'తల్వార్' మూవీ రివ్యూ

'తల్వార్' మూవీ రివ్యూ


టైటిల్ : తల్వార్

జానర్ ;  క్రైమ్ థ్రిల్లర్

తారాగణం ; ఇర్ఫాన్ ఖాన్, కొంకన్సేన్శర్మ, నీరజ్ కబీ, సోహమ్ శర్మ

దర్శకత్వం ; మేఘన గుల్జార్

సంగీతం ; విశాల్ భరద్వాజ్

నిర్మాత ; వినీత్ జైన్, విశాల్ భరద్వాజ్



బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో అదే తరహాలో తెరకెక్కిన మరో సినిమా తల్వార్. పరువు హత్యగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇప్పటికీ మిస్టీరియస్గానే మిగిలిన ఆరుషి తల్వార్ హత్య కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారిగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన తల్వార్ వెండితెర మీద ఎలాంటి రిజల్ట్ సాధించిందో చూద్దాం.



కథ :

అశ్విన్ కుమార్ ( ఇర్ఫాన్ ఖాన్ )ను సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్గా పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. డిపార్ట్మెంట్ అధికారులు అతనికి శృతి టాండన్ హత్య కేసు విచారణ బాధ్యతలు అప్పగిస్తారు. 2008 మార్చ్ 15 రాత్రి శృతి టాండన్ (అయేషా ప్రవీణ్) నోయిడాలోని సమీర్ విహార్ ప్రాంతంలో హత్యకు గురవుతుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు రమేష్ (నీరజ్ కబీ), నూతన్ ( కొంకణా సేన్ శర్మ)లు పోలీసులకు సమాచారం అందిస్తారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎన్నో అనుమానాల తర్వాత శృతిది పరువు హత్యగా భావించి, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తారు. ఈ సమయంలో కేసు విచారణ బాధ్యతలు తీసుకున్న ఇన్స్పెక్టర్ అశ్విన్ కుమార్ ఆ హత్య కేసును ఎలా పరిష్కరించాడన్నదే సినిమా కథ.



నటీనటులు, సాంకేతిక నిపుణులు :

సినిమా అంత వన్ మేన్ షోలా ఇర్ఫాన్ ఖాన్ చూట్టూ తిరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఇర్ఫాన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా కనిపించిన ఇర్ఫాన్ తనకు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా ఎందుకు గుర్తింపు వచ్చిందో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఇతర పాత్రల్లో నటించిన వారికి పెద్దగా పర్ఫామెన్స్ స్కోప్ లేకపోయినా ఎవరి పరిధి మేరకు వారు ఆకట్టుకున్నారు. హత్యకు గురైన శృతి తల్లి పాత్రలో కొంకణా సేన్ శర్మ మెప్పించింది. ఒకవైపు కూతురు మరణం, మరోవైపు ఆ హత్యకు తనే కారణం అంటూ ఆరోపణలు రావటం మధ్య ఓ తల్లి ఎలాంటి మానసిక వేదన అనుభవిస్తుందో చాలా బాగా చూపించింది.



దేశవ్యాప్తంగా ఎంతో ప్రచారం కలిగిన ఓ హత్య కేసును కథ ఎంచుకొని చాలా పెద్ద సాహసమే చేసింది దర్శకురాలు మేఘన గుల్జార్. వివాదాలకు అవకాశం ఉన్న సబ్జెక్ట్ అయినా, కథా కథనాల్లో పూర్తి పట్టు కనబరించింది. ముఖ్యంగా ఓ థ్రిల్లర్ సినిమాను నడించడానికి స్క్రీన్ ప్లే లో తీసుకున్న జాగ్రత్తలు, పాత్రల ఎంపికలో ఆమె తీసుకున్న కేర్ సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేశాయి. నిర్మాణ బాధ్యతలతో పాటు సంగీతం అందించిన విశాల్ - భరద్వాజ్ ఆకట్టుకున్నారు. సినిమాకు ప్రాణం లాంటి చాలా సీన్స్ కు తమ సంగీతంతో మరింత లైఫ్ తీసుకొచ్చారు. పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.



విశ్లేషణ :

సున్నితమైన అంశమే అయినా ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించటంలో దర్శకురాలు మేఘన గుల్జార్ మంచి విజయం సాదించింది. మర్డర్ మిస్టరీ సినిమాను థ్రిల్లింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్తో అద్భుతంగా తెరకెక్కించి అందరినీ ఆకట్టుకుంది. తొలి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన మేఘన, సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త పట్టు కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. అయితే అప్పటికే ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అవ్వటంతో స్క్రీన్ ప్లే స్లో అయినా బోర్ అనిపించదు. నటీనటుల పర్ఫామెన్స్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల పనితనంతో తల్వార్ కమర్షియల్ సక్సెస్ గానే కాక విమర్శకులు ప్రశంసలు అందుకునే ఉత్తమ చిత్రంగా రూపొందింది.



ప్లస్ పాయింట్స్



ఇర్ఫాన్ ఖాన్

డైరెక్షన్

స్క్రీన్ ప్లే



మైనస్ పాయింట్స్



సెకండ్ ఆఫ్ స్లో నారేషన్



ఓవరాల్ గా తల్వార్ పక్కా కమర్షియల్ వాల్యూస్ తో తెరకెక్కిన రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top