మస్తుందిరా బై... 'ఫిదా' అయితరు

మస్తుందిరా బై... 'ఫిదా' అయితరు


కొత్త సినిమా గురూ ఫిదా



అరే... ఏముందిరా బై సిన్మా! మొన్న శుక్రవారం పొద్దుగల జూసినా. ఇంకా దిమాక్‌ లోంచి యెల్లట్లే! ఆడ సగం ఈడ సగం ఇంగ్లీస్‌ మాటల్తో ‘హ్యాపీడేస్‌’ తీసిండ్రు సూడు... ఈ సిన్మాకు పోయెముందు ఆ డైరెక్టర్‌ పేరు నాక్కూడా జల్దీ యాదికి రాలె. ఆయన సిన్మా తీసి మూడేండ్లు గయిందట. గా శేఖర్‌ కమ్ములనే అమెరికాల, ఆంధ్రాల, తెలంగాణల తెలుగు సిన్మా పిచ్చోళ్లను ఈ సిన్మాతో ‘ఫిదా’ చేసిండు! గట్లయితే గీ సిన్మాలో గంతఘనం ఏముంది? ముచ్చట జెప్తా వినుకోండి!



కథ: వరుణ్‌ (వరుణ్‌ తేజ్‌) అమెరికాలో మెడిసిన్‌ చదువుతున్న ఆంధ్రా పోరడు. అతడికి అమ్మనాయన లేరు. ఓ అన్న, తమ్ముడు. అన్న పెండ్లి కోసమని తెలంగాణల నిజామాబాద్‌లోని బాన్సువాడకు వస్తడు. ఈడ ఓ పోరిని జూసి పిల్లగాడి మనసు ఫిదా అయితది! ప్రేమల పడతడు. గా పోరి ఎవరో కాదు మళ్ళా... అన్నగాడి మరదలు (అన్న పెండ్లి చేసుకున్న పోరి చెల్లెలు) అన్నట్టు! పేరు... భానుమతి (సాయి పల్లవి). అగ్రికల్చర్‌ డిగ్రీ జేస్తుంటది. నాయన అంటే ఆమెకు ప్రాణం. క్యారెక్టర్‌ సంగతికొస్తే, సింగిల్‌ పీస్‌ హైబ్రీడ్‌ పిల్ల, దుండుకు ఎక్కువ అన్నట్టు. గీ పిల్ల కూడా పోరడి మనసు జూసి ‘ఫిదా’ అయితది. ఇంకేముంది? ఖేల్‌ ఖతం దుకాణ్‌ బంద్‌! అన్న పెండ్లి తర్వాత వరుణ్, భానుమతిల పెండ్లే అనుకుంటున్నప్పుడు నడిమిట్ల ఓ తకరారు వచ్చి పడతది. గదేంటంటే... కన్నబిడ్డ లెక్క తండ్రి బాగోగులు జూడనీకి అక్కరకొచ్చెలా పుట్టిన పల్లెల ఉండాలని భానుమతి కోరిక. అమ్మ కోరిక ప్రకారం అమెరికాల న్యూరోసర్జన్‌ జేసి, అక్కడే పెద్ద డాక్టర్‌ అవ్వాలనుకుంటడు వరుణ్‌. దాంతో సంధి కుదరలె. అలగ్‌ సలగ్‌ అన్నట్టు ఎవరి తోవల వాళ్లు పోతరు.



కానీ, ఇద్దరి మనసుల ఒకరిపై ఇంకరికి మస్తు ప్రేమ ఉంటది. ఈడ తెలంగాణల భానుమతి.. ఆడ ఆమెరికాల వరుణ్‌.. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. మనసుల మాత్రం లొల్లి లొల్లి. దిమాక్‌ లోంచి భానుమతి ప్రేమను యెల్లగొట్టడానికి వరుణ్‌ కిందా మీదా పడుతుంటడు. పోరడ్ని మస్తు తిప్పలపాలు జేయడానికి అన్నట్టు... భానుమతి అమెరికాల దిగుతది. గప్పుడేమైంది? సంధి ఎట్లా కుదిరింది? అన్నది సిన్మాకథ



విశ్లేషణ: సిన్మా జూసినోళ్లలో మస్తుమంది ‘హమ్‌ ఫిదా హోగయే’ అంటూ ఫేసుబుక్కు, ట్విట్టర్లలో మస్తు కామెంట్లు పెడుతుండ్రు. గంతలా ఏముందా? అని యాదికి తెచ్చుకుంటే... సిన్మా మొదలైన సంధి, ముగింపుకొచ్చె వరకు తెలంగాణ ఊళ్లలో తోవలపొంటి, చలకలపొంటి (వీధుల్లో, పొలాల్లో) పోయిన (తిరిగిన) ఫీల్‌ ఉంది. సటుక్కున దిమాక్‌లోకి దూరిపోయే అందమున్న పోరి సాయిపల్లవి ఉన్నది. పక్కింటి కుర్రాడిలా సహజంగా నటించిన వరుణ్‌తేజ్‌ ఉన్నడు. లవ్, ఎమోషన్స్‌ ఉన్నాయి. అందుకే, ఈ తెలంగాణ యాస–భాష! నిజం... తెలంగాణ నుడికారానికీ, పల్లె సంస్కృతికి పట్టుపంచె కట్టిందీ ‘ఫిదా’. ఇందులో పెద్ద కథేం లేదు. కానీ, కమర్షియల్‌ లెక్కలకు దూరంగా సాగిన కథనంలో, సిన్మాలో ఓ కొత్తదనం ఉంది. ‘ఎంత ముద్దుగున్నావ్‌ పంచెల. మంచి గాలి కూడా తగుల్తది’– గంటి మాటలు మస్తున్నాయ్‌. దాంతో ‘ఫిదా’లో కొత్తగాలి వీచింది. చూస్తున్నంత సేపు ఇది మన కథే, మన బాధే అన్నట్టుండే ఫీల్‌ కలిగించడంలో శేఖర్‌ కమ్ముల చాలావరకు సక్సెస్‌ అయ్యారు. ‘హేయ్‌ పిల్లగాడా, వచ్చిండే’ పాటలు, వాటిలో వరుణ్‌–పల్లవి మధ్య కెమిస్ట్రీ, శేఖర్‌ కమ్ముల చిత్రీకరించిన విధానం బాగున్నాయి. ఈ రెండిటితో పాటు ‘ఊసుపోదు..’ పాట కూడా కొన్నాళ్లు ప్రేక్షకుల నోళ్లలో నానుతుంది.



జీవన్‌ బాబు నేపథ్య సంగీతం సీన్లలో ఫీల్‌ను మరింత ఎలివేట్‌ చేసింది. హీరోయిన్‌ తండ్రిగా ‘మాభూమి’ ఫేమ్‌ సాయిచంద్, అత్తగా గీతా భాస్కర్‌ (‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ తల్లి), అక్కగా శరణ్య, హీరో అన్నయ్యగా రాజా, స్నేహితుడిగా ‘సత్యం’ రాజేశ్‌ బాగా నటించారు. ఈ సిన్మాకు నిర్మాతలు ‘దిల్‌’ రాజు, శిరీష్‌ మస్తుగనే పైసల్‌ ఖర్చు చేశారు. సగటు శేఖర్‌ కమ్ముల సినిమాలా ‘ఫిదా’ కూడా కాస్త నెమ్మదిగా నడుస్తుంది. కానీ, వరుణ్‌తేజ్‌–సాయిపల్లవిల నటన, శేఖర్‌ కమ్ముల దర్శకత్వం, పాటల ముందు అదేమంత పెద్ద కంప్లయింట్‌ కింద అనిపించదు.

– సత్య పులగం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top