామకృష్ణ అలియాస్ రాంకీ (‘అల్లరి’ నరేశ్), మహాలక్ష్మి అలియాస్ లక్కీ (కార్తీకా నాయర్)లు కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి అన్న రాంకీని సైతం ఆటాడించే చెల్లెలు ఫైట్లకు సైతం సిద్ధపడే ధీర వనిత. శ్రుతి (మోనికా గజ్జర్)ను చూసీచూడగానే ప్రేమలో పడతాడు అన్న. చెల్లి పెళ్ళయితే కానీ, పెళ్ళి చేసేది లేదంటారు అతని తల్లితండ్రులు.

 

తీరా చూస్తే, చెల్లి అప్పటికే హర్ష (హర్షవర్ధన్ రాణే) అనే యువకుణ్ణి ప్రేమిస్తుంటుంది. అతగాడికేమో మరో అమ్మాయితో పెళ్ళి కుదురుతుంది. ఈ క్రమంలో హీరో తన బృందంతో సాక్షాత్తూ ఆ పెళ్ళి ఇంటికే వెళ్ళి ఏం చేశాడు? చెల్లెలి పెళ్ళి ఎలా జరిపించాడు? తన పెళ్ళికి మార్గం ఎలా సుగమం చేసుకున్నాడన్నది మిగతా సినిమా.

 

ఎలా నటించారంటే...

కొద్దికాలంగా సరైన హిట్ లేని ‘అల్లరి’ నరేశ్ ఈ సారి పూర్వ వైభవం సంపాదించుకోవడం కోసం తన మార్కు వినోదాన్ని ఆశ్రయించారు. ఎప్పటి లానే తన ఎనర్జీ స్థాయితో అలరించడానికి యత్నించారు. సినిమాలో పేరుకు హీరోయిన్ ఉన్నా, హీరోకు జంటగా పాటల కోసమే తప్ప మోనాల్ గజ్జర్ పోషించిన పాత్ర నుంచి పెద్దగా ఆశించడానికి ఏమీ లేదు. కథకు కీలకమైన హీరో చెల్లెలుగా కార్తీక (నటి రాధ కుమార్తె) ఫైట్స్ సైతం చేసే దిలాసా యువతిగా పాత్రలో ఇమిడిపోవడానికి కృషి చేశారు. బ్రహ్మానందం, అలీ, ఫస్టాఫ్‌లో ‘వెన్నెల’ కిశోర్ - ఇలా చాలామంది కమెడియన్లే సినిమాలో ఉన్నారు.

 

ఎలా ఉందంటే...

హీరో ప్రేమ గోల, దానికి చెల్లెలిచ్చే సలహాలతో ఫస్టాఫ్ గడిచిపోతుంది. తీరా సెకండాఫ్‌లో క్యాటరర్ కోన (బ్రహ్మానందం), దొంగ పాత్రధారి అలీ తదితరులతో కలసి హీరో సాగించే డ్రామా సుదీర్ఘమనిపిస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో రచయిత కోన వెంకట్ రాసిన పెళ్ళింట్లో గందరగోళపు కామెడీకి కొనసాగింపే అదంతా. అదీ ఆసక్తికరంగా చెప్పలేకపోయారు. గతంలో నిఖిల్ ‘వీడు తేడా’కి దర్శకత్వం వహించిన బి. చిన్నికృష్ణకు ఇది మరో ప్రయత్నం.



కానీ, మరింత సమర్థంగా పాత్రలనూ, సన్నివేశాలనూ తీర్చిదిద్దుకోవాల్సింది. ఎక్కువ మంది రచయితలున్న ఈ సినిమా అంతా నాన్‌స్టాప్‌గా పాత్రలు మాట్లాడేస్తుంటాయి. వరుసగా మీదకొచ్చి పడుతున్న పంచ్ డైలాగ్‌‌స వర్షం నుంచి తప్పించుకోవడం కష్టమవుతుంది. మొత్తం మీద ఏ సీనుకు ఆ సీనుగా నడిచే ఈ సినిమా - కథ, కథనం లాంటివి పట్టించుకోకుండా కాలక్షేపం కోరే వారికి ఫరవాలేదనిపిస్తుంది. టీవీల్లో బాగా ఆడే సినిమా ఇది!


-- రెంటాల జయదేవ



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top