చిత్రమైన వ్యాపారంతో చిక్కులు..!

చిత్రమైన వ్యాపారంతో చిక్కులు..!


ఆ యువకులిద్దరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటుంటారు. అలా కొనసాగి ఉంటే జీవితం సాఫీగా వెళ్లిపోయి ఉండేదేమో. ఇద్దరికీ ఏదైనా వ్యాపారం చేయాలనిపించింది. అది కూడా చిత్రాతిచిత్రమైన వ్యాపారం. ఓ శుభముహూర్తాన వ్యాపారం మొదలుపెట్టేశారు. ఆ తర్వాత వాళ్ల జీవితాల్లో ఎలాంటి మలుపులు సంభవిస్తాయి? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే...’. ప్రసిద్ధ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మధుమిత దర్శకురాలు.

 

 రచయిత వెన్నెలకంటి రెండో కుమారుడు రాకేందు మౌళి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మరో హీరోగా వెంకీ, హీరోయిన్‌గా అదితి నటిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ కీలక పాత్రలు చేస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసి, ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిదనీ, ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోందనీ చరణ్ తెలిపారు. రెండు భాషల్లో ఏకకాలంలో సినిమా చేయడం ఓ సవాల్ అని మధుమిత అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తికేయ మూర్తి, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: శ్రీనివాస్.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top