చెర్రీ... బాబాయ్ జట్టు నేను... పెదనాన్న జట్టు

చెర్రీ... బాబాయ్ జట్టు నేను... పెదనాన్న జట్టు


మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో నట వారసుడు వరుణ్‌తేజ్. ఫస్ట్ లుక్‌తోనే అభిమానుల్లో అంచనాలు పెంచేసిన ఘనత ఈ యువ హీరోది. వరుణ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన ‘ముకుంద’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్‌తో సాక్షి జరిపిన సంభాషణ.

 

 కెమెరా ముందు తొలి అనుభవం ఎలా ఉంది?

 భయమేసిందండీ. నా అదృష్టం బావుండి ఫస్ట్ మాంటేజస్ షాట్స్ తీశారు. తర్వాత ఫైట్లు తీశారు. నేను ఫైట్లు బాగా చేస్తాను. ఎందుకంటే ముందే కొంత ట్రైనింగ్ తీసుకున్నా. తర్వాత ఓ చిన్న డైలాగ్‌తో యాక్టింగ్ పార్ట్ మొదలైంది. ఫస్ట్ నాలుగు టేకులు తీసుకున్నా. శ్రీకాంత్ అడ్డాల ఎక్స్‌ప్రెషన్‌తో సహా నెరేట్ చేసేవారు. అందుకే పోను పోను కేరక్టర్‌లోకి వెళ్లిపోయా.

 

 ఇందులో మీ పేరు ముకుందానా?

 అవును... అయితే సినిమాలో ఆ పేరెక్కడా వినిపించదు. ఓ సన్నివేశంలో ఫామ్‌పై ‘ముకుంద’ అని సైన్ చేస్తాను. ఆ సన్నివేశం తర్వాతే ఆ టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌కి తగ్గట్టే నా పాత్ర కూడా శ్రీకృష్ణుణ్ణి పోలి ఉంటుంది. కృష్ణుడు ఏం చేసినా లోక కల్యాణం కోసమే. అలాగే ఇందులో నేను కూడా. మాటలు తక్కువ. పనులు ఎక్కువ. భావోద్వేగాలను ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయను. నాకు కామెడీ అంటే ఇష్టం. కానీ, పాత్రకు తగ్గట్టుగా సీరియస్‌గా చేయాల్సొచ్చింది.

 

 మెగా ఫ్యాన్స్ మాస్ పాత్రలే ఇష్టపడతారు. ఇందులో ఆలా ఉంటారా?

 మా ఫ్యామిలీలో ఎవరూ కావాలని మాస్ పాత్రలు చేయలేదు. వచ్చిన పాత్రల్ని ఎంత బాగా చేయొచ్చో అంత బాగా చేసి, మెప్పించారు. ఆటోమేటిగ్గా మాస్ ఇమేజ్ వచ్చింది. నేనూ అదే దారిలో వెళ్తా.

 

 ఇంతమంది దర్శకులుండగా శ్రీకాంత్‌నే ఓకే చేయడానికి కారణం?

 మేం ఆయన్ను ఓకే చేయడం కాదు, ఆయనే నన్ను ఓకే చేశారు. శ్రీకాంత్‌లాంటి డెరైక్టర్ తనకు తానుగా వచ్చి అడగడంతో నాన్న ఓకే చెప్పేశారు. ఓ అగ్ర నిర్మాత నన్ను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. అయితే... శ్రీకాంత్‌గారికి కొన్ని వ్యక్తిగత సమస్యలు తలెత్తాయి. దాంతో ఆ ప్రాజెక్ట్ పూరి జగన్నాథ్‌గారి దగ్గరకెళ్లింది. ఆయన ‘హార్ట్ ఎటాక్’ కథ వినిపించారు. బాగుందనిపించినా కానీ... కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఫైనల్ కాలేదు. తర్వాత క్రిష్ ఓ కథ వినిపించారు. మొదటి సినిమానే ఇంత పెద్ద కథా అని భయమేసింది. కథ నచ్చడంతో ‘ఆగస్ట్ 8న షూటింగ్ స్టార్ట్’ అని ట్విట్టర్‌లో పెట్టాను. అయితే... క్రిష్ ‘గబ్బర్’ షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. ఏదేమైనా ఫస్ట్ కలిసింది శ్రీకాంత్‌గారే కాబట్టి ఆయనకే సినిమా చేయడం న్యాయమని నాన్న ఫీలయ్యారు.  

 

 ఫస్ట్ నుంచి నటుడవ్వాలనే కోరిక ఉండేదా మీకు?

 మనసులో ఉండేది. 122 కిలోల బరువుండేవాణ్ణి. అందుకే చెప్పుకునేవాణ్ణి కాదు. మెల్లమెల్లగా 55 కిలోలు తగ్గాను. దాంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ‘మగధీర’ షూటింగ్ అప్పుడు ఫొటోలు దిగితే, అవి చూసి.. ‘నీది ఫొటోజనిక్ ఫేస్... ఇంట్రస్ట్ ఉంటే ట్రై చేయ్’ అని పెదనాన్న అన్నారు. స్వయంగా పెదనాన్నే అనేసరికి నా కోరిక చెప్పేశాను. ఇక, అమ్మానాన్న అయితే, నేనేం చేస్తానన్నా సపోర్ట్ చేస్తారు.

 

 స్పోర్ట్స్ బాగా ఆడతారా?

 ఇదివరకు లావుగా ఉండేవాణ్ణి కాబట్టి చూస్తూ ఎంజాయ్ చేసేవాణ్ణి. ఇప్పుడు రెగ్యులర్‌గా ఆడుతున్నా. ఏడాది బాటు టెన్నిస్ ఆడాను. తర్వాత ఏడాదిన్నర పాటు బ్యాడ్‌మింటన్ ఆడా. రెండేళ్ల నుంచి వాలీబాల్ ఆడుతున్నా. ‘ముకుంద’లో నేను వాలీబాల్ ప్లేయర్‌ని. ఆ పాత్రకు నా స్పోర్ట్స్ నాలెడ్జ్ బాగా ఉపయోగపడింది.

 

 నటనలో మీకెవరు ఇన్‌స్పిరేషన్?

 పెదనాన్నే... ఆయన ‘విజేత’ సినిమా చూసి ఏడ్చేవాణ్ణి. గ్యాంగ్‌లీడర్, ఘరానామొగుడు, ముఠామేస్త్రీ చిత్రాలు చాలాసార్లు చూశాను. కమల్‌హాసన్ నటనంటే ప్రాణం. హాలీవుడ్‌లో ఆర్నాల్డ్, తెలుగులో ప్రభాస్ ఫైట్లంటే ఇష్టం. వారిని ప్రేరణగా తీసుకుంటాను తప్ప... ఇమిటేట్ చేయను.

 

 పెదనాన్న, బాబాయ్... వీళ్లద్దరిలో ఎవరంటే ఇష్టం?

 ఇద్దరూ ఇష్టమే. అయితే... పెద్దనాన్నంటే కాస్త ఎక్కువ ఇష్టం. నేనాయన పెట్‌ని. వీకెండ్‌లో ఆయన దగ్గరే ఉండేవాణ్ణి. చెర్రీ (రామ్ చరణ్) అన్నయ్య, కల్యాణ్‌బాబాయ్ ఓ జట్టు. నేను పెదనాన్న జట్టు.

 

 మీ ఫ్యామిలీపై వచ్చే రూమర్లు వింటే మీకేమనిపిస్తుంది?

 కొన్ని రూమర్లు చూస్తే నవ్వొస్తుంటుంది. ఎవరింట్లో సమస్యలుండవ్ చెప్పండి? కూర వండితే ఒకరికి నచ్చుతుంది. ఒకరికి నచ్చదు. మా ఇంట్లో సమస్యలు కూడా అలాంటివే. ‘ఆరంజ్’ టైమ్‌లో నాన్న కాస్త ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చూశారు. అప్పుడు పెదనాన్న, బాబాయ్.. ఇలా అందరూ నాన్నకు సపోర్ట్‌గా నిలిచారు.

 

 నైట్ పార్టీలకు వెళ్తుంటారా?

 అలాంటివి నాన్న పోత్సహించరు. ఇదివరకు రెండుమూడు సార్లు పబ్‌లకు వెళ్లా. అక్కడ వీకెండ్స్‌లో అమ్మాయిలు లేకపోతే రానీయరు. అందుకే వెనక్కి వచ్చేశాం. కొంతమందైతే.. ‘నేను ఎవరబ్బాయినో తెలుసా?’ అని ఆర్గ్యూ చేస్తారు. నాకు అలా చెప్పుకోవడం నచ్చదు. అందుకే అలాంటి ప్లేస్‌లకు వెళ్లకూడదనుకున్నా. నైట్ కార్ డ్రైవింగ్ అంటే ఇష్టం. కారు తీసి అలా ఓ రౌండ్ వేసి వస్తుంటా.  

 

 నెక్ట్స్ సినిమాలు?

 క్రిష్, పూరీ... ఇద్దరి సినిమాలూ ఓకే చేశా.

 - బుర్రా నరసింహ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top