'మిస్టర్' మూవీ రివ్యూ




టైటిల్ : మిస్టర్

జానర్ : కామెడీ ఫ్యామిలీ డ్రామా

తారాగణం : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్,నికితిన్ థీర్, నాజర్, తనికెళ్ల భరణి, రాజేష్....

సంగీతం : మిక్కీ జె మేయర్

దర్శకత్వం : శ్రీను వైట్ల

నిర్మాత : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు



వరుసగా స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన శ్రీనువైట్ల రెండు ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డాడు. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ నటుడిగా ఫుల్ మార్క్స్ సాధిస్తున్నా, కమర్షియల్ హీరోగా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ ఫార్ములా సినిమా మిస్టర్. మరి ఈ మిస్టర్.. వరుణ్, శ్రీనుల కెరీర్ ను గాడిలో పెట్టిందా..? మరోసారి శ్రీనువైట్ల కామెడీ టైమింగ్ వర్క్ అవుట్ అయ్యిందా..? తొలి సారిగా పక్కా కమర్షియల్ ఫార్ములా కామెడీ ఎంటర్టైనర్ లో నటించిన వరుణ్ తేజ్ ఎంత వరకు ఆకట్టుకున్నాడు..?



కథ :

పిచ్చయ్య  నాయుడు( నాజర్) ఆంధ్రా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పది గ్రామాలకు పెద్ద, ఆ ఊరి కట్టుబాటు ప్రకారం పదేళ్లకొకసారి సంక్రాంతి సందర్భంగా జరిగే కర్రసాము పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికే ఆ గ్రామాల మీద పెత్తనం చేసే అధికారం ఉంటుంది. నలబై ఏళ్లుగా పిచ్చయ్యనాయుడు చేతుల్లోనే ఆ అధికారం ఉంటుంది. పది ఊళ్లను శాసించే స్థాయి ఉన్నా.. తనకు ఉన్న ఒక్కగానొక్క మనవడి(వరుణ్ తేజ్) ప్రేమకు దూరమై బాధపడుతుంటాడు. అయితే ఆ గ్రామాల చుట్టూ ఉన్న అడవుల్లో ఎర్ర చందనంతో పాటు రంగురాళ్లు కూడా ఉండటంతో బిజినెస్ మేన్ రాహుల్ వడయార్(నికితిన్ ధీర్) ఆ గ్రామాల మీద కన్నేస్తాడు. పిచ్చయ్యనాయుడు ప్రత్యర్థి గుండప్ప(తనికెళ్లభరణి)తో కలిసి పిచ్చయ్యానాయుడును సంక్రాంతి పోటిల్లో ఒడించి ఆ గ్రామాల మీద పెత్తనం సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.



చై అలియాస్ పిచ్చయ్య నాయుడు (వరుణ్ తేజ్) తన కుటుంబంతో కలిసి స్పెయిన్లో ఉండే తెలుగు కుర్రాడు. తను ప్రేమించిన వారికోసం ఎంత రిస్క్ అయినా చేయటం చైకి అలవాటు. అలాంటి చైకి ఒకసారి అనుకోకుండా మీరా వెల్లంకి(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలిచూపులోనే మీరాతో ప్రేమలో పడిన చై ఎలాగైన ఆ ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆమెను ఇంప్రెస్ చేస్తాడు.. కానీ అదే సమయంలో మీరా మరో అబ్బాయి ప్రేమిస్తున్నానని చెప్పి ఇండియా వెళ్లిపోతుంది.



ఎన్ని రోజులు గడిచినా చై, మీరాను మర్చిపోలేకపోతాడు. ఆ సమయంలో మీరా, చైకి ఫోన్ చేసి తన ప్రేమ ఇబ్బందుల్లో ఉందని సాయం చేయమని అడుగుతుంది. మీరా కోసం ఇండియా వచ్చిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) ప్రవేశిస్తుంది. అసలు మీరా ప్రేమకథలో సమస్య ఏంటి..? చై జీవితంలోకి వచ్చిన చంద్రముఖి ఎవరు..?  తన తాతకు చై ఎందుకు దూరమయ్యాడు..? రాహుల్ వడయార్ ఆట ఎలా కట్టించాడు..? చివరకు చై మీరా.. చంద్రముఖిలలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు..? అన్నదే మిగతా కథ



నటీనటులు :

తొలి సినిమా నుంచే నటుడిగా మంచి మార్కులు సాధిస్తూ వస్తున్న వరుణ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా మెగా హీరోల ఛాయలు కనిపించినా.. తనదైన కామెడీ టైమింగ్తో మెప్పించే ప్రయత్నం చేశాడు. లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంటుంది. అమాకత్వం, ప్రేమ, బాధ, భయం ఇలా అన్ని రకాల ఎమోషన్స్తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హెబ్బా పటేల్ కూడా అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. ప్రతినాయక పాత్రలో నికితిన్ ధీర్ సినిమాకు కావల్సినంత విలనిజం పండించాడు. డీసెంట్ లుక్స్లో కనిపిస్తూనే క్రూయల్ విలన్గా మెప్పించాడు. ఇతర పాత్రలో నాజర్, తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, చంద్రమోహన్, హరీష్ ఉత్తమన్, రాజేష్, 30 ఇయర్స్ పృధ్వీ ఇలా తెర నిండా కనిపించిన నటులు పరవాలేదనిపించారు.



సాంకేతిక నిపుణులు :

లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కించిన ఈ సినిమాతో శ్రీను వైట్ల ఎక్కువగా రిస్క్ చేయకుండా తన రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. విదేశాల్లో కామెడీ ఎపిసోడ్స్, పేరడీ సీన్స్, సినిమా వాళ్ల మీద పంచ్ డైలాగ్స్, పదుల సంఖ్యలో విలన్స్ ఇలా శ్రీను గత సినిమాల్లో కనిపించిన మాసాలా ఎలిమెంట్స్ అన్నీ మిస్టర్ లోనూ కనిపించాయి. ఫస్ట్ హాఫ్లో స్పెయిన్ అందాలతో పాటు కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుల ఊపిరి పేరడీ కడుపుబ్బా నవ్విస్తుంది.



ఫస్ట్ హాఫ్లో అసలు కథలోకి వెళ్లకుండా కామెడీ, రొమాంటిక్ సీన్స్తో కథ లాగించేసిన దర్శకుడు సెకండాఫ్ను హడావిడిగా నడిపించాడు. వరుసగా తెరమీదకు వచ్చే కొత్త పాత్రలు, మలుపులు ఆడియన్స్ను కన్ఫ్యూజ్ చేస్తాయి. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు కొంత పరవాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కెవి గుహన్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయ్యింది. స్పెయిన్ లోకెషన్స్ ను మరింత అందంగా చూపించిన గుహన్, చేజ్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.



ప్లస్ పాయింట్స్ :

లీడ్ యాక్టర్స్ నటన

యాక్షన్ సీన్స్

సినిమాటోగ్రఫీ



మైనస్ పాయింట్స్ :

లెక్కలేనన్ని మలుపులు

పాటలు





- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top