'మనమంతా' మూవీ రివ్యూ

'మనమంతా' మూవీ రివ్యూ


టైటిల్ : మనమంతా

జానర్ : ఫ్యామిలీ డ్రామా

తారాగణం : మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనారావు, గొల్లపూడి మారుతీరావు...

సంగీతం : మహేష్ శంకర్

దర్శకత్వం : చంద్రశేఖర్ ఏలేటి

నిర్మాత : సాయి కొర్రపాటి



ఐతే, అనుకోకుండా ఒకరోజు, సాహసం లాంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా మనమంతా. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయడంతో పాటు, ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌతమీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం కూడా సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను మనమంతా అందుకుందా...?తెలుగులో మోహన్ లాల్ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అయ్యింది..? మనమంతా చంద్రశేఖర్ ఏలేటికి కమర్షియల్ హిట్ ఇచ్చిందా..?



కథ :

సాయిరామ్ (మోహన్ లాల్), గాయత్రి(గౌతమి), అభిరామ్( విశ్వాంత్), మహిత(రైనారావు).. ఈ నలుగురి జీవితాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగే కథ మనమంతా.. సాయిరామ్ ఓ సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసే మధ్యతరగతి వ్యక్తి. కుటుంబ పోషణకు తన జీతం సరిపోక అప్పులు చేస్తూ బండి లాగిస్తుంటాడు. అదే సమయంలో తన స్టోర్ మేనేజర్ రిటైర్ అవ్వటంతో ఆ మేనేజర్ పోస్ట్ తనకు వస్తుందని ఆశపడతాడు. కానీ విశ్వనాధ్ అనే మరో అసిస్టెంట్ మేనేజర్ వల్ల తనకు ఆ పోస్ట్ రాదేమో అనుమానంతో విశ్వనాధ్ను అడ్డు తప్పించడానికి ప్లాన్ చేస్తాడు.. కానీ ఆ ప్లాన్ మూలంగా తానే చిక్కుల్లో పడతాడు.



గాయ్రతి ఓ మధ్యతరగతి గృహిణి, ఉన్నత చదువులు చదివినా.. అవన్ని పక్కన పెట్టేసి ఇంటి పనులుకే పరిమితమవుతుంది. మిడిల్ క్లాస్ మనుషులకు ఎదురయ్యే అవమానాలకు కన్నీళ్లు పెట్టడం తప్ప ఏం చేయలేని నిస్సహాయురాలు. అలాంటి గాయత్రికి తన చిన్నతనంలో తన వల్ల సాయం పొందిన ఓ పెద్దమనిషి సింగపూర్లో ఉద్యోగం ఇప్పిస్తానంటాడు. అప్పటి వరకు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియని గాయత్రి, కుటుంబం కోసం సింగపూర్ వెళ్లడానికి సిద్ధమవుతుంది.



విశ్వాంత్ చదువు తప్ప మరో ఆలోచనలేని ఇంజనీరింగ్ స్టూడెంట్. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన ఐరా(అనీషా ఆంబ్రోస్) అనే అమ్మాయి వల్ల విశ్వాంత్ ఆలోచనలు మారిపోతాయి.. ఐరానే తన ప్రపంచం అనుకుంటాడు. కానీ ఐరా, విశ్వాంత్ను ఒక ఫ్రెండ్ గానే భావిస్తుంది. మహిత తన చుట్టూ ఉన్న వాళ్లందరిని ఆనందంగా చూడలనుకునే చిన్నపాప. గుడిసెలో ఉండే ఓ చిన్నబాబుతో స్నేహం చేసి.. ఆ అబ్బాయికి తను చదివే స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తుంది. కానీ ఆ అబ్బాయి తప్పిపోవటంతో తనే వెతికే బాధ్యతను తీసుకుంటుంది.



ఇలా నాలుగు రకాల సమస్యలతో బాధపడుతున్న ఈ నలుగురికి సంబంధం ఏంటి..? సాయిరామ్ మేనేజర్ పోస్ట్ కోసం కొని తెచ్చుకున్న సమస్య నుంచి బయట పడ్డాడా..? గాయత్రి కుటుంబాన్ని వదిలి సింగపూర్ వెళ్లిందా..? విశ్వాంత్.. ఐరా కాదన్న తరువాత ఏమైయ్యాడు..? మహిత తన ఫ్రెండ్ను కనుక్కోగలింగిందా..? అన్నదే మిగతా కథ.



నటీనటులు :

ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన తెలుగు సినిమా కోసం మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ని ఒప్పించిన చంద్రశేఖర్ ఏలేటి అప్పుడే తొలి విజయం  సాధించాడు. మధ్యతరగతి సమస్యలతో సతమతమయ్యే ఉద్యోగిగా మోహన్ లాల్ నటన అద్భుతమనే చెప్పాలి. తొలి సినిమాలోనే సొంతం గొంతుతో డబ్బింగ్ చెప్పిన మోహన్ లాల్, మొదట్లో కాస్త తడబడినట్టు అనిపించినా.. తరువాత బాగానే ఆకట్టుకున్నాడు. గాయత్రిగా గౌతమి నటన బాగుంది. మిడిల్ క్లాస్ మహిళగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఆమె సీనియారిటీ సినిమాకు ప్లస్ అయ్యింది. విశ్వాంత్, రైనారావులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో గొల్లపూడి మారుతిరావు, వెన్నెలకిశోర్, హర్షవర్ధన్, నాజర్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.



సాంకేతిక నిపుణులు :

తన కెరీర్లో ప్రతీ సినిమా ఓ ప్రయోగంగా నిలిచిపోయేలా చేసే చంద్రశేఖర్ ఏలేటి మనమంతా సినిమాతో మరోసారి స్టైల్ను కంటిన్యూ చేశాడు. ఆసక్తికరమైన స్క్రీన్ప్లేతో మధ్యతరగతి జీవితాలను వారి సమస్యలను అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించాడు. నాలుగు కథలు ఒకేసారి నడుస్తున్నా.. ఎక్కడ ఆడియన్స్ కన్య్ఫూజ్ కాకుండా సినిమాను ముందుకు నడిపించాడు. నటీనటుల ఎంపిక నుంచి ప్రతీ విషయంలోనూ చంద్రశేఖర్ ఏలేటి మార్క్ సినిమాలో స్పష్టంగా కనిపించింది. మహేష్ శంకర్ అందించిన పాటలు విజువల్గా చాలా బాగున్నాయి. నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫి, జివి చంద్రశేఖర్ ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి.



ప్లస్ పాయింట్స్ :

ప్రధాన పాత్రల నటన

స్క్రీన్ ప్లే

క్లైమాక్స్



మైనస్ పాయింట్స్ :

కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం



ఓవరాల్గా మనమంతా అద్భుతమైన నటన, ఆసక్తికరమైన కథా కథనాలతో థ్రిల్ కు గురిచేసే ఫ్యామిలీ డ్రామా



- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top