'కబాలి' మూవీ రివ్యూ

'కబాలి' మూవీ రివ్యూ


టైటిల్ : కబాలి

జానర్ : ఎమోషనల్ డ్రామా

తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, విన్స్స్టన్ చావో

సంగీతం : సంతోష్ నారాయణ్

దర్శకత్వం : పా రంజిత్

నిర్మాత : కలైపులి ఎస్ థాను



భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కబాలి. రజనీ మానియా రేంజ్ ఏంటో చూపిస్తూ ఈ సినిమా ప్రపంచదేశాల సినీ అభిమానులను సైతం ఆకర్షించింది. రెండు భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా నటించిన సినిమా.. కేవలం రెండు యావరేజ్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాకు ఇంత హైప్ ఎలా క్రియేట్ అయ్యిందంటూ ట్రేడ్ పండితులు కూడా అవాక్కవుతున్నారు. అసలు అంతలా కబాలిలో ఏముంది..? నిజంగానే రజనీ కబాలితో మ్యాజిక్ చేశాడా..? అభిమానుల అంచనాలను కబాలి అందుకుందా..?



కథ :

మలేషియా, కౌలాలంపూర్లో జరిగిన గ్యాంగ్ వార్లో అరెస్ట్ అయిన మాఫియా డాన్ కబాలి(రజనీ కాంత్). 25 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన కబాలి విడుదలవుతున్నాడంటూ, ప్రభుత్వం, పోలీస్ శాఖలు అలర్ట్ అవుతాయి. తిరిగి గ్యాంగ్ వార్ మొదలుపెట్టవద్దని కబాలికి చెప్పి విడుదల చేస్తారు. కానీ మలేషియాలో మగ్గిపోతున్న భారతీయుల కోసం పోరాటం చేసే కబాలి బయటకు రాగనే అక్కడి పరిస్థితులను చూసి మరోసారి పోరాటం మొదలు పెడతాడు. డ్రగ్స్ అమ్ముతూ, అమ్మాయిలను ఇబ్బంది పెట్టే 43 గ్యాంగ్తో యుద్ధం ప్రకటిస్తాడు.



కబాలి రాకకోసం ఎదురుచూస్తున్న 43 గ్యాంగ్ లీడర్ టోని లీ (మలేషియా నటుడు విన్స్స్టన్ చావో) తన అనుచరుడు వీరశంకర్ (కిశోర్) సాయంతో కబాలిని చంపేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ ప్రయత్నాల నుంచి కబాలి ఎలా బయటపడ్డాడు..? అసలు కబాలి డాన్గా ఎందుకు మారాడు..? అతని కుటుంబం ఏమైంది..? చివరకు టోని లీ కథను కబాలి ఎలా ముగించాడు..? అన్నదే మిగతా కథ.



నటీనటులు :

కబాలిగా రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ వయసులో కూడా తనలోని స్టైల్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేశాడు తలైవా. భారీ యాక్షన్ సీన్స్, రేసీ స్క్రీన్ ప్లే లేకపోయినా కేవలం రజనీ మానరిజమ్స్తో ఆడియన్స్ను కట్టిపడేశాడు. ఫైట్స్, హీరోయిజంతో పాటు అద్భుతమైన ఎమోషన్స్తో ఆకట్టుకున్నాడు. తెర మీద కనిపించేది కొద్ది సేపే అయినా రాధిక ఆప్టే మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా కబాలిని తిరిగి కలుసుకునే సన్నివేశంలో ఆమె నటన ప్రేక్షకులతో కంటతడిపెట్టిస్తుంది.



లేడీ డాన్గా కనిపించిన ధన్సిక నటనతో పాటు యాక్షన్ సీన్స్లోనూ ఆకట్టుకుంది. స్టైలిష్గా కనిపిస్తూనే.. మంచి ఎమోషన్స్ను పండించింది. విలన్గా నటించిన విన్స్స్టన్ చావో డాన్ లుక్లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. రాక్షసుడైన గ్యాంగ్ స్టర్గా చావో నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రజనీ స్టార్ డమ్ ను ఢీకొనే పర్ఫెక్ట్ విలన్గా కనిపించాడు. ఇతర పాత్రలలో కిశోర్, జాన్ విజయ్, నాజర్, దినేష్ రవి లాంటి నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.



సాంకేతిక నిపుణులు :

కబాలి లాంటి కథతో రజనీని ఒప్పించిన దర్శకుడు అప్పుడే సగం విజయం సాధించేశాడు. ఈ కథకు రజనీ అంతటి భారీ స్టార్ డమ్ ఉన్న నటుడు తప్ప మరే హీరో చేసినా.. వర్క్ అవుట్ కాదు. అయితే పూర్తి యాక్షన్ డ్రామాగా సినిమాను ప్రమోట్ చేసిన దర్శకుడు.. సినిమాలో ఆ వేగం చూపించలేకపోయాడు. స్లో నారేషన్ ఇబ్బంది పెట్టినా.. రజనీని కొత్తగా చూపిస్తూ అన్నింటిని కవర్ చేశాడు. ఇక సినిమాకు మరో ఎసెట్ సంతోష్ నారాయణ్ సంగీతం. కబాలి థీం మ్యూజిక్తో కట్టిపడేసిన సంతోష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో సినిమాను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫి లాంటివి ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.



ప్లస్ పాయింట్స్ :

రజనీకాంత్

మెయిన్ స్టోరి లైన్

నేపథ్య సంగీతం



మైనస్ పాయింట్స్ :

స్లో నారేషన్



ఓవరాల్గా కబాలి భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను కాస్త నిరాశపరిచినా.. రజనీ అభిమానులకు మాత్రం బాషాను గుర్తు చేస్తోంది.



- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top