'చీకటిరాజ్యం' మూవీ రివ్యూ

'చీకటిరాజ్యం' మూవీ రివ్యూ


టైటిల్ : చీకటి రాజ్యం

జానర్ : యాక్షన్ థ్రిల్లర్

తారాగణం : కమల్ హాసన్, త్రిష, ప్రకాష్ రాజ్, ఆశా శరత్, సంపత్, కిశోర్

దర్శకత్వం : రాజేష్ ఎం సెల్వ

నిర్మాత : రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్ నేషనల్

సంగీతం : గిబ్రన్




చాలా కాలం తరువాత కమల్ హాసన్ చేసిన తెలుగు సినిమా చీకటిరాజ్యం. తుంగావనం పేరుతో తమిళ్లోనూ తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే కోలీవుడ్లో రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ ఫిలిం స్లీప్ లెస్ నైట్స్ సినిమాకు ఇండియన్ వర్షన్గా ఈ సినిమాను తెరకెక్కించారు. చాలా కాలంగా కమల్ హాసన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న రాజేష్ ఎం సెల్వా డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక్క రాత్రిలో జరిగే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్తో పాటు త్రిష, మధుశాలిని, ప్రకాష్ రాజ్, సంపత్, కిశోర్ లు నటించారు. తమిళ తంబిలను మెప్పించిన తుంగావనం, తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.



కథ :

నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చెందిన పోలీస్ ఆఫీసర్ సికె దివాకర్ (కమల్ హాసన్ ), మరో ఆఫీసర్ మణి(యోగి సేతు)తో కలిసి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకుంటారు. అయితే ఇంత భారీ మొత్తంలో మత్తు పదార్ధాలను పట్టుకున్న ఆనందం, ఆ ఆఫీసర్లకు ఎక్కువ సేపు ఉండదు. ఈ ఇద్దరు ఆఫీసర్లలో ఒకరైన దివాకర్ కొడుకును డ్రగ్ డీలర్ విఠల్ రావ్(ప్రకాష్ రాజ్) కిడ్నాప్ చేస్తాడు. అప్పటికే వేరేవాళ్లకి ఆ డ్రగ్స్ సరఫరా చేస్తానంటూ మాట ఇచ్చిన విఠల్ రావ్ ఆ మొత్తాన్ని పోలీసులు పట్టుకోవటంతో చేసేదేమి లేక దివాకర్ కొడుకు పట్టుకొని, డ్రగ్స్ వెనక్కి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తాడు. దివాకర్ డ్రగ్స్ వెనక్కి ఇచ్చి, తన కొడుకును కాపాడుకోవాలని భావించినా, అప్పటికే అతని మీద నార్కొటిక్స్ బ్యూరో చెందిన మరో ఇద్దరు ఆఫీసర్లు మల్లిక (త్రిష), కిశోర్ల నిఘా ఉంటుంది. ఇలా మంచి చెడు ఇద్దరితో ఒకేసారి యుద్దం చేయాల్సి వచ్చిన దివాకర్ తన కొడుకును ఎలా కాపాడుకున్నాడు అన్నదే చీకటిరాజ్యం కథ.



నటీనటులు

కమల్ గతంలో చేసిన ఆదినారాయణన్, రాఘవన్ తరహా పోలీస్ పాత్రల ఛాయలేవి లేకుండా చాలా కొత్తగా ఈ పాత్రను తీర్చి దిద్దారు. కమల్ తనదైన నటనతో దివాకర్ పాత్రకు జీవం పోశాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకును కాపాడుకునే క్రమంలో ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనవుతాడో కళ్లకు కట్టినట్టు చూపించాడు. తొలిసారిగా పోలీస్ పాత్రలో నటించిన త్రిష తన పరిధి మేరకు ఆకట్టుకుంది. నెగెటివ్ రోల్ లో ప్రకాష్ రాజ్ ఆకట్టుకోగా కిశోర్, సంపత్ లు సెటిల్డ్ పర్ఫామెన్స్ తో తన పాత్రలకు న్యాయం చేశారు.



విశ్లేషణ :

సినిమాలో ఎక్కువగా భాగం నైట్ క్లబ్ లోనే చిత్రీకరించారు. ముఖ్యంగా సినిమాలో పాటలు లేకపోవటం సినిమాకు ప్లస్ అయ్యింది. కథా కథనాల్లో స్పీడు బ్రేకర్లలా వచ్చే పాటల నుంచి సినిమాకు మినహాయింపు ఇచ్చి సినిమా వేగం పెంచాడు దర్శకుడు రాజేష్ ఎం సెల్వా. సినిమాలో పాటలు లేకపోయినా ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరింత ఆసక్తి కరంగా మార్చాడు సంగీత దర్శకుడు జిబ్రాన్. తొలి సినిమా అయిన దర్శకుడు రాజేష్ కథనం పై మంచి పట్టు చూపించాడు. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం ప్రతీ సీన్ లో పక్కాగా చూపించాడు. ఎక్కువభాగం నైట్ క్లబ్ లో షూటింగ్ చేసిన ఈ సినిమాకు కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారిని మాత్రం చీకటి రాజ్యం పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, హీరోయిన్ గ్లామర్ లాంటి ఎలిమెంట్స్ లేకపోవటంతో బి, సి సెంటర్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోవటం కష్టం. ఇక ఈ తరహా కథాంశం తెలుగు తెర మీద కొత్త కావటంతో స్ట్రయిట్ సినిమానే అయిన కమల్ గత సినిమాల మాదిరిగానే డబ్బింగ్ సినిమాలానే అనిపిస్తుంది.



ప్లస్ పాయింట్స్

కమల్ హాసన్

నేపథ్య సంగీతం

సినిమాటోగ్రఫి





మైనస్ పాయింట్స్

సెకండాఫ్ లో కొన్ని సీన్స్

రియలిస్టిక్ గా అనిపించని డ్రామా



ఓవరాల్ గా చీకటిరాజ్యం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మంచి ట్రీట్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top