ఓ కారణజన్ముడి జీవితకథ

ఓ కారణజన్ముడి జీవితకథ


అందుకే... అంత బావుంది!

నటీనటులు: ఎఫ్. ముర్రే అబ్రహం, టామ్ హల్క్, ఎలిజబెత్ బెరిడ్జె, సైమన్ కలౌ తదితరులు.

కెమెరా: మిరోస్లవ్ ఆండ్రిక్, దర్శకుడు: మిలాస్ ఫోర్‌మేన్, నిర్మాత: సౌల్ జీంట్జ్, విడుదల: 1984 సెప్టెంబర్ 19 సినిమా

నిడివి: 161 నిమిషాలు, నిర్మాణ వ్యయం: 18 మిలియన్ డాలర్లు (దాదాపు  113 కోట్ల రూపాయలు),

వసూళ్లు: 51.97 మిలియన్ డాలర్లు (దాదాపు 327 కోట్ల రూపాయలు)

 

ఇళయరాజాగారు తన జీవితంలో చాలా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఈ ‘ఎమేడియెస్’. ‘‘నువ్వూ చూడు’’ అన్నారు నాతో. నా అభిమాన దర్శకుడు మిలాస్ ఫోర్‌మెన్ తీసిన అద్భుతమైన సృష్టి ఇది. ఆరు సార్లు చూశాను. చూసిన ప్రతిసారీ వందల ఏళ్లనాటి వాతావరణంలోకి నన్ను తీసుకెళ్లిపోయారు. ఆనాటి వేష భాషలూ, కట్టుబాట్లూ - అన్నీ నా కళ్ల ముందు బొమ్మకట్టాయి. ఆ తర్వాత మొజార్ట్‌కి అభిమానినైపోయి అతని సింఫనీలు చాలా విన్నాను.

 

ఇళయరాజాకి ఈ సినిమా అంతగా నచ్చడానికి కారణం... ఇదొక మ్యూజికల్, మనసును మా గొప్పగా పట్టేసుకున్న మొజార్ట్ కేరెక్టర్. పదిహేడు వందల ఏభై ఆరులో ఆస్ట్రియాలో సాల్జ్‌బర్గ్ అనే టౌన్లో పుట్టి పదిహేడువందల తొంబై ఒకటిలో ఆ దేశానికి కేపిటల్ అయిన వియన్నాలో కేవలం ముప్ఫై రెండేళ్లు మాత్రమే బతికి, చనిపోయిన గ్రేట్ కంపోజర్ మొజార్ట్ ఆత్మకథ ఈ ‘ఎమేడియెస్’ సినిమా. ఆ కాలంలో బెతోవెన్, బాక్, మొజార్ట్ ఉన్నట్టే మన సౌత్‌లో ముగ్గురు వాగ్గేయకారులుండేవారు. త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్.

 

ఇక మొజార్ట్ ఆత్మకథ సినిమాగా తీయబడిన ‘ఎమేడియెస్’ సినిమా విషయానికొస్తే... పీటర్ షాఫర్ రాసిన స్టేజ్‌ప్లేను స్క్రీన్‌కి అనువదిస్తే, అమెరికాలో సెటిలయిన జెకోస్లోవేకియా వాడయిన ప్రొఫెసర్ మిలాస్ ఫోర్‌మేన్ డెరైక్ట్ చేశారు. మొజార్ట్ వేషాన్ని టామ్‌హల్క్ అద్భుతంగా చేస్తే, అంతకంటే అద్భుతంగా శైలోరి కేరెక్టర్ని ముర్రే అబ్రహమ్ చేశాడు. చాలా ప్రతిభగలవాడయిన మొజార్ట్‌ను చాలా జెలసీతో చూస్తూ ఇంకో పక్క నుంచి ఆరాధించే సాటి మ్యూజీషియన్ కేరెక్టర్ అతన్ది. సినిమా టైటిల్స్‌లో మొదట ముర్రే అబ్రహమ్ పేరే వేశారు. అలా వేయడం చాలా సబబు. ఈ సినిమాకి మ్యూజిక్ కొత్తగా కంపోజ్ చెయ్యలేదు. ఆనాడు మొజార్ట్ రాసిన సింఫనీలు, సొనాటోలూ, శాంటాటాలు, ఒపేరాలు పేర్లల్ చేశారు. మ్యూజిక్ డెరైక్టర్ లేని ఈ సినిమాకి ద గ్రేట్ సర్ నేవిల్లే మారినర్ కండక్టర్‌గా వ్యవహరిస్తూ సూపర్‌వైజ్ చేశారు.

 

ఇక కథ విషయానికొస్తే... క్రిస్టొఫ్ ఓల్ఫ్‌గేంగ్ ఎమేడియస్ మొజార్ట్ అతని అసలు పేరయితే... ఉల్ఫీ అనేది ముద్దు పేరు. మూడో ఏట నుంచే సంగీత సాధన చేస్తుంటాడు మొజార్ట్. కళ్లకు గంతలు కట్టి వదిలేస్తే పియానో, వయోలా అత్యంత అద్భుతంగా వాయిస్తుంటాడు. అలా పెరిగి పెద్దవాడయిన మొజార్ట్ ఎనిమిదో ఏట కంపోజ్ చేసిన మొదటి సింఫనీ - ఇ ఫ్లాట్ మేజర్ కె. 16.... ఆఖరి సింఫనీ - సి. మేజర్ కె 551. చాలా పొడుగైన ఆ సింఫనీకి ‘జూపిటర్ సింఫనీ’ అని పేరు పెట్టాడు. శైలోరి అనే అతను రాత్రీ, పగలూ సాధన చేస్తుంటాడు. మామూలు సాధన కాదు రాక్షస సాధన కానీ, సింఫనీలో నాలుగు బార్ల లెంగ్త్ ఉన్న చిన్న ఫ్రేజ్ కూడా పక్కాగా వాయించలేడు. ప్లేయింగ్‌లో ఒక ఫ్లో రాదు.

 

రాత్రీ పగలనక పిచ్చి పిచ్చిగా ఆకతాయిగా తిరుగుతాడు మొజార్ట్. తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు. అలా కలతిరిగి, తిరిగి సడన్‌గా పియానో ముందు కూర్చుని పరమాద్భుతంగా వాయిస్తాడు. ఒకోసారి చేతులు వెనక పెట్టి, కళ్లు మూసుకుని కాళ్లతో వాయిస్తుంటే మహరాజే మతిపోయి చూశాడదంతా. అదంతా చూసిన శైలోరికి బుర్ర పనిచేయడం మానేస్తుంది. జీసస్ ముందుకెళ్లి ‘‘ఇంత సాధన చేసిన నాకు అబ్బని విద్య ఏ కృషీ చెయ్యనివాడికెలా అబ్బుతుంది? అసలు వాడికెలా ఇస్తున్నావ్ అంత టేలెంట్‌ని?’’ అని క్రాస్‌ని ఫైర్ ప్లేస్‌లో పారేస్తాడు.

 

మొజార్ట్ ఎంత ప్రతిభ గలవాడయినా అతను చేసే పిల్ల చేష్టలకీ, పిచ్చి చేష్టలకీ రాజుగారి ఆస్థానంలో ఎవరూ గొప్పోళ్లా చూసేవారు కాదు. కొందరైతే పట్టించుకునేవారు కాదు. చాలా విచ్చలవిడిగా తిరుగుతూ, తాగుతుండడం వల్ల విపరీతమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయిన మొజార్ట్ ఆ బాధల్ని మర్చిపోవడానికి మరింతగా తాగడం మొదలెట్టాడు. మొజార్ట్ ఆర్థిక బాధల్ని చూస్తున్న శైలోరి ఆ మొజార్ట్‌కి ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసి అతని ప్రతిభను దోచుకోవాలనుకుంటూ ఇంకో పక్క తనకు అన్యాయం చేసిన దేవుడి మీద కక్ష సాధించాలనుకుంటాడు. మారువేషం వేసుకుని మొజార్ట్ దగ్గరకొచ్చిన శైలోరి ‘‘నీ ఆర్థిక ఇబ్బందులు తీరుస్తాను. దానికి ప్రతిఫలంగా నా పేరు మీద ఒక సింఫనీ రాసిపెట్టాలి’’ అన్నాడు.

 

దానికి సరే అన్నాడు మొజార్ట్. రాత్రీ పగలూ తాగుతా... ఒక అద్భుతమైన సింఫనీ రాసి శైలోరీకిచ్చాడు మొజార్ట్.ఇంకిక్కడ నుంచి మొజార్ట్‌లోని ప్రతిభను వాడుకుంటా, రాజుగారి కొలువులో గొప్ప సంగీతకారుడిగా వెలిగిపోతున్నాడు శైలోరి. అలా వెలిగిపోవడం వెనకాల మొజార్ట్ ఉన్నాడని అక్కడి వాళ్లెవరికీ తెలీదు.మొజార్ట్‌లో ప్రతిభను వాడుకుని ఎదిగిపోతున్న శైలోరి ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా మొజార్ట్‌ను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెడుతా, మానసికంగా చాలా దిగజార్చే ప్రయత్నం చేస్తుంటాడు. మొజార్ట్‌కీ, అతని భార్యకీ మాటామాటా పెరగడంతో కొడుకును తీసుకుని పుట్టింటికెళ్లి పోయింది.

 

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మొజార్ట్ శారీరకంగా, మానసికంగా చాలా క్షీణించిపోతున్నాడు. ఒకసారి ఒక స్టేజిషో క్లైమాక్స్‌లో పడిపోయిన మొజార్ట్‌ని ఇంటికి మోసుకెళ్లాడు శైలోరి.నీరసంగా మంచం మీద పడిపోయున్నాడు మొజార్ట్.

 అది చూసిన శైలోరి మనసు ఆనందంతో గంతులేస్తుంది. నెమ్మదిగా మొజార్ట్ దగ్గర కొచ్చిన శైలోరి, ‘‘చూడు మొజార్ట్! ఇప్పుడు నువ్వు హెల్త్ బాగోక చాలా చాలా బాధపడుతున్నావు. నువ్వు ఈ మంచం మీద విశ్రాంతి తీసుకుంటా కూడా ఒక సింఫనీ రాయొచ్చు... అలా రాయొద్దు. నువ్వు డిక్టేట్ చేస్తుంటే నేను రాసుకుంటాను’’ అని మొజార్ట్‌ను ఒప్పించేడు. ఓ పక్క నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మొజార్ట్ అద్భుతంగా కంపోజ్ చేసి చెప్తుంటే రాసుకుంటున్నాడు శైలోరి.

 

తెల్లవారుజామున బిడ్డతో పాటు ఇంటికొచ్చిన మొజార్ట్ భార్య దూరంగా చిన్న మంచం మీద శైలోరి పడుకుని ఉండడం చూసి విస్త్తుపోతుంది. తన భర్త టాలెంట్ వీడు దోచుకుంటున్నాడని అర్థం చేసుకున్న ఆమె... చిందరవందరగా పడి ఉన్న కాయితాలు పోగేసి, బీరువా లోపల దాచేసి తాళం వేసి, భర్త వైపు తిరిగేసరికి చనిపోయి ఉన్నాడా మొజార్ట్.అలా వియన్నా నగరంలో వర్షం కురుస్తున్న ఆ ఉదయం పూట కాఫిన్ బాక్స్‌లో పెట్టిన మొజార్ట్ శవాన్ని ఒక అనాథ శవంలా శ్మశానానికి తీసుకెళ్లి, తీసిన గోతిలో ఆల్రెడీ పారేసి ఉన్న శవాల మధ్య ఈ శవాన్ని కూడా వేసి చేటడు ఉప్పేశాడు కాటికాపరి.

 

కొన్నేళ్ల క్రితం మొన్న కాలం చేసిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రిగాడు, నేను ఆస్ట్రియా వెళ్లినప్పుడు మొజార్ట్ పుట్టిన సాల్జ్‌గర్గ్ వెళ్లాం. ఇరుకైన సందుల్లో ఉన్న ఒక బిల్డింగ్‌లో అతి చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒక గదిలో చిన్న ఉయ్యాల, అందులో చంటిబిడ్డ బొమ్మ, గమ్మత్తుగా లైటింగ్ చేశారు. వందల ఏళ్ల క్రితం ఆనాడు అక్కడ పుట్టాడట మొజార్ట్. వేలాది సందర్శకుల మధ్యనున్న మేం చాలా థ్రిల్ ఫీలయ్యాం. ఒక చోట ఆనాటి మొజార్ట్ సింఫనీలని సి.డి.లు చేసి అమ్ముతున్నారు. కొని డిస్క్‌మేన్లో వింటా... ఆ కాలానికెళ్లిపోయాం. ఆ సంగీతం ఇప్పటికీ ఎప్పటికీ కొత్త కొత్త అనుభూతుల్నిస్తూ కొత్తగానే రాజిల్లుతుంది, విరాజిల్లుతుంది.

 

ఇంకక్కడినించి ఎక్కడికెళ్లినా మొజార్ట్ పేరే. కేవలం మొజార్ట్ పేరు మీద బతుకుతుందా నగరం... ఎక్కడ చూసినా మొజార్ట్ పేరే.

 హోటళ్లు, వైన్ షాపులూ, గన్నులూ, పెన్నులూ, దువ్వెనలూ, గుండుసూదులూ - ఇలా ఒకటేమిటీ... అన్నీ ఆ గ్రేట్ మొజార్ట్ పేరు మీదే!ఆ వైభవం చూస్తా... అందరూ అనుకున్నట్టే మేమూ అనుకున్నాం. ‘‘మనం మామూలు మనుషులం. ఈ మొజార్ట్ ఆ దేవుడు ప్రత్యేకంగా సృష్టించిన మనిషి... మహామనిషి’’. అలాంటి కారణజన్ముడి జీవిత కథను ఆండ్రిక్ ఫొటోగ్రఫీతో, సెర్నీ ఆర్ట్ డెరైక్షన్‌లో, పిస్టెక్ కాస్ట్యూమ్స్‌లో, ఫోర్‌మెన్ డెరైక్షన్‌లో ఒక అద్భుత కావ్యంగా సృష్టించారు.

 

పేరొందిన నవ్య చిత్ర దర్శకుడు

చెకొస్లోవేకియాకు చెందిన 82 ఏళ్ళ మిలాస్ ఫోర్‌మేన్ దర్శకుడే కాక రచయిత, స్వయంగా నటుడు కూడా! నవ్యచిత్రాల రూపకర్తగా, ‘చెకోస్లోవేక్ న్యూ వేవ్’ దర్శకుల్లో అతి ముఖ్యుడిగా చరిత్ర కెక్కారు. ఆయన రూపొందించిన ‘ది ఫైర్‌మ్యాన్స్ బాల్’ (1967) చిత్రం ఆయన స్వదేశంలో అనేక సంవత్సరాలు నిషేధానికి గురైంది. మోజార్ట్ మీద తీసిన ఈ ‘ఎమేడియస్’తో పాటు, ‘వన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ నెస్ట్’ చిత్రానికి కూడా ఆయన ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డులందుకున్నారు. అనేక అంతర్జాతీయ అవార్డులందుకొన్న ఫోర్‌మేన్ కవి కూడా! కవితలు రాయడంతో పాటు ‘మై టు వరల్డ్స్’ పేరిట ఆత్మకథ కూడా రాశారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా వ్యవహరిస్తున్నారు.



- వంశీ

ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top