ప్రముఖ దర్శక నిర్మాతకు బెదిరింపులు

ప్రముఖ దర్శక నిర్మాతకు బెదిరింపులు - Sakshi


ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు బెదిరింపులు వచ్చాయి. ముంబైలో పాకిస్థానీ కళాకారులకు మద్దతు ఇస్తానని చెప్పడంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆయనపై తీవ్రంగా మండిపడింది. కరణ్ తీసే సినిమాల్లో పాకిస్థానీ కళాకారులకు అవకాశం ఇస్తే.. తమదైన శైలిలో ఆయనకు తగిన సమాధానం చెబుతామని ఎంఎన్ఎస్ హెచ్చరించింది. ఆ సమావేశంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కూడా ఉన్నారు. ఉడీ దాడి నేపథ్యంలో పాకిస్థానీ నటీనటులు ముంబై వదిలి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఎంఎన్ఎస్ ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. ఇప్పటికే వాళ్లంతా ముంబై వదిలి వెళ్లిపో్యారని, నగరంలో ఇప్పుడు ఒక్క పాకిస్థానీ కళాకారుడు కూడా లేరని ఎంఎన్ఎస్ సీనియర్ నేత అమే ఖోప్కర్ తెలిపారు. పొరపాటున తమకు ఎవరైనా కనపడితే మాత్రం వాళ్లను బయటకు విసిరి పారేస్తామన్నారు.



కరణ్ జోహార్‌కు దమ్ముంటే ఒక్క పాకిస్థానీ నటుడినైనా తన సినిమాల్లోకి తీసుకోవాలని, అప్పుడు తామేం చేస్తామో చూడాలని ఖోప్కర్ అన్నారు. ఏవైనా సినిమాల్లో పాకిస్థానీ నటీనటులుంటే ఆ సినిమాలను ఇక్కడ విడుదల కానిచ్చేది లేదిన మరో సీనియర్ నేత షాలినీ ఠాక్రే చెప్పారు. ఇదంతా దేశం కోసమే తప్ప రాజకీయాల కోసం కాదన్న విషయాన్ని బాలీవుడ్ కూడా అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు. పాకిస్థానీలు మన సైనికులను చాలామందిని చంపేస్తున్నారని చెప్పారు.



కాగా, ముంబైలో ఉంటున్న పాకిస్థానీలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. ఈ విషయాన్ని తాము సీరియస్‌గానే తీసుకుంటున్నామని, వాళ్లందరికీ తగిన భద్రత ఇస్తాం కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీసీపీ అశ్వినీ సనప్ చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top