నాకు బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను!

నాకు బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను!


ఈతరం కథానాయికల్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేసింది చార్మీనే! మిగతా తారలతో పోలిస్తే తను పూర్తి భిన్నంగా కనిపిస్తారు. ఓ పక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోపక్క ఆత్మసంతృప్తినిచ్చే పాత్రల అన్వేషణలో ఉంటారామె. తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘ప్రతిఘటన’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు.

 

నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రం చేయడం మీకు కొత్త కానప్పటికీ, ‘ప్రతిఘటన’ మీకెలాంటి అనుభూతినిచ్చింది?

 ఇప్పటివరకు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. శక్తిమంతమైన పాత్రికేయురాలి పాత్ర నాది. ఓ న్యూస్ చానల్ రిపోర్టర్‌ని అన్నమాట. ఇప్పటివరకు పాత్రికేయులు నన్ను తికమకపెట్టే ప్రశ్నలు అడిగేవారు. ఈ సినిమాలో నేనా పని చేశా. కొంచెం వెటకారంగా చికాకు పెట్టే ప్రశ్నలతో ఆడుకుంటానన్నమాట. భలే అనిపించింది.

 

ఇది మీకు 50వ సినిమా కదా?




అవును. ఇప్పటివరకూ 49 విడుదలలు చూశాను. అయినా ఏదో మొదటి సినిమా అప్పుడు ఉన్నంత టెన్షన్‌గా ఉంది. కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్లుగా ఉంది. ఈ ఒత్తిడి అంతా సినిమా ఏమవుతుందో ఏమోననే భయం వల్ల కాదు. ఎందుకంటే, ఇది తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.

 

 

తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో చేయడం ఎలా అనిపించింది?

 

ఇలాంటి శక్తిమంతమైన చిత్రాలు తీయడానికి ఆయనే కరెక్ట్. తనకేం కావాలో మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు కాబట్టే, పాత్రను బాగా అర్థం చేసుకుని చేయడానికి కుదిరింది. సమాజంలో జరుగుతున్న పలు అన్యాయాల గురించి ఆయన ఈ సినిమాలో చర్చించిన తీరు అద్భుతం.

 

 

ఈ సినిమా చేయడం ద్వారా మీరేం నేర్చుకున్నారు?



 ఇప్పటివరకు నేను ఓటు వేయలేదు. కానీ, ఈ ఎన్నికలకు తప్పకుండా ఓటేస్తా. ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో ఈ సినిమా చేసిన తర్వాత తెలిసింది. ఈ సందర్భంగా అందర్నీ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.

 

 

12 ఏళ్లలో 50 సినిమాలు పూర్తి చేశారు. ఇక మీ తరువాతి లక్ష్యం 100 సినిమాలపైనేనా?




ఆ లక్ష్యం లేదు. నేనేదీ ప్లాన్ చేసుకోను. జీవితం ఎలా తీసుకువెళితే అలా వెళ్లిపోతాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌కే పరిమితం అవుతున్నారెందుకని? ఆ తరహా సినిమాలే చేయాలనే లక్ష్యంతో చేయడంలేదు. నేనే సినిమా చేసినా కథని దష్టిలో పెట్టుకునే చేస్తున్నాను. నేను వింటున్న కథల్లో ఇవి బాగున్నాయనిపిస్తోంది. అందుకే చేస్తున్నాను. రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్‌గా చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నా వయసు 25. ఇంకా బోల్డంత కెరీర్ ఉంది. కాబట్టి, నింపాదిగా సినిమాలు చేసుకోవచ్చు.

 

 కెరీర్ పరంగా వేగం తగ్గిందేమో అనిపిస్తోంది...




 నేను హీరోయిన్ అయ్యి పన్నెండళ్లవుతోంది. ఇన్నేళ్లూ ఎంతో బిజీగా సినిమాలు చేశాను. ఇప్పుడు రిలాక్స్ కావాలనిపిస్తోంది. ఒకప్పుడు డబ్బు కోసం సినిమాలు చేశాను. ఇప్పుడా అవసరంలేదు. ఆత్మసంతృప్త్తిని మిగిల్చే సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను తిరస్కరించిన సినిమాల జాబితా చాలానే ఉంది.

 

 పాతికేళ్లు వచ్చేశాయ్ కాబట్టి, పెళ్లి చేసుకోమని మీ ఇంట్లో తొందరపెట్టడంలేదా?

 


ఎందుకు పెట్టరు? కొన్ని సంబంధాలు కూడా వస్తున్నాయి. పెళ్లి గురించి నేనింకా ఓ నిర్ణయానికి రాలేదు.

 

 పెద్దలు కుదిర్చిన పెళ్లేనా? ప్రేమ వివాహమా?



 పెద్దలు కుదిర్చిన పెళ్లి కష్టమే. ఎందుకంటే, మనిషి ఎలాంటివాడో, మనస్తత్వం ఏంటో తెలియకుండా జీవితాన్ని పంచుకోలేను. అందుకే నాకు బాగా తెలిసిన వ్యక్తినే చేసుకుంటాను.

 

 ఎవరా వ్యక్తి?



 ఇంకా తారసపడలేదు.

 

 మీరిప్పుడు చేయనున్న చిత్రాలు?

 

‘మంత్ర 2’ ఓకే చేశాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top