కృష్ణ, విజయనిర్మలకు పెళ్లి చేసింది నేనే..

కృష్ణ, విజయనిర్మలకు పెళ్లి చేసింది నేనే..


ఉన్నత చదువు... మంచి మనసు... మాటల్లో నిజాయితీ...చేతల్లో నిబద్ధత వెరసి ఆయనకు తెలుగు, కన్నడ సినీ చరిత్రలో మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయనే ఏకాంబరేశ్వరరావు. నిర్మించింది దశ చిత్రాలే అయినా దశాబ్దాల కాలం గుర్తుండిపోయేలా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మలకు ప్రేమ పెళ్లి చేసింది కూడా ఏకాంబరేశ్వరరావే. ఆయన మనోగతం ఏంటో ఆయన మాటల్లోనే ...

 

తమిళ సినిమా:

మాది ఆంధ్రప్రదేశ్, బాపట్ల సమీపంలోని జమ్మిలపాలెం. పువ్వాడ బసవయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు 1934 సెప్టెంబర్ 27న పుట్టాను. మచిలీపట్టణంలో డిగ్రీ పట్టా పొందాను. ఆ తరువాత ఎస్‌ఐగా పరీక్షలో సెలెక్ట్ అయినా చేరలేదు. కాంట్రాక్టర్ వృత్తి చేపట్టాను. తరువాత చిత్ర రంగంపై దృష్టి మళ్లింది. చదువుకునే రోజుల నుంచే నటనపై ఆసక్తి. పలు నాటకాలు ఆడాను కూడా. అప్పట్లో నా మిత్రుడు కొన ప్రభాకర్, హీరోగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో చెన్నైకి పయనం అయ్యాను.



అక్కడ లోటుపాట్లను ఆరు నెలలు సునితంగా పరిశీలించాను. తొలి ప్రయత్నంగా పంపిణీ రంగంలోకి ప్రవేశించాను. మిత్రులు ఎన్ ఎన్‌భట్, ఎన్ ఎస్ మూర్తిలతో కలిసి భీమాంజనేయ యుద్ధం, సత్యమే జయం చిత్రాలను పంపిణీ చేశాను. ఆ తరువాత తానే చిత్రం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే నిర్మాతనయ్యాను. ఎన్‌ఎన్ భట్‌తో కలిసి విజయాభట్ మూవీస్ పతాకంపై 'సుఖ దుఃఖాలు' చిత్రం నిర్మించాను. తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన మేజర్ చంద్రకాంత్ చిత్రానికిది రీమేక్. ఎస్.వి.రంగారావు గారు ప్రధానపాత్ర పోషించారు.



నేటి మాజీ ముఖ్యమంత్రి జయలలిత హీరోయిన్. అప్పటి వరకు హాస్యపాత్రలు పోషిస్తున్న వాణిశ్రీని రెండో హీరోయిన్‌గా పరిచయం చేశాను. ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఇది మల్లెల వేళయని పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. నాలుగు లక్షలతో నిర్మించిన ఈ చిత్రాన్ని 1967లో విడుదల చేశాం. ఇదే చిత్రంలోని మేడంటే మేడే కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పాటలోనే గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం ప్రాచుర్యం పొందారు.



ఇక నేను కాంట్రాక్టర్‌గా సంపాదించిన రూ.30వేలతో పరిశ్రమలో అడుగుపెట్టాను. వాటిలో సగం తొలి చిత్ర నిర్మాణానికి ఖర్చు కాగా ఇక 15వేలు మిగిలాయి. తన బంధువు సునీల్‌చౌదరి రూ.15 వేలు పెట్టుబడి పెడుతానన్నారు. తరువాత కె.రాఘవ కూడా పార్టనర్‌గా చేరారు. ఎన్.వి.సుబ్బరాజు మరో భాగస్వామిగా చేరడంతో మొత్తం రూ.51వేలతో జగత్ కిలాడీలు చిత్రం మొదలెట్టాం. కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్, సంభాషణలు రాశారు.



ఈ చిత్రం నిర్మాణ సమయంలోనే కృష్ణ, విజయనిర్మలు ప్రేమలో పడ్డారు. కృష్ణగారి కుటుంబం వీరి ప్రేమను అంగీకరించ లేదు. కృష్ణ, విజయనిర్మలను వదిలి ఉండలేని పరిస్థితి రావడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నేను కె.రాఘవ పూనుకుని తిరుపతిలో వారి పెళ్లి చేయించాం. జగత్ కిలాడీలు మంచి విజయం సాధించింది. తదుపరి జగత్ జట్టీలు చిత్రం నిర్మాణానికి సిద్ధం అయ్యాం. ఈ చిత్రంలోను కృష్ణనే హీరోగా నటించమని అడిగాం. అందుకాయన హీరోయిన్‌గా విజయనిర్మలను చూపించారు.



ఈ విషయంలో విభేదాలొచ్చాయి. దీంతో శోభన్‌బాబును ఎంపిక చేశాం. కేవీ నందనరావు దర్శకుడు. ఆయన వద్ద దాసరి నారాయణరావు సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. జగత్‌జెట్టీలు పేరుతో విజయ బాపినీడు ఒక నవలనురాశారని తెలిసి ఆయన్ని పిలిచి మా చిత్రానికి పని చేయమని అడిగాం. అందుకాయన సంతోషంగా అంగీకరించారు. ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్. అప్పటి వరకు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న రావుగోపాలరావు గారిని ఈ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం చేశాను.



అందుకాయన శోభన్‌బాబు చిత్రంలో నేను సెకండ్ హీరోనా అంటూ నిరాకరించడంతో ఆ వేషం నేనే ధరించాను. ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా నిర్మాతగా బాగానే ఉన్నాను కదా అని నటనపై ఆసక్తి చూపలేదు. మూడవ చిత్రం జగత్‌జంత్రీలు చేశాం. ఈ చిత్రం తరువాత విభేదాల కారణంగా రాఘవ, నేను విడిపోయాం. ఆ తరువాత నేను పల్గుణ పిక్చర్స్ పతాకంపై ఎస్.వి.రంగారావు, చలం, వాణిశ్రీలతో రాముడే దేవుడు చిత్రం చేశాను. బి.వి.ప్రసాద్ దర్శకుడు.



 కన్నడ చిత్ర రంగ ప్రవేశం



మధ్యలో భట్‌తో కలిసి అతై కొందుకల శశికందుకల అనే చిత్రం చేశాను. కల్యాణ్‌కుమార్ హీరో. ఆ అనుభవంతో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ హీరోగా మూరువరె వజ్ర అనే భారీ పౌరాణిక చిత్రం చేశాను ఈ చిత్రంలో రాజ్‌కుమార్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో నారద వినోదం పేరుతో అనువాదం చేశాను. దాసరిగారితో అత్యం త సాన్నిహిత్యం ఉన్నా ఆయనతో చిత్రం చేయలేకపోయాను. తెలుగులో గమ్మత్తు గూఢచారి పేరుతో బాలల ప్రధాన ఇతివృత్తంతో ఒక చిత్రం చేశాను. మోహన్‌బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. ఆ తరువాత పంపిణీదారుల వ్యవస్థ పోయి కొనుగోలుదారుల పద్ధతి రావడంతో 1983 తరువాత చిత్ర నిర్మాణానికి దూరంగా వున్నాను.



నా జీవిత భాగస్వామి అనురేశ్వరి. ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు పేరు సుందర్. సినీరంగంలో కొనసాగుతున్నాడు. రెండో కొడుకు చంద్రబాబు హైదరాబాదులోనే ఫిలిం ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. మూడవ కొడుకు సాప్టువేర్ ఇంజనీర్, స్టేట్స్‌లో ఉంటున్నారు. కూతురు హేమలత పెళ్లి చేసుకుని బాపట్లలో ఉంటోంది. 80 వసంతాలు పూర్తి చేసుకున్న నేను ఇప్పటికీ ఆనందంగా గడిపేస్తున్నాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top