నాకిదో తియ్యని అనుభూతి!

నాకిదో తియ్యని అనుభూతి!


‘‘నేను పుట్టింది పంజాబ్‌లో.. పెరిగింది ఢిల్లీలో. న్యూయార్క్‌లోనూ చదువుకున్నాను. ఏడాదిన్నర క్రితం ముంబై వచ్చాను. ఇప్పటివరకూ చాలా యాడ్స్‌లో నటించాను’’ అని చెప్పారు మెహరిన్. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రం ద్వారా ఆమె కథనాయికగా పరిచయమవుతున్నారు. ఈ నెల 12న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మెహరీన్ చెప్పిన ముచ్చట్లు...

     

న్యూయార్క్‌లో తెలుగు సినిమాలు చూసేవాళ్లు చాలామందే ఉన్నారు. నేను కూడా చాలా చూశాను. వాటిలో ‘దూకుడు’ ఒకటి. అంత పెద్ద సినిమా నిర్మించిన 14 రీల్స్ సంస్థలో సినిమా చేసే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. అందుకే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’కు అవకాశం వచ్చినప్పుడు స్వీట్ షాక్ తగిలినట్లుగా అనిపించింది. నేను యాక్ట్ చేసిన యాడ్స్ చూసి, దర్శకుడు హను రాఘవపూడి కాల్ చేసి, మేకప్ లేకుండా ఫొటోలు పంపించమని అడిగారు. పంపించాను. రెండు రోజుల పాటు ఆడిషన్స్ చేసి, చివరకు ఎంపిక చేశారు.

     

ఈ చిత్రంలో నా పాత్ర పేరు మహాలక్ష్మి. నానీకి ప్రేయసిని. నాని న్యాచురల్ ఆర్టిస్ట్. నేను చూసిన తెలుగు సినిమాల్లో తను నటించిన ఈగ, ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్ చిత్రాలు ఉన్నాయి. నాకిది తొలి సినిమా కాబట్టి, పాత్ర కోసం సెట్‌లో డైలాగ్స్‌ను బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. షూటింగ్ ప్రారంభించక ముందే హను రాఘవపూడిగారు నన్ను మహాలక్ష్మీలానే డ్రెస్ చేసుకోమనేవారు. నా కాస్ట్యూమ్స్‌ని ఆయనతో కలిసి నేనే షాపింగ్ చేశాను. షూటింగ్ మొదలుపెట్టేసరికి మహాలక్ష్మిలానే మారిపోయాను.

     

ఈ చిత్రం షూటింగ్ సమయంలో కాలికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యింది. బ్యాండేజ్ వేసుకుని అలాగే షూటింగ్ పాల్గొన్నాను. దాంతో సమస్య పెద్దదైంది. దానివల్ల కొన్ని రోజులు షూటింగ్ ఆపాల్సి వచ్చింది. అది మినహా ఈ షూటింగ్ మొత్తం నాకో తియ్యని అనుభూతిలా మిగిలిపోయింది.

     

నా నిజజీవితంలో కృష్ణ లేడు. ప్రస్తుతం నేను కెమేరాని మాత్రమే ప్రేమిస్తున్నాను. నాకు అనుష్క అంటే ఇష్టం. ఆమె యాక్ట్ చేసిన అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, సైజ్ జీరో చిత్రాలు చూశాను. ఆమెకు నేను వీరాభిమానిని. హిందీలోవచ్చిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘క్వీన్’ వంటివి చేయాలని ఉంది. నటనను ఫుల్ టైమ్ కెరీర్‌గా ఫిక్స్ అయ్యాను కాబట్టి, మంచి పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళతాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top