ఆ ఇద్దరి స్థానాల్లో ఈ ఇద్దరు!

ఆ ఇద్దరి స్థానాల్లో  ఈ ఇద్దరు! - Sakshi


దక్షిణాదిన అగ్రతారలు అనిపించుకున్న కాజల్ అగర్వాల్, తాప్సీ ఇప్పుడు ఉత్తరాదిన కూడా తమను నిరూపించుకునే పనిమీద ఉన్నారు. యాదృచ్ఛికంగా వీరిద్దరూ ఇటీవలే హిందీలో వేరే తారల అవకాశం కొట్టేశారు. ముందు కాజల్ చేజిక్కించుకున్న అవకాశం గురించి చెప్పాలంటే... దాదాపు పదేళ్ల క్రితం ‘క్యూం హో గయా నా’ చిత్రంలో ఐశ్వర్యా రాయ్‌కి చెల్లెలిగా నటించారామె.



ఆ తర్వాత తెలుగు పరిశ్రమకు రావడం, ఇక్కడ బిజీ కావడంతో హిందీ చిత్రాలపై దృష్టి సారించలేదు. మూడేళ్ల క్రితం చేసిన ‘సింగమ్’తో మళ్లీ హిందీ తెరపై మెరిసిన కాజల్ ఆ తర్వాత ‘స్పెషల్ 26’లో చేశారు. తాజాగా, ‘సీస్ ఫైర్’ అనే చిత్రంలో నటిస్తు న్నారు. బాలీవుడ్‌లో ఆమెను మరో భారీ అవకాశం వరించింది.

 

మూడుసార్లు జాతీయ అవార్డు సాధించిన సుధీర్ మిశ్రా దర్శకత్వంలో రూపొందనున్న ‘అవుర్ దేవదాస్’ చిత్రంలో కాజల్ అవకాశం కొట్టేశారట. ముందుగా ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్‌ని కథానాయికగా తీసుకున్నారట. అయితే, ఆ తర్వాత చిత్రాంగదకన్నా ఈ కథకు కాజల్ అయితే ఇంకా బాగుంటుందని దర్శకుడు భావించారని భోగట్టా. ఈ కథ బాగా నచ్చడంతో కాజల్ కూడా అంగీకరించారని, సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం.

 

ఇక, తాప్సీ విషయానికొస్తే... హిందీలో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ‘బేబీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా, తాప్సీ ఖాతాలో మరో సినిమా చేరిందని సమాచారం. అమిత్ రాయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించనున్నారు. ఇందులో తొలుత యామీ గౌతమ్‌ని నాయికగా తీసుకున్నారట. ఫొటోషూట్ కూడా చేశారని వినికిడి. కానీ, ఇప్పుడు తాప్సీని నాయికగా ఎంపిక చేశారట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top