భలే భలే నవ్వుకోండి..!

భలే భలే నవ్వుకోండి..!


 మారుతి సినిమాల్లో తప్పకుండా ఏదో స్పెషాల్టీ ఉంటుంది...ప్రేమ, రొమాన్స్, దెయ్యం, కొంచెం పిచ్చి... కానీ, అన్నింట్లో కామన్‌గా ఉండేది మాత్రం భలే భలే నవ్వు...పడి పడి నవ్వండి అంటున్నాడు హీరో... భలే భలేగా ఉంటుంది అంటున్నాడు మారుతి...కసి కసిగా తీశాం అంటున్నారు వంశీ, బన్నీ వాసు.

 

 ‘భలే భలే మగాడివోయ్’ అంటున్నారు.. ఏంటి సంగతి?

 (నవ్వుతూ). చాలా కామెడీ చేస్తానండి. ఫన్నీ థింగ్ ఏంటంటే.. ఈ చిత్రంలో నాకు మతిమరుపు ఉంటుంది. నిజంగా కూడా నాకు అంతో ఇంతో మతిమరుపు ఉంది. మారుతి ఈ కథ చెబుతున్నప్పుడు నేను పడీ పడీ నవ్వాను. అంత హ్యుమరస్‌గా ఉంటుంది. బేసిక్‌గా నాకు కామెడీ ఇష్టం కాబట్టి కథ వినగానే నచ్చింది. కమల్‌హాసన్‌గారి ‘మరోచరిత్ర’ లోని ‘భలే భలే మగాడివోయ్..’ పాట ఫోన్‌లో జరిగే సంభాషణకు సంబంధించిన సీన్స్‌లో రింగ్ టోన్‌గా వస్తుంది.

 

 మారుతి ఎలాంటి కథ చెబుతారని ఊహించారు?

 వాస్తవానికి ఆయన గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కథ చెబుతారు? ఎలాంటి సినిమా తీస్తారు? అని కొంచెం ఆలోచించాను. కానీ, మొత్తం కథ విన్నాక చాలా బాగుందనిపించింది. స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కథలో చిన్న మార్పుతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా. సినిమా చేయడం మొదలుపెట్టాక నమ్మకం పెరిగింది. రీ-రికార్డింగ్ లేకుండా కొంతమంది ఈ చిత్రం చూశారు. వాళ్లయితే కడుపుబ్బా నవ్వారు. ఈ చిత్రాన్ని మారుతి తీసిన విధానం ప్రేక్షకులకు కూడానచ్చుతుంది. దర్శకుడిగా మారుతి నిజమైన ఫ్లేవర్ ఏంటి? అనేది ఈ చిత్రంతో తెలుస్తుంది.

 

 మామూలుగా మీరు మంచి మంచి కథలు ఎంపిక చేసుకుంటుంటారనే అభిప్రాయం మీ చిత్రాలు చూసినవాళ్లకు ఉంటుంది. ఈ కథ కూడా ఆ కోవలోనే ఉంటుందా?

 మొదట్నుంచీ కూడా నేను కథకు ఇంపార్టెన్స్ ఇస్తాను. ‘నీ స్టోరీ సెలక్షన్ బాగుంటుంది’ అని చాలామంది నాతో అన్నారు. మామూలుగా మా అక్క నా బెస్ట్ క్రిటిక్. నా చిత్రాలను దాదాపు విమర్శిస్తుంది. కానీ, ‘ఎవడే సుబ్రమణ్యం’ చూసి, అభినందించింది. మా అక్క యూఎస్‌లో ఉంటుంది. అందుకని నా సినిమాలన్నీ అక్కడే చూస్తుంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంది. ‘భలే భలే మగాడివోయ్’ రిలీజ్  సమయంలో యూఎస్‌లో ఉంటుంది. దాంతో ‘నీ అన్ని సినిమాలూ నేను యూస్‌లో ఉన్నప్పుడే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా.. ఈ సినిమా చూసే అవకాశం ఉందా?’ అని అడిగితే, రీ-రికార్డింగ్ పూర్తి కాకపోయినా చూపించాం. సినిమా చూశాక, ‘ఈ సినిమా హిట్టవ్వకపోతే జీవితంలో నేను ఏ సినిమాకీ జడ్జిమెంట్ చెప్పను’ అంది. ‘పైసా’ తనకు నచ్చలేదు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే మా అక్క జడ్జిమెంట్‌ని నేను బాగా నమ్ముతాను.

 

 గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి తీసిన ఈ సినిమాలో చేయడం ఎలా అనిపిస్తోంది?

 గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ చిన్న సినిమాలు తీయడం ఆనందంగా ఉంది. దీనివల్ల చిత్రపరిశ్రమకు మంచి జరగడమే కాకుండా, ప్రతిభ ఉన్నవాళ్లకు మరిన్ని అవకాశాలు వస్తాయి. అలాగే, యువి క్రియేషన్స్ కూడా పెద్ద సినిమాలు, మీడియమ్ బడ్జెట్ చిత్రాలు తీయడం ఆనందించదగ్గ విషయం.

 

 ‘భలే భలే మగాడివోయ్’ టీజర్ గురించి గురించి రాజమౌళి ప్రత్యేకంగా అభినందించడం గురించి?

 రాజమౌళిగారి  కుటుంబంతో నాకు బాగా సాన్నిహిత్యం ఉండటంతో నా సినిమాలకు వాళ్లు కావాలని పబ్లిసిటీ ఇస్తూ  ఉంటారని చాలా మంది అంటుంటారు. కానీ అందులో నిజం లేదు. రాజమౌళిగారు బాగుంటేనే మెచ్చుకుంటారు. ఈ సినిమా టీజర్ నచ్చి, జెన్యున్‌గా స్పందించారు.

 

 జయాపజయాలను విశ్లేషించుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది?

 ఇప్పటివరకూ నా కెరీర్‌లో 13 సినిమాలు చేశాను. వాటిలో రెండు తమిళ్. ఆ రెండు చిత్రాలూ సక్సెస్ కాలేదు. తెలుగులో చేసిన పదకొండు సినిమాల్లో తొమ్మిది హిట్. కానీ, విచిత్రం ఏంటంటే.. ఫ్లాప్ అయిన ఆ రెండు సినిమాలను దృష్టిలో పెట్టుకుని, నేనేదో వెనకపడిపోయానని చాలామంది అనుకుంటుంటారు. జయాపజయాలు  కామన్. కానీ, నాని నటుడిగా ఫెయిల్ అయ్యాడు అనిపించుకున్నప్పుడు మాత్రం నేను కచ్చితంగా డిప్రెషన్‌కి లోనవుతాను. 2012లో ‘ఈగ’ చేశాక డిఫరెంట్ రూట్‌లో వెళ్లాలనుకున్నాను. ఈ క్రమంలోనే ‘పైసా’, ‘జెండా పై కపిరాజు’ సెలక్ట్ చేసుకున్నాను. 2013లో విడుదల కావాల్సిన ఆ చిత్రాలు 2014లో విడుదలయ్యాయి. రెండూ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. డిలే అయిన కారణంగా ఆ ఫలితం వచ్చి ఉంటుందేమో. ఆ తర్వాత చేసిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సోల్ సెర్చింగ్ నేపథ్యంలో సాగుతుంది. అది కూడా ఓ సెక్షన్‌వారికే రీచ్ అవుతుందని తెలిసినా, అలాంటి సినిమాలంటే ఉన్న ఇష్టం వల్ల చేశాను.

 

 ఆ మధ్య కెరీర్ కొంచెం స్లో అయ్యి.. ఇప్పుడు మళ్లీ స్పీడందుకున్నట్లు అనిపిస్తోంది?

 మొన్నా మధ్య హిందూపూర్ టెంపుల్‌లో నా షూటింగ్ జరిగింది. ఆ గుడి పరిసర ప్రాంతాల్లో కొబ్బరికాయలు, పూలు అమ్ముకునేవాళ్లు ఉన్నారు. మాకు కొబ్బరికాయలు అమ్మే వ్యక్తి కావాల్సి వచ్చి, అక్కడే కొబ్బరికాయలు అమ్ముతున్న ఓ వృద్ధురాలిని తీసుకున్నాం. ఆమె నీతో, ‘ఏయ్యా ఈ మధ్య నీ సినిమాలు రావడంలేదు’ అనడిగింది.

 

షాక్ అయ్యాను. అంటే, ఎక్కడో ఉన్న ఓ వృద్ధురాలు కూడా నా సినిమాలు గురించి పట్టించుకుంటుందా?


అనిపించింది. దాంతో స్పీడ్ పెంచాలని డిసైడ్ అయ్యాను. నా స్లోనెస్‌కి కారణం ఉంది. జనరల్‌గా ఓ సినిమా కథ విన్నాక, దాని గురించి సుదీర్ఘంగా చర్చించుకుని, దానికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకుని, ఆ సినిమా రిలీజ్ అయ్యాక రెండు నెలలు గ్యాప్ తీసుకునేవాణ్ణి. ఆ గ్యాప్‌లో తదుపరి చిత్రం గురించి ఆలోచిద్దాం అనుకునేవాణ్ణి. కానీ, గ్యాప్ అనేది దానంతట అది రావాలి కానీ మనంతట మనం తీసుకునేది కాదనేది ఈ రెండేళ్లల్లో అర్థమైంది.

 ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఇష్టపడే మీరు ఇకనుంచి కూడా అలాంటివి చేస్తారా?

 తప్పకుండా. కానీ, ఏ సినిమా చేసినా అందులో వినోదం పాళ్లు ఎక్కువ ఉండేలా చూసుకుంటాను.

 

 ‘డి ఫర్ దోపిడి’కి ఓ నిర్మాతగా వ్యవహరించారు. మళ్లీ నిర్మాణం జోలికి వెళ్లకపోవడానికి కారణం?

 బాపూగారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను కాబట్టి, సినిమా కథ అనుకున్న రోజు నుంచి, ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఏది ఎక్కడ ఎలా జరుగుతుందో నాకు తెలుసు. ఫస్ట్ కాపీ చేతిలోకొచ్చాక బిజినెస్ వ్యవహారాలు ఎలా ఉంటాయి? అనే విషయం మీద నాకు అస్సలు అవగాహన లేదు. కానీ, నా ఫ్రెండ్స్, డెరైక్టర్స్ రాజ్, డి.కె.‘డి ఫర్ దోపిడి’కి ఓ నిర్మాతగా వ్యవహరించమంటే ఓకే అన్నాను. ముందు వాయిస్ ఓవర్ ఇవ్వమని చెప్పి, ఆ తర్వాత ఈ ప్రొడ్యూసర్ ప్రపోజల్ పెట్టారు. ‘నేను నిర్మాత ఏంటి?’ అనడిగాను. పబ్లిసిటీకి సంబంధించి, మిగతా బిజినెస్ కార్యక్రమాలు చూసుకుంటే నష్టం ఏంటి? అనడిగారు. అప్పుడు ఫస్ట్ కాపీ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఒప్పుకున్నాను. అలా నిర్మాత అయ్యాను. ఇప్పుడు నిర్మాతగా సాధక బాధకాలు నాకు కొంతవరకు తెలిసాయి. ఎలాగూ అవగాహన ఉంది కాబట్టి, భవిష్యత్తులో సినిమా నిర్మిస్తానేమో.

 

 తదుపరి చిత్రాలు?

 హను రాఘవపూడి దర్శక్త్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో బాలయ్యబాబు అభిమానిగా నటిస్తున్నా. విచిత్రం ఏంటంటే.. ఈ చిత్రంలో నా చేతికి ‘జై బాలయ్య’ అనే టాటూ ఉంటుంది. ఆ టాటూ చూసి, సినిమా టైటిల్ అదే అనుకుంటున్నారు. కానీ, అది కాదు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top