ఉయ్యాలా జంపాలా చిత్రంలో నటించిన వారందరూ దాదాపు అందరూ కొత్తవారే. కాని ప్రమోషన్ కారణంగా  ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి తోడు నాగార్జున, డి. సురేశ్ లాంటి అగ్ర నిర్మాతలు భాగస్వాములు కావడం ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచింది. చిన్న చిత్రమైనా..ఓ భారీ బడ్జెట్ చిత్రానికి లభించే పాపులారిటీని సంపాదించుకున్న ఉయ్యాలా జంపాలా 2013 సంవత్సరాంతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలను పెంచిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు చేరుకుందో తెలుసుకునే ముందు కథ ఏంటో తెలుసుకుందాం...


 


గోదావరి జిల్లా కూనవరం నేపథ్యంగా సాగే పక్కా గ్రామీణ ప్రేమ కథా చిత్రంలో సూరి, ఉమాదేవి బావ, మరదళ్లు.  గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా కనిపించే బావ మరదళ్ల సరసం, చిలిపి తగాదాలు, గిల్లి కజ్జాలు, ఆటపట్టించడం లాంటి తమాషాలు సూరి, ఉమల బాల్యంలో ఓ భాగం. వారి జీవితం అలా సాగిపోతుండగా అనుకొని సంఘటన వారిద్దర్ని మరింత దగ్గరికి చేరుస్తుంది. అంతేకాకుండా సూరిపై తనకు ఉన్న ఇష్టం ప్రేమ అని ఉమకు అర్ధమవుతుంది. అయితే ఇరు కుటుంబాల మధ్య ఉన్న తగాదాల కారణంగా ఉమకు సూరి పెళ్లి సంబంధాన్ని ఖాయం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సూరి ఖాయం చేసిన పెళ్లి ఉమ చేసుకుంటుందా? లేక సూరికి తన ప్రేమను తెలుపుతుందా?  సూరి, ఉమాదేవిల మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్ పెళ్లి వరకు దారి తీస్తుందా అనే సింపుల్ ప్రశ్నలకు సమాధానమే ఉయ్యాలా జంపాలా.


 


సూరిగా రాజ్ తరుణ్, ఉమాదేవిగా అవికాలు నటించారు. తెలుగు తెరకు కొత్తవారైనా ఇద్దరు మెచ్యురిటీతో అద్భుతంగా నటించారు అని చెప్పడం కన్నా ఆ పాత్రల్లో జీవించారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజ్ తరుణ్ చాలా నేచురల్ గా, సూరి పాత్రను అవలీలగా పండించాడు. సూరి పాత్రకు ధీటుగా ఉమాదేవి పాత్రను అవికా అంతే మొత్తంలో మంచి ఎక్స్ ప్రెషన్స్, కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించింది. మొత్తంగా ఉయ్యాలా జంపాలాలో రాజ్ తరుణ్, అవికాలు కీలకంగా మారి, ఒంటి చెత్తో నడిపించారు. మిగతా పాత్రల్లో ప్రతి ఒక్కరు ఉయ్యాలా జంపాలాను ఓ మంచి ఫీల్ గుడ్ మూవీగా మలచడానికి శాయశక్తుల ప్రయత్నించారు. 


 


ఉయ్యాలా జంపాలా చిత్రాన్ని ఓ సింపుల్ కథను ఎంచుకుని దర్శకుడు విరించి వర్మ హ్యాండిల్ చేసిన విధానం ప్రశంసనీయం. గతంలో బావ మరదళ్లు, క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటూ తమలోని ప్రేమను వ్యక్త పరుచుకోలేకపోవడం క్లైమాక్స్ లో ఒక్కటవ్వడం లాంటి కథలు చాలానే వచ్చాయి. అయితే ఈ చిత్రంలో దర్శకుడి ట్రీట్ మెంట్, గోదావరి అందాలు, భాష, యాస ఉయ్యాల జంపాలకు మరింత శోభను తెచ్చాయి. అయితే సెకాండాఫ్ లో కథనంలో వేగం తగ్గినా.. క్లైమాక్స్ లో సర్దుకుంది. దర్శకుడు అక్కడక్కడా తడబాటుకు గురైనట్టు అనిపించినప్పటికి..ఓవరాల్ గా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో ముఖ్యంగా డైలాగ్స్, కామెడీ ఆకట్టుకున్నాయి. పాటలు చెప్పకునే రేంజ్ లో లేకపోయినా సన్ని అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ ఫీల్ ను కంటిన్యూ చేయడంలో నూరుపాళ్లు సఫలమైంది.  కెమెరామెన్, ఎడిటర్ పనితీరు మెరుగ్గా కనిపించింది. 


 


రొటిన్ కథలు, అవసరం ఉన్నా లేకపోయినా వెంటాడే ట్విస్ట్ లతో విసిగిపోయిన ప్రేక్షకులకు ఉయ్యాలా జంపాలా వినోద పరంగా చక్కటి చిత్రంగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం. ముఖ్యంగా సెలవుల్లో సరదాగా వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఉయ్యాలా జంపాలా కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. కోస్తాంధ్ర గ్రామీణ నేపథ్యంతో అశ్లీలత, అసభ్యత లేని స్వచ్చమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 


- రాజబాబు అనుముల