దోపిడీకి గురైన ప్రముఖ సినీ రచయిత

దోపిడీకి గురైన ప్రముఖ సినీ రచయిత - Sakshi


ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ దారి దోపిడీకి గురయ్యారు. అచ్చంగా సినిమా ఫక్కిలో చోరీ జరిగింది.  సినిమాల్లో చూపించినట్లే దుండగులు రోడ్డుకు అడ్డంగా చెట్టు పడవేసి మరీ దోపిడీకి పాల్పడ్డారు.  నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ కోన వెంకట్తో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా దొంగల బారిన పడగా, దర్శకుడు శ్రీను వైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తృటిలో తప్పించుకున్నారు. నగర శివార్లలో జరిగిన  ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.



వివరాల్లోకి వెళితే  ఈనెల 26న  షాద్ నగర్లో ప్రకాష్ రాజ్ ఫాంహౌస్లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. పార్టీ అనంతరం రాత్రి 2 గంటల సమయంలో కోన వెంకట్, దానయ్య ..సిటీకి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు దారికాచి దోపిడీకి పాల్పడ్డారు. గొడ్డళ్లతో కారు అద్దాలు పగులగొట్టి వారి వద్ద నుంచి బంగారు గొలుసులు, ఉంగరాలు, డబ్బులు దోచుకు వెళ్లారు. దుండగులు దోచుకు వెళ్లిన సొత్తు మొత్తం రూ.3లక్షల ఉంటుందని అంచనా.



కాగా వీరి వెనుకనే వస్తున్న శ్రీనువైట్ల, థమన్, గోపీ మోహన్.... దోపిడీ వ్యవహారాన్ని గమనించి తమ వాహనాలను వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. అనంతరం కోన వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు దారిదోపిడీ విషయాన్ని షాద్ నగర్ పోలీసులు ధ్రువీకరించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాద్ నగర్ సీఐ శంకరయ్య తెలిపారు.



ఇక ఈ సంఘటనపై కోన వెంకట్ మాట్లాడుతూ తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని, దుండగుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడినందుకు హ్యాపీగా ఉందన్నారు. మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇవ్వాలని దొంగలు బెదిరించినట్లు ఆయన తెలిపారు.  కాగా.. డబ్బు పోతే పోయింది కానీ, తన తదుపరి చిత్రానికి మంచి కథ దొరికిందని కోన వెంకట్ వ్యాఖ్యానించటం కొసమెరుపు. ఈ దారిదోపిడీకి సంబంధించిన సన్నివేశాలు  క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'శంకరాభరణం' చిత్రంలో ప్రేక్షకుల్ని అలరించవచ్చు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top