'జయ జానకి నాయక' మూవీ రివ్యూ




టైటిల్ : జయ జానకి నాయక

జానర్ : ఫ్యామిలీ యాక్షన్ డ్రామా

తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శరత్ కుమార్..

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

దర్శకత్వం : బోయపాటి శ్రీను

నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి



అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తరువాత వచ్చిన స్పీడున్నోడు సినిమాతో నిరాశపరిచాడు. స్టార్ ఇమేజ్ అందుకోవాలంటే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా సాయి శ్రీనివాస్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిందా..? బోయపాటి స్టార్ హీరోస్ తోనే కాకుండా యంగ్ హీరోస్ తో కూడా మ్యాజిక్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడా..?



కథ :

చక్రవరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత చక్రవర్తి (శరత్ కుమార్). తన భార్య చనిపోయిన దగ్గర నుంచి తల్లి తండ్రి తానే అయ్యి కొడుకుల బాగోగులను చూసుకుంటుంటాడు. కొడుకులతో కలిసి తాను మందు కొడుతూ గొడవలకు వెళుతుంటాడు. చక్రవర్తి చిన్న కొడుకు గగన్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). నా అనుకున్న వాళ్లకోసం ఎంతకైనా తెగించే మనస్థత్వం ఉన్న కుర్రాడు. అందుకే గగన్ మంచితనం నచ్చి, క్లాస్‌మేట్‌ స్వీటీ(రకుల్ ప్రీత్ సింగ్) అతన్ని ప్రేమిస్తుంది. గగన్ కూడా స్వీటీ ప్రేమలో పడతాడు.



అదే సమయంలో పరువు కోసం కన్న కూతుర్ని కూడా చంపుకునే అశ్వింత్ నారాయణ వర్మ( జగపతి బాబు)కు, మర్డర్లు చేసి లిక్కర్ కింగ్ గా ఎదిగిన అర్జున్ పవార్ కు ఓ ప్రాజెక్ట్ విషయంలో యుద్ధం మొదలవుతుంది. వీరి గొడవకు గగన్, స్వీటీల ప్రేమకు సంబంధం ఏంటి..? అశ్వింత్ నారాయణ, అర్జున్ పవార్ లలో ఎవరు గెలిచారు..? గగన్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నదే మిగతా కథ.



నటీనటులు :

తొలి సినిమాతోనే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయ జానకి నాయక సినిమాలో మరింత పరిణితి కనబరిచాడు. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లుక్స్ పరంగా గగన్ పాత్రలో ఒదిగిపోయేందుకు తనవంతుగా చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ మరోసారి ఆకట్టుకుంది. ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో మాత్రమే కనిపించే రకుల్ ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ గా కనిపించింది.



ఫస్ట్ హాఫ్ లో తన స్టైల్ గ్లామర్ తో ఆకట్టుకోగా, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో కంటతడి పెట్టించింది.  ప్రగ్యా జైస్వాల్ పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది. లెజెండ్ తరువాత మరోసారి జగపతి బాబు స్టైలిష్ విలన్ గా కనిపించాడు. అర్జున్ పవార్ పాత్రకు ఖైదీ నంబర్ 150 ఫేం తరుణ్ అరోరా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. తమిళ నటుడు శరత్ కుమార్ తండ్రి పాత్రలో తన మార్క్ చూపించాడు. యాక్షన్, ఎమోషన్స్ తో అలరించాడు. సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తుపెట్టుకునే స్థాయి పాత్ర దక్కలేదు. ఇతర పాత్రల్లో నందు, చలపతిరావు, సితార తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.



సాంకేతిక నిపుణులు :

స్టార్ హీరోలతో తిరిగులేని బ్లాక్ బస్టర్ లను అందించిన బోయపాటి శ్రీను ఓ యంగ్ హీరోతో చేసిన సినిమా జయ జానకి నాయక. తన మార్క్ మాస్ యాక్షన్ ఏమాత్రం తగ్గకుండానే సాయి శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్కు తగ్గ కథతో అలరించాడు బోయపాటి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కంటతడి పెట్టించి తనలోని కొత్త యాంగిల్ ను చూపించాడు. వందల కొద్ది విలన్లతో జరిగే పోరాట సన్నివేశాలు కాస్త అతిగా అనిపించినా.. మాస్ ఆడియన్స్ ను అలరిస్తాయి. ఈ సినిమా విజయంలో యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. దేవీ శ్రీ మ్యాజిక్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. సినిమా రిజల్ట్ కు ముందే పాటలతో విజయం సాధించిన దేవీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయి పెంచాడు. నిర్మాత సినిమా కోసం చేసిన ఖర్చు ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది.



ప్లస్ పాయింట్స్ :

బోయపాటి శ్రీను దర్శకత్వం

లీడ్ యాక్టర్స్ నటన

యాక్షన్ సీన్స్



మైనస్ పాయింట్స్ :

కామెడీ లేకపోవటం



జయ జానకి నాయక.. బోయపాటి ఖాతాలో మరో మంచి హిట్.



- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top