ఎవరో ఇచ్చే సర్టిఫికెట్ల కోసం నేను బతకలేను!

ఎవరో ఇచ్చే సర్టిఫికెట్ల కోసం నేను బతకలేను! - Sakshi


 80ల్లో చిన్న సినిమాల సూపర్ హీరోయిన్ ఎవరు? అంటే... టకీమని వచ్చే సమాధానం.. కవిత. జయసుధ, శ్రీదేవి, జయప్రద ఓ వైపు పెద్ద సినిమాలతో దుమ్ము రేపుతుంటే, కవిత... చిన్న  సినిమాల పాలిట కల్పతరువుగా నిలిచారు. ‘ప్రెసిడెంట్ పేరమ్మ’, ‘ఊరికిచ్చిన మాట’ ఇత్యాది చిత్రాలతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆ తరం హీరోయిన్లలో జానపద నాయికగా రాణించిన ఘనత కవితది. ముక్కు సూటిగా మాట్లాడటం కవిత ప్రత్యేకత. సేవాగుణం ఆమెకున్న ఆభరణం. నేడు పుట్టినరోజు జరుపుకుంటోన్న ఈ అభినేత్రితో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.

 

 మీ ఫ్యామిలీ గురించి...

 నేను పశ్చిమగోదావరి జిల్లా, నిడమర్రులో పుట్టాను. నేను ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడే మా కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది. నాకు ఆరేళ్లున్నప్పుడు మద్రాస్ షిఫ్ట్ అయ్యాం. అక్కడ నాన్న బిజినెస్ స్టార్ట్ చేసి నష్టపోవడంతో సర్వం పోయి, అందరం రోడ్డున పడ్డాం. ఒక్క పూట మాత్రం మాకు తిండి పెట్టగలిగేవారు నాన్న. చదువులు చెప్పించే స్తోమత అసలే లేదు. దాంతో మద్రాసులో తెలుగువారి కోసం ఫ్రీగా చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేదాన్ని. అలాంటి సమయంలో నాన్నకు కృష్ణయ్య అనే నిర్మాత పరిచయమయ్యారు. ఆయన నన్ను చూసి... ‘చక్కగా ఉన్నావ్, సినిమాల్లో నటిస్తావా’ అనడిగారు. నేను తల అడ్డంగా ఊపి... ‘చదువుకోవాలి’ అనేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాను. ఆ రోజు సాయంత్రం నాన్న నన్ను పిలిచి, ‘రేపు స్కూలుకెళ్లకు, మనం ఆడిషన్స్‌కి వెళ్లాలి’ అన్నారు. అంతే, అమ్మ దగ్గరకు వెళ్లి నాకు సినిమాలొద్దు అంటూ ఏడ్చేశాను. ‘అంకుల్ మాట కాదనలేక నాన్న సరే అని ఉంటారు, చూద్దాంలే, ఏడవకు’ అంటూ అమ్మ ఊరుకోబెట్టింది. దాంతో సరే అన్నాను.

 

 ఆ తర్వాత?

 మర్నాడు పొద్దున్నే ఓ అంబాసిడర్ కారు వచ్చి మా ఇంటిముందు ఆగింది. మేం ‘ఓ మంజు’ అనే తమిళ చిత్రం ఆడిషన్స్‌కి వెళ్లాం. అక్కడ ఆరొందలమందికి పైగా అమ్మాయిలు ఉన్నారు. అందరూ జీన్స్, టీషర్టులు వేసుకుని, మంచి హెయిర్ స్టయిల్స్‌తో ఉన్నారు. నేనేమో లంగా-జాకెట్ వేసుకుని, తల నిండా నూనె రాసుకుని, రెండు జడలకూ రిబ్బన్లు కట్టుకుని... అచ్చమైన పల్లెటూరి పిల్లలా ఉన్నాను. దానికి తోడు పేదరికం వల్ల చాలా బలహీనంగా, నల్లగా అదోలా ఉండేదాన్ని. దాంతో వాళ్లముందు తక్కువగా ఫీలయ్యి మళ్లీ ఏడుపందుకున్నా. ఎలాగైతేనేం... ఆడిషన్స్ పూర్తి చేశాను. తర్వాతిరోజు మేకప్ టెస్ట్ కూడా చేశారు. ఎలాగూ సెలెక్ట్ కానులే, హ్యాపీగా చదువుకుందాం అనుకున్నాను. కానీ మర్నాడు పొద్దున్నే మళ్లీ అంబాసిడర్ కారు ప్రత్యక్షమయ్యింది... ఓ బొకే, స్వీట్ బాక్సుతో. అప్పుడు కూడా నేను చేయనని మళ్లీ ఏడ్చాను. కానీ అమ్మ... ‘ఈరోజు మనకి కడుపు నిండా తిండి లేదు. నువ్వు ఒప్పుకుంటే సినిమాకి ఐదు వేలు ఇస్తారు. దాంతో మనం సంవత్సరమంతా కడుపు నిండా తినవచ్చు. అక్కని, చెల్లిని, తమ్ముణ్ణి చదివించవచ్చు’ అంది. ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది. అందుకే పదకొండేళ్లకే మేకప్ వేసుకున్నా!

 

 తెలుగులో మీ తొలి సినిమా ఏది?

 సిరిసిరిమువ్వ. జయప్రదకు చెల్లెలి పాత్ర. అయితే పూర్తి స్థాయి హీరోయిన్‌గా చేసింది మాత్రం ‘చుట్టాలున్నారు జాగ్రత్త’లో!

 

 చిన్న వయసులోనే బరువైన పాత్రలు చేశారు. కష్టమనిపించలేదా?

 కాస్త కష్టంగానే ఉండేది. ‘ఓ మంజు’ సూపర్ హిట్ కావడంతో నా మీదే కథలు అల్లడం మొదలుపెట్టారు. దాంతో బరువైన పాత్రలు పోషించాల్సి వచ్చేది. ‘పునాదిరాళ్లు’ చేస్తున్నప్పుడు నా వయసు పదమూడేళ్లు. అందులో అరవయ్యేళ్ల వృద్ధురాలి పాత్ర చేశాను. ‘సీత గీత దాటితే’లో శ్రీధర్‌కి భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా నటించాను. పెళ్లంటేనే తెలియని ఆ వయసులో గర్భవతి అయినట్టు, బిడ్డను కన్నట్టు నటించడం, బిడ్డను చంకనేసుకుని తిరగడం... ఇబ్బందిగా ఉండేది. కానీ దేవుడిచ్చిన శక్తి వల్లో, అమ్మ ప్రోత్సాహం వల్లో  మేనేజ్ చేసేసేదాన్ని!

 

 మీరు జతకట్టిన హీరోల్లో ఎవరితో నటించడానికి ఎక్కువ ఇష్టపడేవారు?

 ప్రత్యేకంగా ఒకరనేం లేదు. అందరి దగ్గరా కంఫర్టబుల్‌గానే ఫీలయ్యేదాన్ని. నిజానికి ఎన్టీయార్, శివాజీ గణేషన్... ఈ ఇద్దరితో మాట్లాడాలంటే అందరూ భయపడేవారు. కానీ నాకలా ఏమీ ఉండేది కాదు. ఎన్టీయార్ నన్నో చంటిపిల్లలాగా చూసేవారు. శివాజీగారయితే దగ్గర కూర్చోబెట్టుకుని డైలాగులు చెప్పడం నేర్పేవారు.

 

 మీ హిట్ పెయిర్ ఎవరు?

 చంద్రమోహన్‌తో నా జోడీ బాగుంటుందని అందరూ అనేవారు. ఆయన పక్కన హీరోయిన్‌గా 23 సినిమాలు చేశాను. ఇతరత్రా పాత్రల్లో కనిపించినవి కూడా లెక్కేస్తే యాభై, అరవై వరకూ ఉంటాయి. అలాగే కృష్ణగారితో 18 సినిమాలు చేశాను. మోహన్‌బాబుగారితో కూడా చాలా సినిమాలే చేశాను.

 

 అంత డిమాండ్ ఉన్న మీరు... సడెన్‌గా సినిమాలకెందుకు దూరమయ్యారు?

 విశ్రాంతి కావాలనిపించింది. నాకోసం నాకు కాస్త సమయం కేటాయించుకోవాలనిపించింది. అప్పట్లో నా పరిస్థితి ఎలా ఉండేదంటే... మద్రాస్ ఏవీఎం స్టూడియోలో ఒకేసారి నావి మూడు నాలుగు సినిమాల షూటింగ్ జరుగుతుండేది. ఒకచోట సీన్ అయ్యాక మరోచోటికి పరుగు తీస్తుండేదాన్ని. చాలా అలసిపోయేదాన్ని. సరయిన నిద్ర కూడా ఉండేది కాదు. ఎప్పుడూ ఉరుకులూ పరుగులే! అలాంటి సమయంలోనే నా జీవితంలోకి మావారు (దశరథ్‌రాజ్) వచ్చారు. ఆయన్ని పెళ్లి చేసుకుని, వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని చవిచూడాలనుకున్నా.

 

 మీది ప్రేమ వివాహమా?

 కాదు... పెద్దలు కుదిర్చిన పెళ్లే. నేను హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడు, మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అది నన్ను చాలా కుంగదీసింది. కొన్నాళ్లపాటు డిప్రెషన్లో ఉండిపోయాను. ఏ స్థితికి చేరుకున్నానంటే... షూటింగ్ స్పాట్‌లో ఎవరైనా మా తమ్ముడి ప్రస్తావన తెస్తే ఏడ్చి, సొమ్మసిల్లి పడిపోయేదాన్ని. దాంతో నన్ను గాలిమార్పు కోసం కొన్నాళ్లపాటు ఎక్కడికైనా తీసుకెళ్లమని చెప్పారు డాక్టర్లు. నాకు మేకప్ అంటే ఇష్టం ఉండడంతో, మంచి మంచి కాస్మొటిక్స్ కొనిపెడతాం అంటూ అమ్మానాన్నలు నన్ను సింగపూర్ తీసుకెళ్లారు. అక్కడ పరిచయమయ్యారు దశరథ్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి ఆయన ఫ్రెండ్. వ్యాపారం నిమిత్తం అప్పటికి సింగపూర్లో ఉన్నారు. నన్ను చూసి ఇష్టపడ్డారు. వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా నేను నచ్చడంతో పెళ్లి ఖాయమైంది.

 

 పంథొమ్మిదేళ్ల వయసులో పెళ్లి... అదీ కెరీర్ మంచి ఊపుమీద ఉన్నప్పుడు...

 చాలామంది అన్నారు... అందరూ పంథొమ్మిదేళ్లకు హీరోయిన్ అవుతారు, నువ్వేమో హీరోయిన్ పొజిషన్‌ని వదులుకుని పెళ్లికి సిద్ధపడుతున్నావ్ అని. కానీ అలా చేయడానికి నేనేం ఫీలవలేదు.. దానికి కారణం మావారు. పెళ్లి కుదిరేనాటికి నేను పద్ధెనిమిది సినిమాలు సైన్ చేసివున్నాను. అవి పూర్తి చేశాకే చేసుకుంటానని చెప్పాను. మావారు, అత్తమామలు సరే అన్నారు. ఆ గ్యాప్‌లో మావారిని బాగా అబ్జర్వ్ చేశాను. నిశ్చితార్థం అయిపోయినా కూడా ఎప్పుడూ అతి చనువు తీసుకునేవారు కాదు. బయటకు రా కలుద్దాం అనో, అక్కడికెళ్దాం ఇక్కడికెళ్దాం అనో అనేవారు కాదు. నన్ను కలవాలంటే మా కుటుంబంతో ఉన్నప్పుడే కలిసేవారు. మా ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలోనూ శ్రద్ధ చూపేవారు. అవన్నీ నాకు చాలా నచ్చేవి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... నన్ను పుట్టింటి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకు రావడానికి వీల్లేదని చెప్పారు. ‘మీ ఇంట్లోవాళ్ల కోసం కష్టపడి సంపాదించావ్, వాటిని వాళ్లకే ఉండనివ్వు, నీకు ఏ లోటూ రాకుండా చూసుకోగలిగే స్థాయిలో నేనున్నాను, కట్టుబట్టలతో నా దగ్గరకు వస్తే చాలు’ అన్నారాయన. అలాంటి వ్యక్తితో జీవితం పంచుకునే అవకాశం కలిగినందుకు చాలా సంతోషమేసింది. అందుకే రెండేళ్లలో చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేసి హ్యాపీగా పెళ్లి చేసుకున్నాను.

 

 బయటి వ్యక్తిని పెళ్లాడారు... ఇండస్ట్రీలో వాళ్లెవరూ మీకు ప్రపోజ్ చేయలేదా?

 (నవ్వుతూ) పేర్లు చెప్పను కానీ చాలామంది చేశారు. ఇప్పుడు సొసైటీలో టాప్ పొజిషన్స్‌లో ఉన్న కొందరు అప్పట్లో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ల గురించి ఆలోచించేంత తీరిక కానీ, పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకునేంత వయసు కానీ నాకప్పుడు లేవు.

 

 అంటే, మీరు కూడా ఎవరినీ ఇష్టపడలేదన్నమాట..?

 ఇష్టపడలేదు. కాకపోతే ఇండస్ట్రీకి రాకముందు కృష్ణగారంటే ప్రాణం నాకు. హీరోయిన్‌ని అయ్యాక, ఆయనతో నటించేటప్పుడు డైలాగులు మర్చిపోయేదాన్ని. విజయనిర్మలగారు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో కృష్ణగారి సరసన నటించాను. స్పాట్‌లో డైలాగులు చెప్పకుండా ఆయనవైపే చూస్తూ నిలబడిపోయేదాన్ని. విజయనిర్మలగారు ‘డైలాగ్ చెప్పకుండా అలా చూస్తావేంటి’ అనేవారు. ‘నావల్ల కావడం లేదండీ, ఆయనంటే నాకు చాలా ఇష్టం, ఆయన్ని చూస్తుంటే డైలాగులు గుర్తే రావడం లేదు’ అనేదాన్ని. ఆవిడ నవ్వేసేవారు. అంతేతప్ప ఎవరినీ ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలనీ అనుకోలేదు. నాకేం కావాలో అమ్మానాన్నలకు తెలుసు, వాళ్లు చూసుకుంటారులే అనుకునేదాన్ని. వాళ్లు మంచి వ్యక్తిని చూపించారు, పెళ్లి చేసుకున్నా. ముగ్గురు పిల్లల్ని కని సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషాన్ని తృప్తిగా అనుభవించడం కోసమే పదమూడేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాను.

 

 రీ ఎంట్రీ ఇచ్చాక ఇండస్ట్రీలో అదే ఆదరణ లభించిందా?

 అసలు నాకు ఆదరణ ఎప్పుడు లభించిందని! ఎప్పుడూ ప్రేక్షకులే నన్ను అభిమానించి, ఆదరించారు తప్ప... ఇండస్ట్రీవాళ్లు... నా ఉద్దేశం, తెలుగువాళ్లు నన్నెప్పుడూ ఆదరించలేదు. నేను తెలుగు సినిమాలు చేశాను, నటిగా టాలీవుడ్‌లో నిలబడ్డాను అంటే... అది కొందరు చిన్న దర్శకులు, నిర్మాతల వల్లే తప్ప ఏ టాప్ దర్శకుడూ, నిర్మాతా నన్ను ప్రోత్సహించించే లేదు.

 

 అదేంటి... మీకెవరూ అవకాశాలు ఇవ్వలేదా?

 లేదు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పెద్ద పెద్ద హీరోలందరి సరసన నటించాను. పెద్ద పెద్ద బ్యానర్లలో పని చేశాను. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నాకు అవార్డులు ఇచ్చాయి. కానీ తెలుగులో పరిస్థితి వేరు. అదేంటో కానీ... ఇక్కడి పెద్ద దర్శకులకి, నిర్మాతలకి నాలో మంచి నటి కనిపించనే లేదు! ఒకప్పుడు హీరోయిన్స్ అంటే శ్రీదేవి, జయప్రద, జయసుధ, నేను! ఆ పొజిషన్లో ఉన్నదాన్ని, అచ్చమైన తెలుగమ్మాయిని... అయినా వాళ్లెవరూ నాకు చాన్సులిచ్చేవారు కాదు. అసలు నన్ను పట్టించుకునేవారే కాదు. ఒక్కోసారి ఏడ్చేసేదాన్ని కూడా!

 

 వాళ్లు మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం?

 ఇక్కడ ఎంత తెలుసు అన్నది కాదు... ఎవరు తెలుసు అన్నది ముఖ్యం! వాళ్ల లెక్కలు వేరే ఉంటాయి. నిజమైన టాలెంట్, నిజాయతీగా పనిచేసే తత్వం పనికి రావు. దానికి తోడు కులపిచ్చి ఒకటి. నాది వైశ్యకులం. కాబట్టి అవకాశాలిచ్చేవారు కాదు. ఎక్స్‌పోజింగ్ చేసేదాన్ని కాదు కాబట్టి నచ్చేదాన్ని కాదు. నా సినిమాలు వంద రోజులు, రెండు వందల రోజులు ఆడుతున్నా నేను వాళ్ల కళ్లకి కనిపించలేదంటే ఏమనాలి?!

 

 మరి.. దీని గురించి మీరెవరినీ ప్రశ్నించలేదా?

 ఎందుకడగాలి! వాళ్లకు తెలియదా నా ప్రతిభ ఏంటో! వాళ్లకు తెలియదా మిగతా భాషల్లో నాకు దొరికిన స్థానమేంటో! నేను చేసినవన్నీ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు. నాతో సినిమాలు తీసిన చిన్న నిర్మాతలు, దర్శకులు జీవితాల్లో స్థిరపడ్డారు. సో కాల్డ్ టాప్ డెరైక్టర్లు, నిర్మాతలు కోట్లు ఖర్చుపెట్టి టాప్ హీరోలతో తీసిన సినిమాలు... చిన్న నిర్మాతలు, దర్శకులు నన్నే ప్రధానంగా పెట్టి తీసిన సినిమాలు ఒకేరోజు విడుదలయ్యేవి. వాళ్ల సినిమాలు రెండో రోజునే థియేటర్ల నుంచి తప్పుకుంటే, నా సినిమాలు మాత్రం యాభై, వంద రోజులు ఆడుతుండేవి. అయినా వాళ్ల కంటికి నేను ఆనలేదంటే  ఏమనాలి?! పోనీ అప్పుడేదో అయిపోయిందిలే అనుకుందామంటే, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇవాళ టాప్ డెరైక్టర్స్‌గా ఉన్నవాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు. నాకేం హీరోయిన్ పాత్రలివ్వక్కర్లేదు... తల్లిగానో, అత్తగానో తీసుకుంటే చాలు కదా! ఎవరో ముక్కూ ముఖం తెలియనివాళ్లని తెచ్చి చేయించుకుంటారు. ఇంకా అన్యాయం ఏమిటంటే... ‘మీరు మద్రాస్‌లో ఉంటే ఎలా, ఫ్లైట్ చార్జీలు, హోటళ్ల ఖర్చులు ఇచ్చి పిలిపించుకోవాలంటే కష్టం... ఇక్కడకు వచ్చేయండి’ అన్నారు కొందరు. వాళ్ల మాటలు నమ్మి హైదరాబాద్ వచ్చేశాను. తీరా వచ్చాక నన్ను మానేసి, ఇతర భాషల వాళ్లకి ఫ్లయిట్ చార్జీలు ఇచ్చి రప్పించుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ఇక్కడికి వచ్చేసినందుకు తమిళ, మలయాళ, కన్నడ ఆఫర్లన్నీ పోయాయి. రెంటికీ చెడ్డ రేవడినయ్యాను.

 

 వందేళ్ల సినిమా వేడుక అప్పుడు చేదు అనుభవం ఎదురైనట్లుంది?

 అవును. ఐదో పదో సినిమాలు చేసి మాయమైపోయిన వాళ్లకి ఇన్విటేషన్లు పంపారు కానీ... నాలుగు భాషల్లో 130 సినిమాలు చేసిన నన్ను పిలవలేదు. నిజానికి అలా జరగడానికి కారణం... కమిటీకి ఓ తెలుగువాడు చైర్మన్ కావడం! బహుశా మరో భాష వాళ్లెవరైనా ఉంటే నన్ను మర్చిపోయేవారు కాదేమో. కానీ ఓ తెలుగు వ్యక్తి చేతుల్లోనే ఆ అధికారాన్ని పెట్టడం వల్ల నాకు అన్యాయం జరిగింది.

 

 ఈ ఆవేశంతో రాజకీయాల్లో ఎలా నిలదొక్కుకోగలరనుకున్నారు?

 నిజమే. నాలాంటి ఎమోషనల్ పర్సన్స్ రాజకీయాలకు సూట్ కారు. నా దృష్టిలో ఎమోషన్స్ లేనివాడు మనిషే కాదు. సున్నిత మనస్తత్వాన్ని కోల్పోయిన రోజున ఏ మనిషీ మనిషిలా ఉండలేడు. ఓ మంచి ఉద్దేశంతో, ప్రజలకు మంచి చేద్దామని వెళ్లాను. కానీ అక్కడా సేమ్ స్టోరీ రిపీటయ్యింది. ఎంత నిజాయతీగా పని చేశామని కాదు, ఎంతమంది మనకు తెలుసు అన్నదాన్ని బట్టే అక్కడా మనుగడ ఉంటుందని అర్థమైంది.

 

 ఈ నిర్మొహమాటం వల్లే మిమ్మల్నందరూ పక్కన పెడుతున్నారేమో?

 అలా అని మనసులో ఒకటి పెట్టుకుని బయటికొకటి మాట్లాడటం  నావల్ల కాదు. ఎవరో ఇచ్చే సర్టిఫికెట్ల కోసం బతకలేను. నచ్చినవాళ్లు దగ్గరకు వస్తారు. నచ్చనివాళ్లు దూరంగా వెళ్లిపోతారు.

 

 ఈ మధ్య బుల్లితెరవైపు వెళ్లారు.. అక్కడ పరిస్థితి ఎలా ఉంది?

 ప్రశాంతంగా ఉంది. చేతినిండా పని, కోరుకున్నంత ఆదరణ, బోలెడంత గౌరవం లభిస్తోంది.

 

 సమాజసేవ కూడా చేస్తున్నారని విన్నాను...?

 నా వల్ల నలుగురికీ కాస్తయినా మంచి జరగాలన్న ఉద్దేశంతో ‘హెల్పింగ్ హ్యాండ్స్’ అనే స్వచ్ఛంద సంస్థను పెట్టాను. ఇప్పటి వరకూ కొందరిని చదివించాను. కొందరు పేద యువతీ యువకులకు పెళ్లిళ్లు జరిపించాను. కొందరికి జీవితంలో స్థిరపడేందుకు సాయపడ్డాను. ఏదో నాకు చేతనైనంత సేవ చేస్తున్నాను. దీని గురించి పబ్లిసిటీ ఇచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఒక చేతితో చేసే సహాయం రెండో చేతికి తెలియకూడదంటారు కదా! అందుకే సెలైంట్‌గా నా పని నేను చేసుకుపోతున్నాను. భగవంతుడు నన్ను దీవించాడు. నావల్ల మరికొందరు బాగుంటే అంతే చాలు నాకు!

 - సమీర నేలపూడి

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top