అందాల రాక్షసి నానితో చేద్దామనుకున్నా!

అందాల రాక్షసి నానితో చేద్దామనుకున్నా!


‘‘జనరల్‌గా నేను ఏ కథ రాసుకున్నా కామన్ మ్యాన్‌ని దృష్టిలో పెట్టుకుంటాను. నాలుగు గోడల మధ్య కూర్చుని కథ రాసే అలవాటు లేదు. నలుగురితో డిస్కస్ చేస్తాను’’ అని హను రాఘవపూడి అన్నారు. ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నారాయన. ఇప్పుడు నాని హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ నేడు తెరపైకి వస్తోంది. ఈ సందర్భంగా హను రాఘవపూడి పలు విశేషాలు చెప్పారు.

 

 దర్శకునిగా నా మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ 2012లో విడుదలైంది. ఆ తరువాత యాక్షన్ లవ్‌స్టోరీ తెరకెక్కించాలని కథ రాసుకున్నా. ఆ కథతోనే తీయాలని ఓ ఏడాదిన్నర ట్రావెల్ చేశాను. కానీ, కుదరలేదు. వాస్తవానికి ‘అందాల రాక్షసి’ కథను ముందుగా నానీకే చెప్పాను. కానీ, తనకు సూట్ కాదనుకున్నాడు. ఆ తర్వాత చెప్పిన రెండు కథలకు కూడా నాని పెద్దగా ఎగ్జయిట్ కాలేదు. చివరకు ఈ కథ నచ్చింది. ఈ కథలో ఓ వైవిధ్యమైన పాయింట్ ఉంది. గడచిన 20 ఏళ్లల్లో ఆ పాయింట్‌ని ఎవరూ టచ్ చేయలేదు.

 

 బలమైన ప్రేమకథతో సాగే ఈ చిత్రం వినోద ప్రధానంగా సాగుతుంది. ఇందులో నాని ఎక్కడా కనిపించడు. కృష్ణ పాత్రే కనిపిస్తుంది. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడు కాబట్టి ‘జై బాలయ్య’ టైటిల్ వినపడింది కానీ, మేం ముందు నుంచీ ఆ టైటిల్ అనుకోలేదు. ఈ సినిమాకి సంగీత దర్శకునిగా ముందు రథన్‌నే అనుకున్నాం. కానీ, ఆ తర్వాత విశాల్ చంద్రశేఖర్‌తో చేయించాం.

 

 రథన్‌కీ, నాకూ మధ్య ఎలాంటి గొడవలూ లేవు. భవిష్యత్తులో తనతో సినిమా చేస్తాను. నిర్మాతలు అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సహకారం మర్చిపోలేనిది. రాజీపడకుండా నిర్మించారు. నేనే పని చేసినా ముందు ఆత్మసంతృప్తి లభించాలనుకుంటా. ఆ తర్వాత ప్రతిఫలం గురించి ఆలోచిస్తా. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ పూర్తి సంతృప్తినిచ్చింది. త్వరలో ‘కవచం’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నా. దానికి ఇంకా హీరోని నిర్ణయించలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top