సినిమా రివ్యూ: కార్తికేయ

సినిమా రివ్యూ: కార్తికేయ


 సినిమా రివ్యూ

పాములు పగబడతాయా? పగబట్టి వెంటపడతాయా? దీనికి సైన్స్ ఏ రకమైన వివరణనిచ్చినప్పటికీ, కథల్లోనూ, సినిమాల్లోనూ పాము సెంటిమెంట్, పగ సెంటిమెంట్ బ్రహ్మాండమైన బాక్సాఫీస్ సూత్రం. పాము పగ అనేది మూఢనమ్మకమని కొట్టిపారేసే జనాన్ని కూడా కన్విన్స్ చేసేలా దానికి శాస్త్రీయ వివరణనిస్తే? అలా ఇటు నమ్మకాలనూ, శాస్త్రీయ వివరణనూ కలగలిపి వండుకున్న కథ - ‘కార్తికేయ’.



కథ ఏమిటంటే...

మెడికల్ స్టూడెంట్ కార్తికేయ (నిఖిల్ )కు మిస్టరీగా కనిపించే ఏ విషయాన్ని అయినా ఛేదించడం అలవాటు. మరోపక్క సుబ్రహ్మణ్యపురంలో వందల ఏళ్ళ నాటి గుడి ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాటి రాత్రి ఆ ఆలయంలో నుంచి వెలుగులు ప్రసరించడం ఓ అద్భుతం. పాము కాటుతో అందరూ చనిపోతూ, అనుమానాలు రావడంతో ఆ ఆలయం మూతపడుతుంది. మెడికల్ క్యాంప్ కోసం హీరో హీరోయిన్లు అదే ఊరుకు వెళతారు. అప్పుడేమైంది? ఆలయ రహస్యం ఏమిటన్నది మిగతా కథ.



ఎలా నటించారంటే...

ఇటీవలి కాలంలో సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ చిత్రాలకు తెలుగులో ఆదరణ బాగుంది. ఈ లెక్కలతోనే వచ్చిన తాజా చిత్రం ఇది. స్టూడెంట్‌గా, ప్రేమికుడిగా, నిగూఢ రహస్యాన్ని ఛేదించాలని తపించే యువకుడిగా ఎప్పటికప్పుడు ఆ మార్పుల్ని చూపడానికి నిఖిల్ శ్రమించారు. కాకపోతే, స్క్రిప్టు కాసేపు అటు, కాసేపు ఇటు నడవడంతో పాత్ర కూడా దేని మీదా నిలకడ లేకుండా పరుగులు పెట్టాల్సి వచ్చింది. మెడికల్ కాలేజీ విద్యార్థిని వల్లిగా హీరోను అనుసరించడానికీ, ప్రేమ ట్రాక్‌కే హీరోయిన్ స్వాతి పరిమితమైంది. మిస్టరీ ఛేదనలోనూ ఆమెకు భాగం కల్పిస్తే, ఆసక్తి ఇంకా పెరిగేది. ఇక, సినిమాలో వచ్చే మిగిలిన పాత్రలన్నీ ఆటలో అరటిపండు వ్యవహారమే. కాకపోతే, సుపరిచిత ముఖాలుండడం ఉపకరించింది.నైట్ ఎఫెక్ట్ దృశ్యాల లాంటి వాటిని చిత్రీకరించడంలో ఛాయాగ్రాహకుడి పనితనం కనిపించింది. బాణీలు, పాటలు గుర్తుపెట్టుకుందామన్నా గుర్తుండవు. ఇలాంటి మిస్టరీ సినిమాలకు కీలకమైన రీ-రికార్డింగ్ ఎఫెక్టివ్‌గా ఉండాల్సింది. చరిత్ర చెప్పడానికి వాడుకున్న బొమ్మలు, విజువల్ ఎఫెక్ట్‌లు బాగున్నాయి.



ఎలా ఉందంటే...

 పాత్రల పరిచయానికీ, కథలోకి ప్రధాన పాత్రను తీసుకురావడానికి ప్రథమార్ధం సరిపోయింది. అయినా తరువాతి కథేమిటన్న ఆసక్తి ప్రేక్షకులలో నిలపగలిగింది. ఇక, అసలు కథంతా ద్వితీయార్ధంలోనే! దాన్ని ఉత్కంఠగా చెబుతారనుకుంటే, అతిగా ఆశపడ్డామని కై్లమాక్స్‌కొచ్చాక ప్రేక్షకులకు అర్థమవుతుంది.



స్క్రిప్టును పకడ్బందీగా రాసుకొని ఉంటే బాగుండేది. ఏ సీన్‌లో ఎలా తాను కథను నడిపించాలనుకుంటే అలా పాత్రలు ప్రవర్తించేలా, సంఘటనలు జరిగేలా చేయడంతో తంటా వచ్చిపడింది. రాజా రవీంద్ర రాసిన పుస్తకం, చేసిన ఫోన్  గురించైనా ఆరా తీయకుండానే పోలీసాఫీసర్ కేస్ మూసేశారనడం కథలో కన్వీనియన్స్ కోసమే! ఇక, హీరో ఫ్యామిలీ సీన్లు కృతకంగా ఉన్నాయి. తనికెళ్ళ, తంజావూరు పీఠాధిపతి కథలో ముందే పెదవి విప్పరెందుకో తెలీదు. హీరోది లియో (సింహరాశి) అని మొదట్లో చెప్పించి, చివరకొచ్చేసరికి మేషరాశి అనిపిస్తారు.  క్లైమాక్స్ కొచ్చేసరికి కాస్తంత అసంతృప్తిగానే సినిమా ముగుస్తుంది. అయితే, లోటుపాట్లున్నా దర్శకుడి తొలి ప్రయత్నంగా భుజం తట్టవచ్చు. ఉత్కంఠభరిత చిత్రాల సీజన్‌లో వచ్చిన తాజా చేర్పుగా ఈ చిత్రాన్ని లెక్కించవచ్చు.



బలాలు:  ఎంచుకున్న మిస్టరీ కథాంశం   హిట్ జంటగా పేరు తెచ్చుకున్న నాయికా నాయకులు  కొన్ని చోట్ల బాగున్న కెమేరా పనితనం



బలహీనతలు:  పాత్రలు, సంఘటనల రూపకల్పన  సంతృప్తినివ్వని ద్వితీయార్ధం  బలహీనమైన స్క్రీన్‌ప్లే  నమ్మకానికీ, సైన్స్‌కూ మధ్య సంఘర్షణకు కుదరని లంకె



కెమేరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: శేఖర్ చంద్ర, కళ: సాహి సురేశ్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-కథనం- మాటలు-దర్శకత్వం: చందు మొండేటి



- రెంటాల జయదేవ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top