మళ్లీ... ఆ కాంబినేషన్?

మళ్లీ... ఆ కాంబినేషన్?


 దేశవ్యాప్తంగా పేరున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్... దిగ్దర్శకుడు శంకర్..! వీరిద్దరి ‘మెగా’ కాంబినేషన్ సూపర్‌హిట్. ప్రసిద్ధ ఏ.వి.ఎం. చిత్ర నిర్మాణ సంస్థకు ‘శివాజీ’ (2007) చిత్రం అందించి, ఆ పైన ‘రోబో’ చిత్రంతో సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఘనత ఈ కాంబినేషన్‌కు ఉంది.  వీరిద్దరూ మరోసారి కలసి పనిచేయనున్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలు వాస్తవరూపం ధరించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.

 

  మునుపటి భారీ చిత్రాలకు తీసిపోకుండా వీరిద్దరూ మరో భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోడంబాకమ్ కబురు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో నాలుగు నుంచి అయిదు నెలల్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళనుందట! ఆ మధ్య తమిళ నటుడు విజయ్‌తో సూపర్‌హిట్ ‘కత్తి’ చిత్రాన్ని తీసిన నిర్మాతలే ఈ సినిమానీ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఆకాశమే హద్దుగా దాదాపు రూ. 200 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తారని అంటున్నారు.

 

 ఆ మాట ఎలా ఉన్నా, ఇప్పటికే ఒక పక్క దీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్న విక్రమ్ ‘ఐ’ ఆశించినంతగా వసూళ్ళు సాధించకపోవడంతో శంకర్ కొంత నిరుత్సాహంతో ఉన్నారు. మరోపక్క, తాజా చిత్రం ‘లింగ’ వాణిజ్య వైఫల్యం చెందడంతో రజనీకాంత్ సైతం చికాకుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో, ఎలాగైనా ఒక సూపర్‌హిట్ చిత్రంతో, అపరిమితమైన వసూళ్ళతో పునర్వైభవం సాధించాలని ఈ ద్వయం కంకణం కట్టుకోవడం సహజం. అందుకు ఈ కొత్త చిత్రం తోడ్పడుతుందా? వివరాల కోసం వేచిచూడాలి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top