నన్ను నేను అబ్బాయిననుకుంటా..!

నన్ను నేను అబ్బాయిననుకుంటా..!


 ఇవాళ్టికీ మా అమ్మంటే నాకు అత్యంత ప్రేమ. అలాగే, నా అక్కచెల్లెళ్ళను కూడా అంతేలా ప్రేమిస్తాను. మొదటి నుంచి నన్ను నేను అబ్బాయిని అనుకుంటాను. అందుకే, కుటుంబానికి అండగా నిలబడి, పోషించడం నా బాధ్యతగా భావిస్తాను. మా కుటుంబానికి ఎదురైన ఆర్థిక ఇబ్బందులన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోగలిగినందుకు నేనెంతో గర్విస్తుంటాను. అయితే, నేనూ ఆడపిల్లనే కదా! ఒక్కోసారి నాలోని స్త్రీ సహజమైన బేలతనం బయటపడి వెక్కిరిస్తుంటుంది.



 టీనేజ్‌లోనే వెండితెర మీదకు వచ్చి, హిందీలోనే కాక, తెలుగులోనూ (వెంకటేశ్‌తో ‘మల్లీశ్వరి’) నటించి, అశేష అభిమానుల్ని సంపాదించుకున్న అందాల తార కత్రినా కైఫ్. ఒక పక్క హిందీ సినిమాలతో, మరో పక్క హీరో రణ్‌బీర్ కపూర్‌తో సాన్నిహిత్యం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారామె. రానున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రం ప్రచారంతో బిజీగా ఉన్న 31 ఏళ్ళ ఈ సౌందర్య రాశి తాజాగా తన బాల్యం, సినీ జీవితపు తొలి రోజులు, ఆలోచనా విధానం, రణ్‌బీర్ కపూర్‌తో సాన్నిహిత్యం గురించి ఎన్నో సంగతులు వెల్లడించారు.  ఏ నేను పుట్టింది హాంగ్‌కాంగ్‌లో. మా అమ్మ బ్రిటీషు వనిత. మా నాన్న గారేమో భారతీయులు. మేము ఆరుగురు అక్కచెల్లెళ్ళం. మాకు ఒక సోదరుడు. నా తోబుట్టువుల్లో ముగ్గురు నా కన్నా చిన్న. నా బాల్యంలోనే మా అమ్మా నాన్న విడిపోయారు.

 

 ఏ మా అమ్మ లాభాపేక్ష రహితమైన అనేక సేవా సంస్థల్లో పని చేస్తుంటుంది. కొన్నేళ్ళ క్రితం తమిళనాడు తీరంలో సునామీ బీభత్సం సృష్టించినప్పుడు ఆమె తొలిసారిగా భారతదేశానికి వచ్చింది. మదురైలో ఆరేడేళ్ళు ఉండి, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకొంది. సునామీ బాధిత కుటుంబాల పిల్లల కోసం ఒక పాఠశాల నిర్మాణంలో చురుకుగా పాల్గొంది. ఎప్పుడూ ఏదో ఒక సేవా కార్యక్రమం కోసం ఊరూరూ తిరిగే మా అమ్మ వల్ల పిల్లలమైన మేమందరం కూడా ఆమె వెంట దేశదేశాలు చుట్టేశాం.

 

 ఏ స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తల పిల్లలందరూ ఎలాగో మేమూ అలాగే చాలా సాదాసీదాగా పెరిగాం. పెరిగి పెద్దయి సొంత సంపాదన వచ్చే వరకు నేను షాపింగ్ మాల్స్‌కి కూడా వెళ్ళలేదంటే నమ్మండి. సొంతగా సంపాదించడం మొదలుపెట్టాకే కార్లలో తిరగసాగాను. లండన్‌లో మోడలింగ్ చేసిన తరువాత 17 ఏళ్ళ వయసులో ఒక మ్యాగజైన్‌కు మాడలింగ్ చేయడానికి తొలిసారిగా భారత్‌కు వచ్చాను. భారత్‌కు వచ్చే ముందు మూడేళ్ళూ నేనున్నది లండన్‌లోనే!

 

 ఏ అవకాశాల కోసం ముంబయ్‌లో తిరిగిన రోజులు కూడా నాకు గుర్తే. ముంబయ్‌లో అందరూ నాతో స్నేహపూర్వకంగా ఉన్నట్లు అనిపించింది. మొదటి రెండు నెలలూ నాకు అవకాశాలు రాలేదు. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఫరూఖ్ ఛోథియా సలహా మేరకు నా ఫోటోలు తీసుకుని మోడల్ కో-ఆర్డినేటర్లనూ, యాడ్ ఫిల్మ్‌ల ఏజంట్లనూ కలిశాను. ఔత్సాహిక మోడల్స్‌తో పాటు అలా క్యూలో నిల్చొని, అన్ని రకాల వాణిజ్య ప్రకటనలకూ ఆడిషన్ కోసం కష్టపడిన తరువాత ఫలితం దక్కింది.

 

 ఏ మోడలింగ్‌తో మొదలుపెట్టి కొన్నేళ్ళపాటు కష్టపడిన తరువాత హిందీలో తొలిసారిగా ‘సర్కార్’ చిత్రంలో చిన్నదైనా, మంచి పాత్ర లభించింది. సల్మాన్ ఖాన్‌తో కలసి నటించిన ‘మైనే ప్యార్ క్యోం కియా’ సినిమాతో నాకు తొలిసారిగా పెద్ద బ్రేక్ వచ్చింది. ఇక, అక్కడ నుంచి నా సినీ జీవితం ఎలా ముందుకు సాగిందో తెలిసిందే. నా సినీ జీవితపు తొలిరోజుల్లో ఆ యా చిత్రాల నటులు చేసిన సిఫార్సుల వల్ల కూడా చాలా అవకాశాలే వచ్చాయి. అప్పట్లో హీరో సల్మాన్ ఖాన్ కూడా నాకు అండగా నిలిచి అవకాశాలొచ్చేలా చేశారు.

 

 ఏ నేను స్వతహాగా తెలివైనదాన్నే. జీవితంలో ఆర్థిక భద్రత ముఖ్యమని నా నమ్మకం. అందుకే, చిన్న వయసు నుంచి పనిలో కష్టపడి, పైకి వచ్చాను. నా సొంత కాళ్ళ మీద నిలబడ్డాను. ఏ రంగం ఎంచుకున్నా అందులో నా ఉనికిని చాటుకోవాలనుకున్నాను. సినీ రంగం బాగా నచ్చడంతో అందులోనే నన్ను నేను చూసుకుంటూ స్థిరపడ్డాను. చిన్నప్పటి నుంచి పూర్తి శ్రద్ధతో పని చేయడం వల్ల మంచీ చెడూ గ్రహించడంతో గర్వం తలకెక్కలేదు. కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. కానీ, ఒక్కోసారి పరిస్థితులు మన చేతిలో లేకపోవడం వల్ల ఎంత కష్టపడినా ఫలితం ఉండకపోవచ్చు. అది గ్రహించాలి.

 

 ఏ ముందుగా నాకు ఆఫర్ చేసి, ఆ తరువాత మరొక నటికి వెళ్ళిన పాత్రల గురించి కానీ, ఆ సినిమాల గురించి కానీ నేనేప్పుడూ చెడ్డగా మాట్లాడను. జీవితంలో మనకంటూ కొన్ని నియమాలుండాలనీ, హుందాగా ప్రవర్తించాలనీ నా అభిప్రాయం. అయితే, ఒక దర్శకుడితో బాగా స్నేహం పెరిగిన తరువాత, ఆయన సినిమాలో నన్ను తీసుకోకపోతే మాత్రం భావోద్వేగానికి లోనవుతుంటా.

 

 ఏ ‘సావరియా’ చిత్రం విడుదలైనప్పటి నుంచి హీరో రణ్‌బీర్ కపూర్ నాకు తెలుసు. ఆయన కూడా నా లాగే స్నేహానికీ, స్నేహితులకూ ప్రాధాన్యమిస్తుంటారు. భావోద్వేగంతో ఉంటారు. అందరితో స్నేహంగా, సరదాగా, హుందాగా ఆయన నడుచుకొనే తీరు నాకెంతో నచ్చుతుంది. రణ్‌బీర్‌కు కూడా నా మనసు బాగా నచ్చుతుంది. ఒక పక్కన ఎంతో ప్రతిభావంతుడైన నటుడే కాక, తెలివైనవాడు, సున్నిత హృదయుడైన మంచి మనిషి కావడం వల్ల రణ్‌బీర్ అంటే నాకు ప్రాణం.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top