సినిమా రివ్యూ: గీతాంజలి

సినిమా రివ్యూ: గీతాంజలి


హారర్ కామెడీ చిత్రాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేయడానికి సిద్ధంగా ఉంటారని ‘కాంచన’, ‘ప్రేమకథా చిత్రం‘ ఇతర చిత్రాలు నిరూపించాయి.  అదే హారర్, కామెడీ కథాంశంతో పేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు ఫీల్‌గుడ్ టైటిల్‌తో తాజాగా ‘గీతాంజలి’ అనే చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన మార్కుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అంజలి, కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డిలతో కథా రచయిత కోన వెంకట్,దర్శకుడు రాజ్‌కిరణ్‌లు సంధించిన సరికొత్త అస్త్రం ఎలాంటి అనుభూతిని పంచిందో తెలుసుకోవడానికి కథలోకి వెళ్తాం.

 

 కథ:

 దిల్ రాజుకు కథ చెప్పి సినీ దర్శకుడిగా మారి ఓ నంది అవార్డును సంపాదించాలనే లక్ష్యంతో నందిగామ నుంచి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ చేరుకుంటాడు.  తన మిత్రుడు మధుతో కలిసి చవకగా వస్తుందన్న ఆశతో ఓ స్మశానంకు సమీపంలోని ఓ ఫ్లాట్‌లో నివాస్ అద్దెకు దిగుతారు. అంతకుముందు అదే ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి దెయ్యంగా మారి తిరుగుతూ ఉంటుంది. నందిగామ నుంచి హైదరాబాద్ ప్రయాణంలో ఇష్టపడిన అంజలి అనే అమ్మాయి తరచుగా ఆ ఫ్లాట్‌కు వస్తూ ఉంటుంది.


దిల్‌రాజు క్రియేటివ్ టీమ్ అని చెప్పిశ్రీనివాస్‌ను సత్యం రాజేశ్, జబర్ధస్త్ శంకర్‌లు బురిడీ కొట్టించి ఆ ఫ్లాట్‌లో చేరుతారు. అలా ఫ్లాట్‌లో చేరిన వారికి దెయ్యం రూపంలో ఎదురైన అనుభావాలేమిటి? శ్రీనివాస్‌రెడ్డి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అంజలికి ఆఫ్లాట్‌కు సంబంధమేమిటి? ఆ ఫ్లాట్‌లో యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆఫ్లాట్‌లో నిజంగా దెయ్యం ఉందా? అనే ప్రశ్నలకు కామెడీ టచ్ చేసి హారర్ రూపంలో అందించిన సమాధానమే ’గీతాంజలి’.


 

 సమీక్ష

 దెయ్యాలున్నాయా అనే ప్రశ్నకు సమాధానం పక్కనపెడితే.. దెయ్యాల కథతో వెండితెరపై వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను కొత్త ఒరవడిని సొంతం చేసుకున్నాయి. దెయ్యాల కథ ఎప్పటికి ఓ ఎవర్‌గ్రీన్ సబ్జెక్ట్. సరిగ్గా అలాంటి కథను ఎంచుకుని రెగ్యులర్ పాయింట్‌తో కోన వెంకట్ చేసిన సరికొత్త ప్రయోగం చేశాడు. కోన వెంకట్ పాయింట్‌ను దర్శకుడు రాజ్‌కిరణ్ తెరకెక్కించిన విధానం.. అనుసరించిన కథనం ఖచ్చితంగా సినీ అభిమానులను కొత్త అనుభూతికి గురిచేస్తుంది. హారర్ సినిమాకు కావాల్సిన సీన్లను పక్కాగా సిద్ధం చేసి.. కామెడీ రంగు అద్ది తెరపైన అందంగా గీతాంజలిని తీర్చిదిద్దడంలో కోన వెంకట్ టీమ్ ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు.



కథకు అసవరమైన నటీనటులు అంజలి, బ్రహ్మనందం, శ్రీనివాస్‌రెడ్డి, రావు రమేశ్, శంకర్, సత్యం రాజేశ్, మధుల ఎంపిక చక్కగా కుదిరింది. కథ డిమాండ్ మేరకు శ్రీనివాస్‌రెడ్డి, అంజలి, రావు రమేశ్ ఇతర పాత్రల క్యారెక్టరైజేషన్‌ను పకడ్బందీగా డిజైన్ చేశారు. దాంతో శ్రీనివాస్‌రెడ్డి, అంజలి, రావు రమేశ్‌లు వ్యక్తిగతంగా ఎక్కడ కనిపించరు.. కేవలం పాత్రలే తెరమీద కనిపిస్తాయి.


ఇప్పటి వరకు గ్లామర్ తారగానే ప్రేక్షకులకు సుపరిచితులైన అంజలిని ఓ కొత్త కోణంలో కనిపించిడమే కాకుండా గ్లామర్‌తోనూ మెరిసింది. తన కెరీర్‌లో అంజలికి ఈ చిత్రం దిబెస్ట్‌గా మిగిలడం ఖాయం.  కామెడీ పాత్రలకే పరిమితమైన శ్రీనివాస్‌రెడ్డిని ఓ నటుడిగా ఆవిష్కరించిన చిత్రంగా మారనుంది. కమెడియన్ శంకర్, రాజేశ్‌లు మరోసారి తన సత్తాను చాటారు. ఇక సైతాన్ రాజ్‌గా బ్రహ్మనందం ఫెర్ఫార్మెన్స్  చెప్పడం కన్నా తెరమీద చూడటమే సమంజసం. నిర్మాత దిల్‌రాజు తొలిసారి తెలుగు సినీ తెరపై కనిపించడం విశేషం.

 

 టెక్నికల్:

 సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫిని, ఎడిటర్ ఉపేంద్ర నుంచి మెరుగైన పనిని రాబట్టుకోవడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హారర్ మూడ్‌ను ఎలివేట్ చేయడానికి సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫి కథకు ప్రాణం పోసింది. లక్కరాజు ప్రవీణ్ అందించిన ట్యూన్‌లకు సాయి శ్రీరామ్ తెరమీద అందమైన దృశ్యాలుగా మలిచారు. కాఫీ సాంగ్, ఎండింగ్ టైటిల్స్‌లో బ్రహ్మనందంపై వచ్చే థీమ్ సాంగ్‌లను ఈ చిత్రనికి అదనపు ఆకర్షణ. ప్రేక్షకుల్లో ఓ భయాన్ని కలిగించే విధంగా దృశ్యాలను మలచడంలో సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫి, ప్రవీణ్ నేపథ్య సంగీతం ఎస్సెట్‌గా మారింది.

 

 ముగింపు: చిత్ర తొలిభాగంలో వినోదానికి పెద్ద పీట వేసి.. రెండవ భాగంలో కథలోకి వెళ్లడం వల్ల కొంత వేగం త గ్గినట్టు అనిపిస్తుంది. అయితే సానుకూల అంశాలు ఎక్కువ మోతాదులో ఉన్న కారణంగా కొన్ని లోపాలు అంతగా బయటకు కనిపించవు. హారర్, కామెడి చిత్రాలను ఆదరించేవారికి, కొత్తదనం, వెరైటీ చిత్రాలను ఆశించే వారికి ’గీతాంజలి’ ఓ చక్కటి చిత్రం. ఈమధ్యకాలంలో విడుదలైన హిట్ చిత్రాల్లో ‘గీతాంజలి’ చోటు సంపాదించుకునే అవకాశం పుష్కలంగా ఉంది.

 -రాజబాబు అనుముల

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top