పార్టీల కోసమో.. మతాల కోసమో..నేను సినిమాలు తీయడం లేదు!

పార్టీల కోసమో.. మతాల కోసమో..నేను సినిమాలు తీయడం లేదు! - Sakshi


 - కమల్ హాసన్

 ‘‘సినిమా ఎలా చేయాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఈ పరిస్థితిలో తీసిన సినిమాను ప్రతి ఒక్కరికీ చూపించాల్సి వస్తోంది. అది కూడా ఉచితంగా! ఆ సినిమా చూసి, వాళ్లు విడుదల చేసుకోమంటే చేసుకోవాలట! ఈ పరిస్థితి బాధాకరం’’ అని కమల్‌హాసన్ అన్నారు. రమేశ్ అరవింద్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఉత్తమ విలన్’. పూజా కుమార్, ఆండ్రియా నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి సి. కల్యాణ్ విడుదల చేస్తున్నారు. మే 1న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో కమల్‌హాసన్, సి. కల్యాణ్, రమేశ్ అరవింద్, నాజర్, పూజాకుమార్‌లు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

 

‘విడుదలకు ముందే మీ సినిమాలు వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి కదా!’ అనే ప్రశ్నకు కమల్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ - ‘‘భారతదేశంలో హిందువుల సంఖ్య ఎక్కువ. వాళ్లను వద్దనుకుని సినిమా తీయడం ఎలా? అలాగని ముస్లిమ్ ప్రేక్షకులను నేను వద్దనుకోవడం లేదు. వాళ్లూ ముఖ్యమే. ఈ రెండు వర్గాలతో పాటు అన్ని మతాల కుటుంబాలూ నాకు అవసరమే! నేను కాంగ్రెస్ కోసమో, బీజేపీ కోసమో... వేరే రాజకీయ పార్టీల కోసమో సినిమాలు తీయడం లేదు. ‘ప్రజల సినిమా’ తీస్తున్నా’’ అన్నారు. కళాకారులం తక్కువ సంఖ్యలో ఉన్నాం. అందుకే మమ్మల్ని మైనార్టీలుగా చూడమంటున్నానని కమల్ చెబుతూ -‘‘మేం గొప్ప అనడం లేదు.

 

 చాలా చాలా తక్కువ. అందుకే, దయచేసి మమ్మల్ని బాధపెట్టకండి. మాకు వచ్చిన కళను మీకు చూపించాలన్నదే మా తాపత్రయం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆ కళను ఆదరించండి. మమ్మల్ని ఆదరించండి. మమ్మల్ని అభిమానించడం ద్వారా మీకు మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు’’ అన్నారు. గెటప్స్ కోసం ఎప్పుడూ సినిమా చేయలేదని కమల్ చెబుతూ -‘‘కథ ఏ గెటప్ డిమాండ్ చేస్తే అదే చేస్తున్నాను. అప్పుడు ‘భారతీయుడు’, ‘భామనే సత్యభామనే’ - ఇలా ఏది చేసినా అందులో నేను వేసిన గెటప్స్ కథానుగుణంగానే ఉంటాయి. అవి బాగుండడంతో గుర్తుండిపోయాయి. ఇప్పుడు ‘ఉత్తమ విలన్’ ఓ సినిమా కళాకారుడి జీవితం నేపథ్యంలో సాగుతుంది.

 

  ఓ కళాకారుడిగా ఒక్క గెటప్‌లో కనిపించలేం కదా! ‘ఉత్తమ విలన్’ ఏంటి? అని చాలామంది అడుగుతున్నారు. నా దృష్టికోణంలో విలన్‌గా కనిపించేవాళ్లు.. మరొకరి దృష్టి కోణానికి హీరోలా కనిపిస్తారు. ఈ చిత్రంలో నా పాత్ర అలానే ఉంటుంది’’ అన్నారు. ఆండ్రియా, పూజా కుమార్‌లతో మళ్లీ సినిమా చేయడం గురించి అడగ్గా - ‘‘శ్రీదేవితో 27, శ్రీప్రియతో 27 సినిమాలు చేశాను. ఖుష్బూతో ఆరేడు సినిమాలు చేశాను. ఇప్పుడు ఆండ్రియా, పూజాకుమార్‌లతో మళ్లీ సినిమా చేయడానికి కారణం వాళ్ల ప్రతిభ. ఈ చిత్రంలోని పాత్రలకు వాళ్లే సరిపోతారు.

 

  అంతే తప్ప వేరే ఏమీ లేదు’’ అని నవ్వుతూ అన్నారు. అరవైఏళ్ల వయసులోనూ ఎనర్జిటిక్‌గా ఎలా ఉన్నారని కమల్‌ను అడిగితే - ‘‘వయసు శరీరానికే. మనసుకు కాదు. మన మనసుకు మనమే వయసు ఫిక్స్ చేసుకోవాలి’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ 54 సినిమాలు చేశాను. పలు విజయాలు చవి చూశాను. కానీ, ఈ చిత్రం నాకు ప్రత్యేకం’’ అని వ్యాఖ్యానించారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top