'కాటమరాయుడు' మూవీ రివ్యూ




టైటిల్ : కాటమరాయుడు

జానర్ : యాక్షన్ డ్రామా

తారాగణం : పవన్ కళ్యాణ్, శృతిహాసన్, అలీ, తరుణ్ అరోరా, నాజర్

సంగీతం : అనూప్ రుబెన్స్

దర్శకత్వం : కిశోర్ కుమార్ పార్థసాని (డాలీ)

నిర్మాత : శరత్ మరార్



సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరోసారి అభిమానుల్లో జోష్ నింపేందుకు కాటమరాయుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజిత్ హీరోగా తెలుగులోనూ రిలీజ్ అయిన వీరుడొక్కడే సినిమాను కేవలం పవన్ ఇమేజ్ ను నమ్ముకొని రీమేక్ చేశారు. ఫ్యాన్స్ తన నుంచి ఆశించే అన్ని రకాల మాస్ మసాలా ఎలిమెంట్స్ తో పాటు తన పొలిటికల్ మైలేజ్ కు కావాల్సిన అంశాలతో ఈ సినిమాలో ఉన్నాయన్న నమ్మకంతో పవన్ చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలించింది.



కథ :

కాటమరాయుడు(పవన్ కళ్యాణ్) రాయలసీమ ప్రాంతంలోని ఓ ఊళ్లో తిరుగులేని నాయకుడు. తప్పు జరిగితే ఎంతటి వాడినైన ఎదిరించటం, మాట వినకపోతే తాట తీసేయటం రాయుడికి అలవాటు. చిన్నప్పుడే ప్రేమ విఫలమవ్వటంతో అమ్మాయిలంటే ద్వేశించే రాయుడు, తనతో పాటు తన నలుగురు తమ్ముళ్లకు పెళ్లి చేయకుండా అలాగే ఉంచేస్తాడు. అప్పటికే ప్రేమలో పడ్డ కాటమరాయుడి తమ్ముళ్లు.. అన్నయ్య ప్రేమలో పడితేగాని తమకు పెళ్లిల్లు కావని ఎలాగైన రాయుడ్ని ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుంటారు.



లాయర్ లింగ(అలీ)తో కలిసి అవంతిక(శృతిహాసన్)ను కాటమరాయుడికి దగ్గర చేస్తారు. అయితే ఈ ప్రయత్నంలో కాటమరాయుడికి గొడవలంటే అసలు పడదని, పక్షులు, జంతువులను కూడా ప్రేమించేంత గొప్ప మనసని చెప్పి అవంతికకు, రాయుడి మీద ప్రేమ పుట్టేలా చేస్తారు. అవంతికతో కలిసి వాళ్ల ఊరికి బయలుదేరిన రాయుడి మీద ట్రైన్ లో ఎటాక్ జరుగుతుంది. ఈ గొడవలో రాయుడు ఎలాంటి వాడో తెలుసుకున్న అవంతిక అతన్ని కాదని వెళ్లిపోతుంది. (కాటమరాయుడు ఎలా ఉందో తెలుసా..!)




కానీ అవంతిక కోసం అన్ని వదులుకున్న రాయుడు ఎలాగైన అవంతిక ప్రేమను గెలుచుకోవాలని వాళ్ల ఊరికి వెళతాడు. తన మంచితనంతో వాళ్ల కుటుంబానికి దగ్గరవుతాడు. ఈ సమయంలోనే ట్రైన్ లో జరిగిన ఎటాక్ తన మీద కాదు అవంతిక కుటుంబం మీద అని తెలుసుకుంటాడు. అసలు అవంతిక కుటుంబం మీద ఎటాక్ చేసింది ఎవరు..? వాళ్ల బారినుంచి అవంతిక కుటుంబాన్ని రాయుడు ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ.



నటీనటులు :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన అభిమానులకు విందుభోజనం లాంటి సినిమాను అందించాడు. హీరోయిజం, యాక్షన్, తో పాటు తన మార్క్ రొమాంటిక్ కామెడీని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా అంతా వన్మన్ షోలా అంతా తానే అయి నడిపించి సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాడు. కేవలం పవన్ ఇమేజ్, నటన మూలంగానే సినిమాతో చూస్తున్నప్పుడు ఇది తెలిసిన కథే అన్న ఆలోచనే రాలేదేమో అనిపిస్తుంది. హీరోయిన్ గా శృతిహాసన్ పరవాలేదనిపించింది. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాతో లుక్స్ పరంగా నిరాశపరిచింది.



విలన్ గా తరుణ్ అరోరా చిన్న పాత్రే అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. రావు రామేష్ చేసిన పాత్ర విలనిజంతో పాటు మంచి కామెడీనీ పండించింది. లుక్ తో పాటు డైలాగ్ డెలివరీలోనే కొత్త దనం చూపించిన రావూ రమేష్ మరోసారి తనమార్క్ చూపించాడు. లాయర్ పాత్రలో అలీ పండించిన కామెడీతో పాటు సెకండాఫ్ లో పృథ్వీ చేసిన సీన్స్ ఆకట్టుకుంటాయి. పవన్ తమ్ముళ్లుగా అజయ్, శివబాలాజీ, చైతన్య కృష్ణ, కమల్ కామరాజులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.



సాంకేతిక నిపుణులు :

తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న కథను మరోసారి పవన్ లాంటి స్టార్ తో రీమేక్ చేయటం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ సాహసం చేసిన దర్శకుడు కిశోర్ కుమార్ పార్థసాని(డాలీ) మంచి విజయం సాధించాడు. ముఖ్యంగా పవన్ ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు చేసిన మార్పులు సినిమాకు ప్లస్ అయ్యాయి. అనూప్ రూబెన్స్ తన సంగీతంతో పర్వాలేనిపించాడు. పవన్ ఇమేజ్ ను చాలా బాగా ఎలివేట్ చేసిన అనూప్, ఇతర సన్నివేశాల్లో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.మిరా మిరా మీసం, లాగే లాగే తప్ప మిగతా పాటలు పవన్ గత సినిమాలో స్థాయిలో లేవు. ముఖ్యంగా ఫారిన్ లోకేషన్స్ లో తీసిన రెండు పాటలు విజువల్ గా కూడా నిరాశపరిచాయి. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ యాక్షన్ సీన్స్ రామ్ లక్ష్మణ్ లు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.



ప్లస్ పాయింట్స్ :

పవన్ కళ్యాణ్

రొమాంటిక్ సీన్స్



మైనస్ పాయింట్స్ :

తెలిసిన కథ

ఫారిన్ లొకేషన్స్ లో తీసిన సాంగ్స్


కాటమరాయుడు.. పవర్ స్టార్ అభిమానులకు పండుగ లాంటి సినిమా



- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top