నచ్చే ప్రేమగాథ

నచ్చే ప్రేమగాథ - Sakshi


చిత్రం: ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, తారాగణం: నాని, మెహరీన్, ‘మిర్చి’ సంపత్, మాటలు: జై కృష్ణ, పాటలు: కృష్ణకాంత్, కెమేరా: యువరాజ్,యాక్షన్: విజయ్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హను రాఘవపూడి

 

 ఈ మధ్య చూసిన సినిమాల్లో కథ గురించి, టేకింగ్ గురించి, ప్లాట్ గురించి, కెమెరా వర్క్ గురించి మాట్లాడడం సహజంగా జరుగుతోంది. ఈ ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ దర్శకుడు హను.. మంతుడు... అంటే పనిమంతుడు అని చెప్పాలనిపిస్తుంది. దర్శ కత్వ ప్రతిభ ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. కృష్ణగాడి (నాని) వీర ప్రేమగాథ చిన్నప్పుడే మొదలైంది. పదేళ్ల వయసులో మహాలక్ష్మిని (మెహరీన్) ప్రేమిస్తాడు. కానీ చెప్పుకోలేడు. చెబితే వాళ్ల అన్న రామరాజు కుళ్లబొడుస్తాడేమోనని భ యం. కాదు ప్యాంటు తడుపుకునేంత భయం. ఎందుకంటే మహాలక్ష్మి అన్న రాయలసీమలోని ముఠా నాయకుడు రాజన్నకు నమ్మినబంటు. చాలా పరాక్రమశాలి.

 

 ఓ ఇరవైమందిని ఒంటి చేతితో మట్టి కరిపించగల శక్తిమంతుడు. ఇతని ప్రత్యర్థి అప్పిరెడ్డి... రాజన్నను చంపాలనే ప్రయత్నంలో తన ఐదుగురు కొడుకులను పొగొట్టుకుంటాడు. అతణ్ణి ఎప్పుడె ప్పుడు చంపుదామని చూస్తూ ఉంటాడు. ఇక హీరోయిన్‌కి కూడా అన్నకు తగ్గట్టు కాస్త తెగువ ఎక్కువే. దాని వల్ల హీరో నానికి కష్టాలు కావాల్సినన్ని. చిన్నతనం నుంచి పెకై ప్పుడూ దెబ్బలాడు కునే హీరో, హీరోయిన్లు ఎవరికీ తెలియకుండా ప్రేమించేసుకుం టారు. ‘మా అన్నకు చెప్పి ముహూర్తం పెట్టమ’ని హీరోయిన్ ఒత్తిడి చేస్తుంది.

 

 కానీ ‘మీ అన్నే వచ్చి నన్ను అడగాలి’ అని తప్పించుకునే పిరికివాడు హీరో. రాజన్నకు ఓ తమ్ముడు. పేరు శ్రీకాంత్ (‘మిర్చి’ సంపత్). హైదరాబాద్‌లో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. ఎవరికీ భయపడని నీతిమంతుడు. అరెస్ట్ చేస్తే జాబ్ చేస్తున్నట్టు ఉంటుందని, ఎన్‌కౌంటర్ చేస్తే జాబ్ ‘బాగా’ చేస్తు న్నట్టుంటుందని అతని నమ్మకం. క్రిమినల్స్‌ని అతను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్నట్టు, వదిలేస్తే మిస్సింగ్ న్యూస్‌లో ఉంటారు. ఎంతటి మూర్ఖుడంటే డీఎస్పీని కూడా ఎన్‌కౌంటర్ చేసే టైప్.

 

 ఇంతలో దుబాయ్ నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డాన్ సింగపూర్ నుంచి డేవిడ్ ఇబ్రహీం(మురళీశర్మ) హైదరాబాద్‌లోకి ఎంటరవుతాడు. వాళ్ల అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో చాదర్ సమర్పించుకోవడానికి వస్తాడు. ఆ సమయం లోనే ర్యాష్ డ్రైవింగ్ కేసులో మురళీశర్మను ‘మిర్చి’ సంపత్ అరెస్ట్ చేస్తాడు. ఇక ‘మిర్చి’ సంపత్‌కున్న ఎన్‌కౌంటర్ ఇమేజ్‌కు భయ పడి, తమ భాయ్‌ని విడిపించుకోవడం కోసం రాజన్న దగ్గరకొ చ్చిన అతని పిల్లల్ని కిడ్నాప్ చేయాలని యత్నిస్తారు భాయ్ అను చరులు. ఈ ప్రయత్నాన్ని హీరోయిన్ అన్న విఫలం చేసి పిల్లల్ని హీరో నానికి అప్పగిస్తాడు. ఈ పిల్లల్ని జాగ్రత్తగా హైదరాబాద్‌కు తీసుకువెళితే తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు.

 

 చావడానికి కాదు బ్రతకడానికి ఓ ధైర్యం కావాలి అన్న ఫిలాసఫీ వెనక దాక్కునే పరమ పిరికి క్యాండిడేట్ మన హీరో. శుద్ధ పిరికివాడైన హీరోగారి నాన్న ఎవరి పిల్లవాడినో కాపాడ బోయి తన ప్రాణాల్ని పోగొట్టుకుంటాడు. అందుకే తండ్రిని మూర్ఖుడనుకుంటాడు హీరో. ఇంతలో హీరోయిన్ అన్న ఇచ్చిన ఆఫర్‌కి ఉబ్బిత బ్బిబై, పిల్లల్ని హైదరాబాద్ చేర్చే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో సెకండాఫ్‌లో కావాల్సినంత కామెడీ, అంతకంటే ఎక్కువ ట్విస్టులతో కథ సుఖాంతమవుతుంది. పిరికి హీరో- వాళ్ల నాన్న చేసిన త్యాగాన్ని గౌరవించడమే కాక ధైర్యవంతుడిగా ఎలా మారతాడనేది డెరైక్టర్ తెరపై క్రియేట్ చేసిన రెండున్నర గంటల ప్రయాణం.

 

 ప్రేమ హీరోతో ఏమైనా చేయిస్తుందనేది మనందరికీ తెలిసిన విషయం. సినిమా మీద ప్రేమతో ఈ టీమ్ చేసిన ప్రయత్నం మంచి ప్రయత్నమే అనుకోవచ్చు. సినిమా సెకండ్ హాఫ్ అంతా ప్రధానంగా ముగ్గురు చిన్నపిల్లల చుట్టూరా నడపడం తెలివైన ఎత్తు. సినిమాను ఫ్యామిలీలకు సన్నిహితం చేసి, ఆడి యన్‌‌స మార్కెట్ సైజ్ పెంచడానికి ఉపకరించే బాక్సాఫీస్ వ్యూహం. పాత్రలకు నటుల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హీరో ఫ్రెండ్‌గా ‘సత్యం’ రాజేశ్, అలాగే మురళీశర్మ, బ్రహ్మాజీ, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి, ‘ప్రభాస్’ శ్రీను నవ్విస్తారు.

 

విశాల్ చంద్రశేఖర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సీజీ, డీఐ, విజయ్ యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ తీయగా ఉన్నాయి ఏదీ అతిగా లేదు. కెమేరామన్ యువరాజ్ విజువల్స్, ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే ‘నువ్వంటే నా నవ్వు...’ పాట, ఆ లొకేషన్లు, చిత్రీకరణ తాజా అనుభూతినిస్తాయి. సాహిత్యమూ బాగుంది. నానీని పట్టుకోలేము అన్నంత బాగా పెర్ఫార్మ్ చేశాడు. స్ప్లిట్ సెకండ్‌లో హావభావాల్ని మార్చాల్సిన సన్నివేశాలు ఎన్నో స్క్రిప్ట్‌లో ఉన్నాయి. అన్నీ పట్టువిడుపులతో ఆడుకున్నాడు. హను రాఘవపూడి, నాని - ఇద్దరూ ఇద్దరే. ఇది వీళ్లిద్దరి వీరగాథ.

 - ప్రియదర్శిని రామ్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top