నెట్ బాండ్ బడ!

నెట్ బాండ్ బడ!


సమస్త సమస్యలకీ, సమాచారానికీ ఇప్పుడు ఇన్‌స్టంట్ గైడ్ - గూగుల్, వికీపీడియాలే. నెట్ ఇలా మన నట్టింటిలోకి వచ్చాక, వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌ల లాంటి సోషల్ మీడియా కూడా పెరిగిపోయాక, నెట్‌లో రకరకాల వింత చర్చలు, విచిత్రమైన ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ‘500 కోట్లు కాదు... వెయ్యి కోట్లిచ్చినా సరే, నేనిక బాండ్ పాత్రలు చేసేది లేదు’ అంటూ హాలీవుడ్ స్టార్, ఇటీవలి పాపులర్ సినీ జేమ్స్‌బాండ్ డేనియల్ క్రేగ్ తేల్చేసిన విషయం బయటకొచ్చాక నెట్ వరల్డ్‌లో దీనిపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. జేమ్స్‌బాండ్ వారసుడెవరా అని ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ వెతుకుతున్నాయి ఇంటర్నెట్ సెర్చింజన్లు. కొందైరె తే ‘జేమ్స్‌బాండ్ పాత్రకు అంతంత డబ్బెందుకు... బ్యాండు కాకపోతే ! అందులో సగం కాదు... పావు వంతు ఇచ్చినా అంతకన్నా మంచివాళ్లే దొరుకుతారు’ అంటున్నారు. అందుకు ఉదాహరణగా మైఖేల్ ‘ఫాస్‌బాండర్’ను చూపుతున్నారు.


 

మరోపక్క, తాజాగా తీసే 25వ జేమ్స్‌బాండ్ చిత్రంలో బాండ్ పాత్రకు టామ్ హిడెల్‌స్టన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చేశాయి. అయినా సరే, నెట్‌లో మాత్రం కొత్త బాండ్ పాత్ర, క్రెగ్ నిరాకరణ సహా అనేక విషయాల గురించి రకరకాల బొమ్మలు, వార్తలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఆ మాటకొస్తే జేమ్స్‌బాండ్ పాత్ర చేయడానికి బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్‌కి ఏమి తక్కువ అంటూ కొందరు బయల్దేరారు. ఏకంగా డేవిడ్ కామెరాన్ ముఖాన్ని ఫొటోషాపులో జేమ్స్‌బాండ్ బొమ్మకు అతికించి మరీ, బాండ్‌గా చిత్రీకరిస్తున్నారు ఇంకొందరు వీరాభిమానులు.




ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. ‘జేమ్స్ బాండ్ అంటే ఎప్పుడూ మగవాళ్లేనా? లేడీ బాండ్‌లు ఎందుకు ఉండకూడదు? వాళ్లయితే బాగా ఒళ్ళు వంచగలరు. పైగా వెరైటీగా కూడా ఉంటుంది’ అని  కొందరు అంటున్నారు. అలా ఇప్పుడు కొత్త జేమ్స్‌బాండ్ పాత్రధారి ఎవరనే విషయంలో లింగ విచక్షణ అనే కొత్త కోణం వచ్చి చేరింది. ‘ఉబుసుపోక కబుర్లు... ఉచిత సలహాలకేం గానీ, ఎమిలీ బ్లంట్ ఐతే ఎలా ఉంటుందీ’ అని ఒకరు, ‘యాబ్సల్యూట్లీ ఫ్యాబ్యులస్’ అనే ప్రఖ్యాత టీవీ షో చేసిన ‘ప్యాట్సీ స్టోన్ అయితే అద్దిరిపోతుంది’ అని మరొకరు- ఇలా రకరకాల మాటలు, బొమ్మలు అంతర్జాలంలో ఇప్పుడు షికారు చేస్తున్నాయి.


 

అయితే వీటన్నిటి కన్నా అధికంగా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న గమ్మత్తై నెట్ క్రియేషన్ ఒకటి ఉంది. అది ఏమిటంటే... నటి గిలియన్ ఆండర్సన్‌ను ప్రసిద్ధ జేమ్స్‌బాండ్ సినిమా ‘స్కైఫాల్’ పోస్టర్‌లో బాండ్ పాత్రలో సూపర్ ఇంపోజ్ చేస్తూ పెట్టిన ఫొటో. తమాషాగా చేసిన ఈ అభూత నెట్ కల్పన వీక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. ‘అవును! ఈమె బాండ్... ‘జేన్’ బాండ్!’ అంటూ దాని కింద రాసిన ఫొటో క్యాప్షన్ అయితే మరీనూ! ‘జేన్’ అంటే ఏమిటని ఖంగారు పడకండి! పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న పెద్దోళ్ళు ‘స్త్రీ మూర్తి’ని ‘జేన్’ అంటారు లెండి! ఇక్కడ ‘జేన్’ బాండ్ అంటే... ‘లేడీ బాండ్’ అని ప్రతిపదార్థమూ, తాత్పర్యమున్నూ అని ఇంగ్లిపీసు బాగా తెలిసినవాళ్ళ ఉవాచ.


 

ఈ భాషాతత్త్వ విచార చర్చ మాటెలా ఉన్నా, ఈ కొత్త నెట్ కల్పన, ఆ ఫొటో, క్యాప్షన్ - హంగామా అంతా సదరు గిలియాన్ ఆండర్సన్ దృష్టికి వెళ్లింది. అంతే! ‘‘లేడీ బాండ్‌గా నేనైతే బాగుంటానని అనడం సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ ఎవరు రూపొందించారో తెలియదు కానీ, దీని రూపకర్తలకు నా కృతజ్ఞతాభివందనాలు’’ అంటూ గిలియన్ ఆండర్సన్ సంతోషంతో ట్వీట్ చేసింది. ఇది ఇలా ఉంటే, ‘జీవితంలో మీ గురించి చలామణీ అయిన పుకార్లలో మిమ్మల్ని అమితంగా ఆకట్టుకున్నది ఏమిటి?’ అని ఎవరో ఆమెను కొంటెగా క్వశ్చన్ చేశారు. ‘‘నన్ను జేమ్స్‌బాండ్‌ను చేస్తూ జరుగుతున్న ఈ ప్రచారం కన్నా సంచలనమైనది ఇంకేమైనా ఉంటుందా?’’ అంటూ అంతకన్నా కొంటెగా జవాబిచ్చారు గిలియన్.


 

మొత్తానికి, ఈ కొత్త చర్చకు చాలా మందే మద్దతు పలికారు. గతంలో నాలుగేసి సార్లు బాండ్ పాత్ర చేసిన పియర్స్ బ్రోస్నన్, డేనియల్ క్రెగ్‌లు ఇద్దరూ నల్ల బాండ్ అయినా, లేడీ బాండ్ అయినా తప్పేముంది అన్నారు. చివరకు ఏమవుతుందో వేచి చూడాలి.


 


తిమ్మిని బమ్మి... బమ్మిని తిమ్మి చేసేది ఏమైనా ఉంటే - అది నెట్టే! అదేనండీ... ఇంటర్‌నెట్! ‘ఎన్ని కోట్లిచ్చినా, నేను బాండ్ పాత్ర వేయను’ అని డేనియల్ క్రెగ్ అనడంతో ఇప్పుడు నెట్‌లో రకరకాల బాండ్‌లు తయారయ్యారు. దాంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్... లేడీ బాండ్! గిలియన్ ఆండర్సన్!


 


కొత్త బాండ్ ఎవరు?

త్వరలో తెరకెక్కనున్న 25వ జేమ్స్‌బాండ్ చిత్రానికి బాండ్ ఎవరనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్‌బాండ్‌గా టామ్ హిడెల్‌స్టన్ చేస్తా రని ఒక వార్త. మరోపక్క బాండ్ పాత్రకోసం తొలిసారిగా ఆడవారి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ‘ఎక్స్-ఫైల్స్’ ఫేమ్ గిలియన్ ఆండర్సన్ పేరు అందరి కన్నా టాప్‌లో నెట్‌లో సందడి చేస్తోంది. ‘ఘోస్ట్ బస్టర్స్’, ‘ఓషన్స్2’ లాంటి కొత్త చిత్రాల్లో ఆడవాళ్ళదే ప్రధానపాత్ర. జేమ్స్‌బాండ్ సిరీస్‌లోనూ ఈ మార్పు ఎందుకు రాకూడదన్నది కొత్త వాదన. ఇక, వర్ణ వివక్ష వ్యవహారం తెర మీదకు తెచ్చి, నల్లజాతీయుడైన 45 ఏళ్ళ ఇడ్రిస్ ఎల్‌బా ఎలా ఉంటారనే చర్చ వచ్చింది. ఆ మాటకొస్తే క్రెగ్‌ను తొలిసారిగా బాండ్ పాత్రకు తీసుకున్నప్పుడూ ఇలానే చర్చలు జరిగాయి. కొత్త బాండ్ ఎవరన్నది కొద్దిరోజుల్లో కానీ అధికారికంగా తేలదు. క్రెగ్ మాటెలా ఉన్నా, వీళ్ళకెంత పారితోషికమి స్తారో తెలీదు. అయినా, పాపులర్ బాండ్ పాత్రకు మించి పారితోషికం ఏముంటుంది!


 


బాండ్... లేడీ బాండ్...

జేమ్స్‌బాండ్ సినిమాలో లేడీ బాండ్‌నే హీరోగా పెట్టడమనేది ఇప్పుడిప్పుడే ఎంతవరకు జరుగుతుందో అనుమానమే కానీ, లేడీ బాండ్‌గా అందరి కన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాత్రం గిలియన్ ఆండర్సన్. అమెరికన్ - బ్రిటీష్ సినీ, టీవీ, రంగస్థల నటి అయిన అమెరికన్ సైన్స్ - ఫిక్షన్ సిరీస్ ‘ఎక్స్-ఫైల్స్’లో అమెరికన్ నేర దర్యాప్తు సంస్థలో స్పెషల్ ఏజంట్ పాత్రధారిణిగా జనంలో ఫేమస్. కుటుంబాన్ని పోషించడం కోసం 22 ఏళ్ళ వయసులో హోటల్‌లో పనిచేస్తూ, రంగస్థలంపై నటిగా కాలుమోపారు. ఆ పైన టీవీ సిరీస్‌లలో నటిగా పేరు తెచ్చుకున్నారు. నవలా రచయిత్రి, ఉద్యమకారిణి అయిన ఆమె తెరపై బలమైన స్త్రీ పాత్రల్ని పోషిస్తుంటారు. పలు మహిళా సంస్థలకు, ఉద్యమాలకు మద్దతుదారైన గిలియన్ తనను తాను ‘ఫెమినిస్టు’గా అభివర్ణించుకుంటారు. ‘‘మహిళల గురించి ఎవరైనా కాస్త తేడాగా మాట్లాడినా, ప్రవర్తించినా నేను ఊరుకోలేను’’ అని బాహాటంగా అంటారు. అన్నట్లు భారతీయ సంతతి మహిళా డెరైక్టర్ గురిందర్ చద్ధా దేశ విభజన నేపథ్యంలో తీస్తున్న ‘వైస్రాయ్స్ హౌస్’లో మౌంట్‌బాటెన్ భార్య ఎడ్వినా మౌంట్‌బాటెన్‌గా గిలియన్ నటిస్తున్నారు. లేడీ బాండ్‌గా నటించినా, నటించకపోయినా - నెట్ ఫ్యాన్స్ పుణ్యమా అని ఇంత ప్రచారం వచ్చినందుకు గిలియన్ సహజంగానే సంతోషిస్తున్నారు.


 


కోట్లిస్తానన్నా... బాండ్ అంటే భయమెందుకు?

‘జేమ్స్‌బాండ్‌గా నటించడం కన్నా మణికట్టు కోసుకుని చావడం బెటర్’ అని హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 24 బాండ్ చిత్రాలు వస్తే, ఆ మధ్య విడుదలైన ‘స్పెక్టర్’ సహా 4 చిత్రాల్లో టైటిల్ రోల్ చేశారు క్రెగ్. ఇక బాండ్‌గా నటించనని ప్రకటించారు. ఎక్కువ డబ్బిస్తే క్రెగ్ నిర్ణయం మార్చుకుంటారని భావించి, దర్శక - నిర్మాతలు అనుకున్నారు. ఏకంగా 100 మిలియన్ డాలరు ్ల(రూ. 674 కోట్లపైగా) ఆఫర్ చేశారట. అంత డబ్బు అన్నా క్రెగ్ మనసు చలించలేదు. బాండ్ సినిమాల్లోని రిస్కీ యాక్షన్ సీన్స్ కారణంగా క్రెగ్‌కు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. పైగా, బాండ్ సినిమాల షూటింగ్ కోసం విమానం మీద నుంచి వేలాడడం, అతి వేగంగా వెళుతున్న కారులో ప్రయాణం లాంటి వాటితో ఆయనకు ఒళ్ళంతా దెబ్బలేనట! దాంతో, డబ్బు కన్నా ఆరోగ్యానికి ఓటేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top