'మురారీ వ్యాఖ్యలు విని షాక్ అయ్యా'

'మురారీ వ్యాఖ్యలు విని షాక్ అయ్యా' - Sakshi


చెన్నై: దర్శకుడు కె.రాఘవేంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిర్మాత కె.మురారీ క్షమాపణ చెప్పాలని సీనియర్ నిర్మాత, జి.ఆర్.పి ఆర్ట్స్ అధినేత ఆర్.వి. గురుపాదం డిమాండ్ చేశారు. ఇటీవల గీత విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టర్ బిరుదును అందుకున్న ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆ బిరుదుకు అర్హుడు కాదంటూ నిర్మాత మురారీ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన ఆర్.వి.గురుపాదం మురారీ చర్యల్ని తీవ్రంగా ఖండించారు.



ఆయన  చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మురారీ వ్యాఖ్యలు విని షాక్ అయ్యానన్నారు. తెలుగు సినిమా గర్వించ దగ్గ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి బాబా వంటి గొప్ప భక్తిరస కథా చిత్రాలను తెరపై ఆవిష్కరించిన ఖ్యాతి రాఘవేంద్రరావుదన్నారు. ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, వి.బి.రాజేంద్ర ప్రసాద్, కె.ఎస్.ఆర్ దాసు దాసరి నారాయణ రావు లాంటి తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రను తిరిగి రాసిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరన్నారు. కమర్షియల్ దర్శకుడిగా తనదైన ముద్రవేసుకున్న రాఘవేంద్రరావుది నేటి స్టార్ హీరోలు వెంకటేష్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటివారిని తెరకు పరిచయం చేసిన ఘనత అన్నారు.



ఎన్టీ రామారావు, అక్కనేని నాగేశ్వరరావు, చంద్రబాబులాంటి వారికి అత్యంత సన్నిహితులైన రాఘవేంద్రరావును చాలా కొన్ని చిత్రాలు నిర్మించిన మురారీ విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తిని బహిరంగంగా విమర్శించడం హర్షనీయం కాదన్నారు. ఈ వ్యవహారంలోకి మురారీ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో వ్యవహారం చాలా వరకు వెళుతుందని హెచ్చరించారు. కె.మురారీ అంశాన్ని హైదరాబాద్‌లోని చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని శాఖల ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆర్.వి.గురుపాదం వెల్లడించారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top